రేవంత్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అదుర్స్‌

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించేందుకు టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స‌హ‌జంగానే అధికార పార్టీ టీఆర్ఎస్‌కు అనేక అంశాలు క‌లిసి వ‌స్తాయి. అలాగని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోరాటాన్ని వ‌దిలేయ‌డానికి…

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించేందుకు టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స‌హ‌జంగానే అధికార పార్టీ టీఆర్ఎస్‌కు అనేక అంశాలు క‌లిసి వ‌స్తాయి. అలాగని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోరాటాన్ని వ‌దిలేయ‌డానికి సిద్ధంగా లేవు. ఈ ఉప ఎన్నిక‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేందుకు ప్ర‌త్య‌ర్థులు వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నూత‌న ర‌థ‌సార‌థి రేవంత్‌రెడ్డి త‌మ అభ్య‌ర్థి ఎంపిక‌లో భాగంగా చేసిన సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అదిరిపోయింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

హుజూరాబాద్‌లో వివిధ కులాల ఓట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌మ అభ్య‌ర్థిగా కొండా సురేఖ‌ను నిల‌బెట్టాల‌ని రేవంత్‌రెడ్డి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇక అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో హుజూరాబాద్‌లో మూడు పార్టీల అభ్య‌ర్థులు వేర్వేరు కులాలకు ప్రాతినిథ్యం వ‌హించిన‌ట్టైంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీ‌నివాస్ (యాద‌వ్‌), బీజేపీ అభ్య‌ర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ (ముదిరాజ్‌), కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కొండా సురేఖ (ప‌ద్మ‌శాలి) బ‌రిలో నిల‌వ‌నున్నారు.

హుజూరాబాద్‌లో వివిధ కులాల ఓట్లు, అభ్య‌ర్థుల బ‌లాబ‌లాలేంటో తెలుసుకుందాం. హుజూరాబాద్‌లో మొత్తం ఓట‌ర్లు 2,26,590 మంది. ఇందులో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు 22,600 మంది, మున్నూరు కాపు ఓట‌ర్లు 29,100, ప‌ద్మ‌శాలి 26,350, గౌడ 24,200, ముదిరాజ్ 23,220, యాద‌వ 22,150, మాల 11,100, మాదిగ 35,600, ఎస్టీలు 4,220, నాయీబ్రాహ్మ‌ణ 3,300, ర‌జ‌క 7,600,మైనార్టీ 5,100, ఇత‌ర కులాల వాళ్లు 12,050 మంది ఉన్నారు.

అధికార పార్టీ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్‌ యాద‌వ్ సామాజిక ఓట‌ర్లు 22,150 మందితో పాటు ద‌ళిత బంధు ప‌థ‌కంతో అత్య‌ధికంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 33,600 మంది ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌చ్చ‌నేది అధికార పార్టీ ఎత్తుగ‌డ‌. అలాగే ఇత‌రేత‌ర ప్ర‌లో భాలు పెట్టి మంచి మెజార్టీ సాధించాల‌నే ఎత్తుగ‌డ‌తో అధికార పార్టీ ధీమాగా ముందుకెళుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. 

ఇక బీజేపీ విష‌యానికి వ‌స్తే ..ఈట‌ల రాజేంద‌ర్ సుదీర్ఘ‌కాలంగా అక్క‌డ రాజ‌కీయం చేస్తున్నారు. ఆయ‌న సామాజిక వ‌ర్గం ముది రాజ్‌ల‌తో పాటు ఆయ‌న భార్య జ‌మున రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట్లు క‌లిసొస్తాయ‌ని భావిస్తున్నారు. ఇక బీజేపీకి సంప్ర‌దాయంగా వ‌చ్చే ఓట్లు అద‌న‌పు బ‌ల‌మ‌ని న‌మ్ముతున్నారు.

కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా సురేఖ విష‌యానికి వ‌స్తే …ఆమె సామాజిక వ‌ర్గం ప‌ద్మ‌శాలీల ఓట్లు 26,350, అలాగే ఆమె భ‌ర్త కొండా ముర‌ళి సామాజిక వ‌ర్గం మున్నూరు కాపు ఓట‌ర్లు 29,100 మంది, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ సామాజిక వ‌ర్గం రెడ్ల ఓట్లు ఎంతో కొంత క‌లిసి వ‌స్తాయ‌ని కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టుకుని ఉంది. 

అస‌లు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఉనికే లేద‌ని, ప్ర‌ధానంగా బీజేపీ-టీఆర్ఎస్ మ‌ధ్యే పోటీ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్న త‌రుణంలో కొండా సురేఖ అభ్య‌ర్థిత్వం స‌రికొత్త చ‌ర్చ‌కు దారి తీసింది. కులం కేంద్రంగానే హుజూరాబాద్‌లో ఎన్నిక ఫ‌లితం ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే ఏ పార్టీ అంచ‌నాలు నిజ‌మ‌వుతాయ‌నేదే ఇక్క‌డ ప్ర‌శ్న‌.