సినిమా రంగంలో… కిరీటం లేని రాచ‌రికం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టిలో రాజ‌కీయం కూడా ఓ సినిమానే. కాక‌పోతే సినిమాల్లో 24 గంట‌లూ బిజీగా ఉంటారాయ‌న‌. రాజ‌కీయాల విష‌యానికి వ‌చ్చే స‌రికి తీరిక దొరికిన‌ప్పుడు, పండుగ‌ల‌కో, ప‌బ్బాల‌కో అన్న‌ట్టు అలా వ‌చ్చి… ఇలా…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టిలో రాజ‌కీయం కూడా ఓ సినిమానే. కాక‌పోతే సినిమాల్లో 24 గంట‌లూ బిజీగా ఉంటారాయ‌న‌. రాజ‌కీయాల విష‌యానికి వ‌చ్చే స‌రికి తీరిక దొరికిన‌ప్పుడు, పండుగ‌ల‌కో, ప‌బ్బాల‌కో అన్న‌ట్టు అలా వ‌చ్చి… ఇలా వెళుతుంటారు. వేడుక‌ల్లో పాల్గొన్న‌ప్పుడు రెండు సినిమా డైలాగ్‌లు చెప్పి… తుర్రుమ‌ని వెళ్లిపోతుంటారు. కానీ రాజ‌కీయాల‌కు సంబంధించి తాను వ‌ల్లె వేస్తున్న నీతులు…సినిమా రంగంలో త‌న‌కూ వ‌ర్తిస్తాయ‌ని ఆయ‌న ఎందుకు భావించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో మువ్వ‌న్నెల జెండాను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఎగుర వేశారు. స‌హ‌జంగానే త‌న‌కు దేశ భ‌క్తి గుండెల్లోనే కాదు, ఒళ్లంతా ఉంటుంద‌ని పూన‌కం వ‌చ్చిన వాడ‌ల్లా మామూలు రోజుల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఊగిపోతుండ‌డం చూస్తుంటాం. అలాంటిది ఇక స్వాతంత్ర్య వేడుకంటే…ఆయ‌న మాట‌లు, న‌డ‌వ‌డిక ఏ విధంగా ఉంటుందో ఓ అంచ‌నాకు రావ‌చ్చు.

“కిరీటం మిన‌హా …నేటి రాజ‌కీయ వ్య‌వ‌స్థ రాచ‌రికానికి ఎంత మాత్రం తీసిపోదు. నేత‌లు త‌మ పిల్ల‌ల‌కు రాజ‌కీయ వార‌స‌త్వం క‌ట్ట‌బెడుతున్నారు. ప‌న్నుల రూపంలో ప్ర‌జ‌లు క‌ట్టే డ‌బ్బుతో ఇచ్చే ప‌థ‌కాల‌కు, ముఖ్య‌మంత్రులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటున్నారు. వారెవ‌రూ దేశం కోసం ప‌ని చేయ‌లేదు” అని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ధ్వ‌జ‌మెత్తారు. మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించిన సినిమా రంగం మాటేమిటి? అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

రాజ‌కీయ వ్య‌వ‌స్థ కంటే భిన్నంగా సినీ రంగం ఉందా? అని నెటిజ‌న్లు నిగ్గ‌దీసి అడుగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, నాగ‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, నిహారిక‌, నిర్మాత‌గా చిరు పెద్ద కుమార్తె సుస్మిత‌, అలాగే హీరోగా చిరు చిన్న‌ల్లుడు క‌ల్యాణ్‌దేవ్‌, అల్లు రామ‌లింగ‌య్య వార‌స‌త్వంగా అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్‌, శిరీష్‌…త‌దిత‌రుల మాటేమిట‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్ని స్తున్నారు. త‌న కుటుంబానికి మాత్రం వార‌స‌త్వం వ‌ర్తించ‌దా? అని నిల‌దీస్తున్నారు.

త‌న‌కో నీతి, ఇత‌రుల‌కైతో మ‌రొక‌టా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌జాద‌ర‌ణ ఉంటేనే లీడ‌ర్లు అవుతార‌ని, కానీ సినిమాల్లో అలాంటి ప‌రిస్థితి ఉండ‌డం లేంటున్నారు. ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌వంతంగా త‌మ హీరోల‌ను రుద్ద‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఎదుటి వాళ్ల‌ను నిల‌దీయ‌డానికి నైతికత‌ ఉండాల‌ని, వార‌స‌త్వం గురించి మాట్లాడే హ‌క్కు ప‌వ‌న్‌కు ఎంత మాత్రం లేద‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. ఎందుకంటే ప‌వ‌న్ మాట‌ల్లో చెప్పాలంటే… సినీ రంగంలో మెగాస్టార్‌, అల్లు వారి రాచ‌రికం కొన‌సాగుతోంద‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.