విశాఖ సహా, ఉత్తరాంధ్ర జిల్లాలు మావి. తెలుగుదేశం పార్టీకి ఎదురులేదన్న గర్వాన్ని ఒకే ఒక ఎన్నికతో జగన్ చిత్తు చేశారు. తన తండ్రి వైఎస్సార్ సైతం సాధించలేని విజయాన్ని ఈ మూడు జిల్లాలో సాధించి మొత్తానికి మొత్తం ఊడ్చేశారు.
సరే ఒక ఎన్నికతోనే ఈ మోజు మళ్లీ మాకు మంచి రోజులు రాకుండా పోతాయా అని ఆశ కూడా టీడీపీకి లేకుండా ఇపుడు వైసీపీ సర్కార్ అంతా చేస్తోంది. ఏకంగా ఉత్తరాంధ్రను ఒడిసిపట్టడానికి పాలనా రాజధాని ప్రతిపాదనను తీసుకువచ్చారు. దీని వల్ల స్వామి కార్యం స్వకార్యం రెండూ నిండుగా నెరవేరుతాయి.
ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య పారిశ్రామికవేత్తలతో వీడియో ద్వారా మాట్లాడుతూ చెప్పిన మాట ప్రకారం చూసుకున్నా విశాఖను మించిన టైర్‌వన్ సిటీ మొత్తం పదమూడు జిల్లాలలో ఎక్కడా లేదు. విశాఖ ఒక్కటి మాత్రమే అటు బెంగుళూరు, ఇటు చెన్నైలకు గట్టి పోటీ ఇచ్చే నగరం అని కూడా జగన్ గట్టి అభిప్రాయంతో ఉన్నారు. దాంతో, జగన్ విశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
విశాఖను నంబర్ వన్‌గా చేసేందుకు తగిన కార్యాచరణను కూడా సిద్ధం చేశారు. విశాఖకు మెట్రో రైలు అన్నది వైఎస్సార్ కాలం నాటిది. వైఎస్సార్ మరణంతో అది కూడా ఆగిపోయింది. ఇక, చంద్రబాబు విభజన తరువాత నవ్యాంధ్రకు సీఎం అయ్యారు. ఆయనకు విశాఖ మెట్రో రైలు కంటే విజయవాడ ముఖ్యమైపోయింది. కొత్తగా అక్కడ డీపీఆర్ కోసం ప్రయత్నాలు చేశారు. విశాఖను పక్కన పెట్టారు.
అయితే, జగన్ మాత్రం విశాఖను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద సమగ్రమైన ప్రణాళికను మదిలోనే సిద్ధం చేసుకుని పాలనారాజధానిగా ప్రతిపాదన చేశారనిపిస్తోంది. అందుకే ఆయన మెట్రో రైలును పట్టాలెక్కించనున్నారు.
అదే విధంగా విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాకా మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. అంతే కాదు, భోగాపురం విమానాశ్రయాన్ని సైతం కాలపరిమితిలోపల పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే దానికి మళ్లీ శంకుస్థాపన పనులు ఉంటాయని అంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, ఇటు విశాఖకు కూడా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల పూర్తి ఉపయోగం ఉంటుంది. అభివృద్ధి కూడా శరవేగంగా పరుగులు తీసేందుకు అవకాశం ఉంటుంది.
అదే విధంగా మెట్రోరైలు కనుక పట్టాలెక్కితే విశాఖ నగరం ఉత్తరాంధ్ర జిల్లాలను కలుపుకుని ముందుకు పోతుంది. నగరం కూడా బాగా విస్తరిస్తుంది. అదే విధంగా నగరం పెరుగుతున్నందువల్ల, రాజధాని కనుక అయితే జనాభా కూడా బాగా పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తు అవసరాలను కూడా వైసీపీ సర్కార్ దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లుగా మూడు జిల్లాల దాహార్తిని తీర్చడంతో పాటు, సాగునీరుకు, పరిశ్రమలకు కూడా పూర్తిస్థాయిలో నీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని శరవేగంగా పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. ఇది కూడా వైఎస్సార్ హయాంలోనే పురుడుపోసుకుంది. చంద్రబాబు వచ్చిన తరువాత మళ్లీ శంకుస్థాపన చేశారు కానీ చివరి సంవత్సరంలో మొక్కుబడిగా చేయడం వల్ల అది అలాగే ఆగిపోయింది. ఇపుడు జగన్ ఉత్తరాంధ్రకు భగీరథుడిగా మారి ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు.
