ఆమె జీవితం నిజంగానే సీక్రెట్. కెరీర్ అంతోఇంతో సాఫీగా సాగుతున్న టైమ్ లో ప్రేమలో పడింది. ఆ విషయం బయటపడితే అవకాశాలు రావేమో అనే భయంతో దాచిపెట్టింది. అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత అతడ్ని పెళ్లి కూడా చేసుకుంది. సినిమా ఛాన్సులు మిస్సవుతాయని ఆ విషయాన్ని కూడా దాచిపెట్టింది. ఈ వ్యవహారం ఇక్కడితో కూడా ముగియలేదు. ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. అప్పటికీ తన మేటర్ ను బయటపెట్టలేదు. ఆ హీరోయిన్ పేరు కామ్నా జెఠ్మలానీ.
అవును.. కామ్న జఠ్మలానీ వ్యక్తిగత జీవితం అత్యంత రహస్యం. ఎందుకంటే ఆమె చెప్పే సమాధానం అది తన వ్యక్తిగతమని. తన వ్యక్తిగత విషయాల్ని ఆమె ఎంతలా దాచిందంటే.. ఆమె గర్భవతి అనే విషయం తెలియక, కొంతమంది మేకర్స్ ఆమెను సినిమా ఆఫర్లతో సంప్రదించేవారు. ఆమె గర్భం చూసి అవాక్కయి వెనుదిరిగి వచ్చేవారు.
ఈ విషయాల్ని స్వయంగా కామ్న బయటపెట్టింది.. 2015లో మంచి మంచి స్క్రిప్టులతో తనను సంప్రదించారని, కానీ అప్పటికే తను ప్రెగ్నెంట్ కావడంతో యాక్టింగ్ కెరీర్ ను పక్కనపెట్టేశానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లిద్దరూ కాస్త పెద్దయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వస్తానంటోంది కామ్న. తనకు సూటయ్యే పాత్రలు దొరికితే తిరిగి నటిస్తానంటోంది.
కెరీర్ ప్రారంభంలో.. గోపీచంద్, అల్లరినరేష్ లాంటి హీరోల సరసన నటించిన కామ్న.. మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. నాగ్ నటించిన కింగ్ సినిమాలో కూడా మెరిసింది. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అంటోంది.
లాక్ డౌన్ కు ముందే ఓ స్క్రిప్ట్ ను అంగీకరించానని, వీలైతే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెబుతోంది. ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న కామ్న.. రొటీన్ క్యారెక్టర్ రోల్స్ మాత్రం చేయనని చెబుతోంది. ముంబయికి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడింది.