నాయకులు తమ మీద అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు కౌంటర్లు వేయడంలో చెలరేగిపోతూ ఉంటారు. వందల వందల కోట్లకు పరువునష్టం దావావేస్తా అంటూ గర్జిస్తుంటారు. అలాంటి వార్తలు కూడా పేపర్లో వస్తాయి. ఒకసారి పేపర్లో విషయం వచ్చేసిన తర్వాత వారికి కిక్కు దిగిపోతుంది. ఇక పరువు నష్టం దావా వేయడం గురించి, తద్వారా జరిగే విచారణ గురించి వారు సాధారణంగా పట్టించుకోరు. కానీ కర్నాటక రాజకీయాల్లో కాంగ్రెస్ తురుపుముక్క మాజీమంత్రి డికె శివకుమార్ సంగతి వేరు. ఆయన ప్రకటనలేమీ చేయలేదు గానీ.. తన మీద విమర్శలు చేసిన నాయకుడిపై ఏకంగా 204 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
పరువునష్టం దావా వేయడం అనేది ప్రెస్ మీట్ పెట్టినంత సులభం కాదు. కోర్టు డిపాజిట్ లను చాలా పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సాధారణంగా నాయకులు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత.. కేసు వేయకుండా మిన్నకుండిపోతారు. అక్కడే శివకుమార్ ప్రత్యేకంగా నిలిచారు. ఏకంగా 1.04 కోట్లు ధరావత్తు కోర్టుకు చెల్లించి మరీ ఆయన కేసు వేశారు. విజయపుర ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాళ్ పై ఆయన కేసు వేశారు. విచారణ జరుగుతోంది.
యింతకూ శివకుమార్ కు అంతగా కోపం వచ్చేలా యత్నాళ్ ఏం అన్నారు? ఇవాళ్టి రోజుల్లో ఉన్న మామూలు చౌకబారు రాజకీయ విమర్శలతో పోల్చినప్పుడు అది పెద్ద సీరియస్ సంగతికాదు. డీకే శివకుమార్… తన మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ కేసులను ఎత్తేయించుకోడానికి కేంద్రంలోని భాజపా పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నాడంటూ యత్నాళ్ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తాను అడ్డు పడకుండా ఉంటానని కూడా యత్నాళ్ అన్నారు. ఆ మాటకొస్తే.. డీకే శివకుమార్ భాజపాలో చేరుతారని, ఆ పార్టీనుంచి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారని కూడా కొన్ని పుకార్లు వచ్చాయి.
ఈ మాటలే డీకేఎస్ కు మంట పుట్టించాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నప్పుడు వెనక్కు తేవడానికి కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ఇలాంటి నేపథ్యంలో.. తన మీద యత్నాళ్ చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డ ఆయన ఏకంగా 204 కోట్ల విలువైన పరువు పోయిందంటూ కోర్టుకెక్కడం విశేషమే.