అలాగే, నాగవళి, వంశధార ప్రాజెక్టుల అభివృద్ధి పనులను చేపట్టడం ద్వారా శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇక, విశాఖ జిల్లా పాడేరులో వైఎస్సార్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దాంతో, గిరి సీమలలో పెద్ద ఎత్తున అభివృద్ధికనిపించడం ఖాయమని అంటున్నారు.
వీటికి తోడుగా విశాఖతో సహా, ఉత్తరాంధ్రలో ఉన్న అందమైన ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా, షూటింగ్ స్పాట్స్‌గా అభివృద్ధి చేయాలన్నది జగన్ సంకల్పంగా కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖులకు విశాఖను చూపించి సినీ రాజధానిగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.. అదే కనుక జరిగితే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, హైదరాబాద్‌లో స్థిరపడిన సినీ రంగం, టీవీరంగం కూడా విశాఖ వైపు చూసే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇక, విశాఖ నగరం చుట్టూనే కాకుండా ఇతర జిల్లాలకు కూడా పరిశ్రమలను విస్తరించాలని, ఆయా జిల్లాలో ఉన్న స్ధానిక పరిస్థితుల ఆధారంగా వాటికి అవసరమయ్యే పరిశ్రమలను నెలకొల్పాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. దాంతో, ఈ మూడు జిల్లాల ప్రజలు వలస కార్మికులుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి చావు బతుకులతో చెలగాటం ఆడకుండా ఉన్న చోటనే ఉపాధి పొందేందుకు పూర్తి స్ధాయిలో వీలు అవుతుంది.
మొదటి ఏడాది పూర్తి అయింది కాబట్టి విశాఖ అభివృద్ధి మీద ఇప్పటికే రూపొందించిన బ్లూ ప్రింట్‌ను అమలుచేసేందుకు వేగంగా వైసీపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితులలోనూ విశాఖ రాజధాని అవడం ఖాయమని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి చెబుతున్నారు. జగన్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలకు మాట ఇచ్చారని, దానిని ఆయన సాధిస్తారని కూడా అంటున్నారు. మరో వైపు విశాఖకు పాలనా రాజధాని విజయదశమి శుభ ముహూర్తంగా వస్తుందని అంటున్నారు. అంతకంటే మంచి ముహూర్తం లేదని కూడా చెబుతున్నారు. ఆ ముహూర్తాన విశాఖకు రాజధాని వస్తే జగన్‌కు పాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని కూడా అంటున్నారు.
విశాఖ నుంచే జగన్ పాలన చేపడితే మాత్రం రానున్న కాలంలో ఇదే విశాఖ గ్రోత్ ఇంజన్ గా మారి మొత్తం పదమూడు జిల్లాలకూ ఆదాయాన్ని తెచ్చి పోషించడమే కాకుండా చాలా తక్కువ సమయంలోనే సంపన్న రాష్ర్టంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిలిచేందుకు అవకాశాలు ఉంటాయని నగరానికి చెందిన వారంటున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం భావితరాలకు బంగారు బాటలు వేస్తుంద ని కూడా మేథావులు, నిపుణులు అంటున్నారు. మొత్తా నికి విశాఖకు ఇక వైభోగమేనని కూడా చెబుతున్నారు.
పివిఎస్‌ఎస్ ప్రసాద్