Advertisement

Advertisement


Home > Politics - Gossip

కలం కులం రాతలు

కలం కులం రాతలు

మీడియా అనేది బాధ్యతాయుతంగా వుండాలి. జనాలను రెచ్చగొట్టే రాతలు రాయకూడదు. కులాలు, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నాలు చేయకూడదు. ఇలాంటి సుద్దులు ఎన్నో వున్నాయి. కానీ తమ తమ స్వప్రయోజనాల కోసమో, తమ తమ సామాజిక ప్రయోజనాల కోసమో, మీడియా కట్టు తప్పి వ్యవహరిస్తోంది. ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా ప్రభుత్వాన్ని బలహీనపర్చడం కోసం వాడుకుంటోంది. ఈ కింది వార్త చూస్తే మీడియా దిగజారుడు అర్థం అయిపోతుంది.

గుంటూరులో ఇద్దరు ప్రేమికుల మధ్య మాట మాట వచ్చింది. ఆ ప్రియుడు తన ప్రియురాలిని విచక్షణారహితంగా పొడిచి చంపేసాడు. సహజంగానే జనం చోద్యం చూస్తూ వున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది వార్త. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే బలైపోయిన అమ్మాయి కులం. ఇప్పుడు ఆ కులాన్ని ఫోకస్ చేసి ప్రభుత్వాన్ని పలుచన చేయాలి. ఆ కులానికి రక్షణలేదు అన్నదిశగా సంఘటనను ఫోకస్ చేయాలి. 

ఈ విధంగా సాగిన వార్తను ముందు చదవండి..

''...గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలైపోయింది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెపై ప్రేమోన్మాది కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశాడు. ఓ పక్క వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న సమయంలోనే ఈ దారుణం జరగడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన నల్లపు వెంకటరావు కుమార్తె రమ్య(19) గుంటూరు సమీపంలోని సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది.

నెలరోజుల క్రితం పరీక్షలు రాసేందుకు పెదకాకాని రోడ్డు పరమయ్యకుంటలోని నాయనమ్మ ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఆమెకు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన శశికృష్ణతో పరిచయం ఏర్పడింది. . అతను ప్రేమిస్తున్నానంటూ రమ్య వెంటపడేవాడు. ఆదివారం ఉదయం రమ్య బయటకు వెళ్లి నాయనమ్మకు టిఫిన్‌ తీసుకొచ్చింది. కొద్దిసేపటికే శశికృష్ణ ఫోన్‌ చేయగా ఇప్పుడే వస్తానని నాయనమ్మతో చెప్పి బయలుదేరింది. రోడ్డుపైకి వచ్చిన రమ్య శశికృష్ణ బండి ఎక్కి రోడ్డు దాటి ముందుకు వెళ్లింది. 

ఇంతలో అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో రమ్య బైకు దిగిపోయి రోడ్డు ఇవతలి పక్కకు వచ్చేసింది. శశికృష్ణ వెంటనే బైకు తిప్పి వచ్చి రమ్యను చేత్తో రెండు దెబ్బలు కొట్టాడు. కింద పడిన ఆమెను తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా ఆరు పోట్లు పొడిచాడు. జనం గుమిగూడటంతో నిందితుడు అక్కడి నుంచి పరారై, తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేశాడు. బాధితురాలిని 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, కొన్ని నిమిషాలకే తుదిశ్వాస విడిచింది. తండ్రి వెంకటరావు, ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని గుండెలు బాదుకుంటూ విలపించారు. మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా రోదించారు....''

వార్తలో ఎక్కడన్నా కులం ప్రస్తావన వుందా? కానీ దానికి పెట్టిన శీర్షిక చూడండి. 

పట్టపగలు..నడిరోడ్డుపై దళిత విద్యార్థిని దారుణ హత్య

ఇక్కడ కులం ప్రస్తావన ఏ విధంగా సబబు? ఎందుకోసం?

పైగా ఘనత వహించిన, నలభై ఏళ్లు రాజకీయ అనుభవం వెనకేసుకున్న చంద్రబాబునాయుడు గారు అయితే మరీనూ..సడెన్ గా రోడ్ మీద ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ఘర్షణకు ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు బాధ్యత ఎంత వరకు? ప్రతి ప్రేమికుల జంట వెనుక ఓ పోలీసును కాపలా వుంచలేరు కదా? 'దళిత మహిళ హోం మంత్రిగా వున్నా దళితులపై దాడులు ఆగడం లేదు' అన్నది బాబుగారి కామెంట్. 

మళ్లీ ఇది ఎక్కడ దళిత హోం మంత్రి వైఫల్యం అంటారో అని ఆమె షాడో హోం మంత్రి చేతిలో కీలుబొమ్మగా మారిందనే మరో కామెంట్. మరి ఇలా కామెంట్ చేయడం కూడా ఓ దళిత మహిళను కీలుబొమ్మ అని కామెంట్ చేస్తూ, ఆమె సామర్థ్యాన్ని విమర్శించడమే కదా.

మొత్తానికి మన మీడియా 'కుల' కట్టుబాట్లలో చిక్కి, 'కులాలను' టార్గెట్ చేసి, 'కలం' రాతలకన్నా కులం రాతలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?