సంచలనం సృష్టించిన గుంటూరు ఇంజినీరింగ్ స్టూడెంట్ హత్య కేసులో గంటల వ్యవథిలోనే నిజానిజాల్ని వెలికితీశారు పోలీసులు. ఆన్ లైన్ స్నేహం వల్లనే ఈ హత్య జరిగిందనే విషయాన్ని గుర్తించారు. నడిరోడ్డుపై స్టూడెంట్ రమ్యను హత్య చేసిన నిందితుడ్ని శశికృష్ణగా గుర్తించిన పోలీసులు, రాత్రి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇనస్టాగ్రామ్ స్నేహం
గుంటూరుకు చెందిన రమ్య, చేబ్రోలులోని ఓ మైనారిటీ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. అక్క మౌనికతో కలిసి గుంటూరు పరమయ్యగుంటలో నాన్నమ్మ ఇంటి వద్ద ఉంటోంది. వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన శశికృష్ణతో ఈమెకు ఇనస్టాగ్రామ్ లో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నారు కూడా.
ఈ క్రమంలోనే హత్య ఘటన జరగడానికి కొద్దిసేపు ముందు ఇద్దరూ పరమయ్యగుంట వద్ద హోటల్ సమీపంలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఏదో అంశంపై గొడవపడ్డారు. రమ్య వెళ్లడానికి ప్రయత్నించగా, శశికృష్ణ అడ్డుకున్నాడు. ఆమె చేయి పట్టుకొని లాగాడు. చేతితో ఉన్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
నిందితుడి నేపథ్యం ఇది
నిందితుడు శశికృష్ణకు సరైన కుటుంబ నేపథ్యం లేదు. ఇతడి తల్లిదండ్రులు విడిపోయారు. వేరువేరుగా ఉంటున్నారు. శశిశకృష్ణ అప్పుడప్పుడు తన తండ్రి, తల్లి ఇళ్లకు వెళ్లి వస్తుంటాడు. తల్లిదండ్రుల సంరక్షణ లేకపోవడంతో చెడు స్నేహాలకు, దొంగతనాలకు, ఆకతాయి పనులకు అలవాటుపడ్డాడు.
హత్య చేయడానికి ముందు రోజు గ్రామస్థుల చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. ఊరిలో ఉన్న ఓ ట్రాక్టర్ నుంచి డీజిల్ దొంగతనం చేయడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. గ్రామస్తులు దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు. ఇది జరిగిన మరుసటి రోజే రమ్యను హత్య చేశాడు శశికృష్ణ.
వృద్ధురాలి ప్రయత్నం.. కాపాడలేని ప్రాణం
నడిరోడ్డుపై రమ్యను అత్యంత కిరాతకంగా శశికృష్ణ హత్య చేస్తుంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్న చేయలేదు. అంతా సినిమా చూస్తున్నట్టు చూశారు తప్ప అడ్డుకోలేదు. ఆ టైమ్ లో అక్కడే ఉన్న ఓ వృద్ధురాలు మాత్రం శశికృష్ణను వారించే ప్రయత్నం చేసింది.
అయితే అప్పటికే శశికృష్ణ, రమ్యను తీవ్రంగా గాయపరిచి అక్కడ్నుంచి పారిపోయాడు. వృద్ధురాలికి ఉన్నపాటి మానవత్వం కూడా చుట్టుపక్కల వ్యక్తులకు లేకపోవడం అత్యంత బాధాకరం. యువతి గొంతుభాగంలో ఒకటి, ఛాతిపై ఒకటి, కడుపు భాగంలో మూడు కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.
జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. సోషల్ మీడియా స్నేహాలపై అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. మహిళలు, యువతులపై దాడులు చేస్తే కఠినశిక్షలు తప్పవని హెచ్చరించారు. జరిగిన ప్రతి ఘటనను రాజకీయ కోణంలో చూడొద్దని, ఇలాంటి వికృత పోకడల్ని సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.