గత కొంత కాలంగా ఏపీలో తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్రమైన డాక్టర్ సుధాకర్ కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ భార్యతో కలిసి ఇంటికెళ్లాడు. అనంతరం ఆయన కనిపించడం లేదు.
ప్రభుత్వ మత్తు వైద్యుడిగా పనిచేసే డాక్టర్ సుధాకర్ కరోనా నుంచి రక్షణ కోసం తగిన సౌకర్యాలు కల్పించలేదంటూ జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం….ఆ తర్వాత ప్రభుత్వం సస్పెండ్ చేయడం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకు విశాఖలో డాక్టర్ సుధాకర్ హల్‌చల్ సృష్టించడంతో కొత్త వివాదానికి దారి తీసింది.
చివరికి వ్యవహారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరింది. డాక్టర్ సుధాకర్‌పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగి చురుగ్గా విచారణ సాగిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్ సుధాకర్‌పై కూడా సీబీఐ కేసు నమోదు చేయడం గమనార్హం.
ఒక వైపు సీబీఐ విచారణ సాగుతుండగానే, మరోవైపు డాక్టర్ సుధాకర్‌ను అప్పగించాలని ఆయన తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తల్లి వినతిపై స్పందించిన న్యాయస్థానం డాక్టర్ సుధాకర్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. దీంతో విశాఖ మానసిక వైద్యశాల నుంచి ఆయన్ని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం. మానసిక ప్రశాంతత కోసం విశాఖలో ఓ రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిసింది. ఐదురోజుల పాటు ఎవరినీ కలవకూడదని డాక్టర్ సుధాకర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.