ప్రజాస్వామ్యంలో ప్రజలే పభువులు. వారిని తక్కువగా చేసి చూడాలనుకున్నా, మన తెలివితేటలు ఎక్కువ అనుకున్నా కీలెరిగివాత పెడతారు. అదే 2019 ఎన్నికల్లో జరిగింది మళ్ళీ మళ్ళీ అధికారం మాదేనని విర్రవీగిన సైకిల్ పార్టీని జనం చరిత్రలో మరచిపోలేని ఘోర పరభావాన్ని అందించారు.
వైసీపీని బంపర్ మెజారిటీతో ఎన్నుకున్నారు కూడా. ఏడాది జగన్ పాలన బాగుందని సీ ఓటర్ సర్వే కూడా తాజాగా తేల్చింది. అయితే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి మాత్రం మరోలా కనిపించడమే చిత్రం.
జనం ఖర్మకాలి వైసీపీని నెత్తినెక్కించుకుంటున్నారని అయ్యన్న ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ పనితీరు అసలు బాలేదని కూడా అనేస్తున్నారు. మరి ఏడాదితో 90 శాతం హామీలు నెరవేర్చిన సర్కార్ పనితీరే బాలేదు అనుకుంటే హామీలన్నీ పక్కన పెట్టిన టీడీపీ సంగతేంటి అయ్యన్నా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
జనం ఖర్మ కాలి అన్న పెద్ద మాట వాడుతున్న అయ్యన్న అదే జనం తన ఖర్మ కాలిందనే టీడీపీని దించేశారని ఒప్పుకుంటారా అని కూడా నిగ్గదీస్తున్నారు. విమర్శలు చేయాలనుకుని చేయడం అయ్యన్నకు అలవాటుగా మారిందని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా జనం ఎపుడూ తమ ఖర్మ కాల్చుకోరని, పని చేయని పార్టీలకే కర్రు కాల్చి గట్టిగానే వాతలు పెడతారని ఇప్పటికీ అయ్యన్న తెలుసుకోకపోవడమే విచిత్రమని అంటున్నారు.