పాఠశాలల్లో నాడు-నేడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆలోచన జగన్ కి ఎప్పుడొచ్చిందో కానీ, అదో బృహత్తర ప్రణాళిక అని చెప్పుకోవాలి. ప్రతిపక్షాలు సైతం అవాక్కయ్యేలా, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా మెచ్చుకునేలా ఈ కార్యక్రమం అమలవుతోంది. దాని ప్రతిఫలాలు నేడు ప్రజలందరికీ సాక్ష్యంగా కనపడుతున్నాయి.
నాడు-నేడు కింద చేపట్టిన తొలివిడత పనులను తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం పాఠశాలలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ పనులను విద్యార్థులకు అంకితమిస్తారు. అంతే కాదు, అక్కడినుంచే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడతారు. విద్యా కానుక కిట్లను కూడా పంపిణీ చేస్తారు.
ఏపీలో మొత్తం 44,639 ప్రభుత్వ పాఠశాలలుండగా, అందులో 15,715 బడుల్లో నాడు-నేడు మొదటి దశ మొదలుపెట్టారు. దాదాపు అన్నిచోట్లా పనులు పూర్తయ్యాయి. మొత్తం 10 రకాల సదుపాయాలను కల్పించారు.
రంగులు వేయడం దగ్గర్నుంచి కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, మొక్కల పెంపకం, మంచినీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయం.. ఇలా అన్ని పనులు పూర్తి చేశారు. నాడు-నేడు అంటూ ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, చాలా చోట్ల కనపడుతున్న వాస్తవాలు జగన్ ముందుచూపుని చెప్పకనే చెబుతున్నాయి.
నాడు-నేడు గురించి వైసీపీ నాయకులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రచారం చేసుకోనక్కర్లేదు. ప్రతి ఊరిలో, ప్రతి స్కూల్ లో తేడా స్పష్టంగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ విజయాన్ని కళ్లకు కడుతోంది.
ఇక స్కూళ్లు కూడా ఇదే రోజునుంచి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 61,137 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు పునఃప్రారంభం అవుతున్నాయి. స్కూల్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా విద్యా కానుకను కూడా ఇదే రోజు అందిస్తారు. దాదాపు 45.38 లక్షలమంది పిల్లలకు విద్యాకానుక కిట్లను అందిస్తారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా ఆయా స్కూళ్లకు చేరుకుంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల వల్ల ప్రైవేట్ స్కూల్స్ మాన్పించి మరీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు.