ఎస్వీబీసీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించడం ఖాయమని ప్రకటించారు ఆ టీవీ చానల్ నూతన చైర్మన్, నటుడు పృథ్వీ. అవినీతి, అక్రమాలను అరికట్టడం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టిగా ఉన్నారని, తను అక్రమాలకు పాల్పడినా ఆయన సహించేది ఉండదని పృథ్వీ అన్నారు.
ఎవరిమీదా తమకు వ్యక్తిగత విబేధాలూ, కక్షలు లేవన్నారు పృథ్వీ. ఎస్వీబీసీలో గతంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల విషయంలో విచారణ తప్పదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. ముందుగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యలరైజ్ చేయబోతున్నట్టుగా పృథ్వీ తెలిపారు. తను తిరుమల కొండ మీద రాజకీయాలు చేయాలనుకోవడం లేదని, అక్కడ రాజకీయం గురించి మాట్లాడనన్నారు.
ఎస్వీబీసీ ఉద్యోగులను తన కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తానన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, గతంలో జరిగిన అక్రమాల విషయంలో ఎస్వీబీసీ మాజీ చైర్మన్ రాఘవేంద్రరావు పాత్ర ఉన్నా చర్యలు ఉంటాయన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవన్నారు. తను కూడా ఐడెంటెటీ కార్డును వేసుకునే తిరుగుతానని, గత సంస్కృతి మొత్తం మారిపోతుందని పృథ్వీ అన్నారు.
రాఘవేంద్రరావు తన అభిమాన దర్శకుడు అని, ఆయన నిర్వహించిన విధులు ఇప్పుడు తనకు దగ్గడం ఆనందంగా ఉందని ఇటీవలే పృథ్వీ ప్రకటించారు. ఎస్వీబీసీ చైర్మన్ గా రాఘవేంద్రరావు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. సాయంత్ర వేళ ఎస్వీబీసీ పెడితే రాఘవేంద్రరావుకు సన్నిహితులుగా పేరుపొందిన వారి ప్రోగ్రామ్సే అందులో ఎక్కువగా అగుపించేవి. అంతర్గతమైన వ్యవహారాల్లో కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు.