జనంలో లేని నాయకులు

మండుటెండల్లో అలుపెరుగని పాదయాత్ర చేసి పేదల గుడిసెల్లో పెరుగన్నాలను గోరుముద్దలుగా తిన్న ఆత్మబంధువు జగన్ ఇప్పుడెక్కడ? Advertisement మురికివాడల్లో జనం మధ్య తిరుగుతున్నప్పుడు వారి అభిమానం పెల్లుబికి బుగ్గ మీద ముద్దులు పెడితే నవ్వుతూ…

మండుటెండల్లో అలుపెరుగని పాదయాత్ర చేసి పేదల గుడిసెల్లో పెరుగన్నాలను గోరుముద్దలుగా తిన్న ఆత్మబంధువు జగన్ ఇప్పుడెక్కడ?

మురికివాడల్లో జనం మధ్య తిరుగుతున్నప్పుడు వారి అభిమానం పెల్లుబికి బుగ్గ మీద ముద్దులు పెడితే నవ్వుతూ పెట్టించుకున్న ఆ ఆప్తసింధువు జగన్ ఇప్పుడెక్కడ?

ఎప్పటికీ జనంలోనే, జనంతోనే ఉంటాడనుకున్న ఆ జన నాయకుడు ఎక్కడ?

సోనియా గాంధిని సైతం ఢీకొన్న ఆ ధిక్కార ధోరణి ఇప్పుడెక్కడ?

ఏ క్షణాన 23 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు టీడీపీకి వచ్చాయో ఆ క్షణం నుంచి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి దైవలీలని పూర్తిగా నమ్మడం మొదలుపెట్టారు. ఎన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లనైతే వైసీపీ నుంచి టీడీపీ లాక్కుపోయిందొ సరిగ్గా అన్నే సీట్లతో టీడీపీకి దేవుడు బుద్ధి చెప్పాడని జగన్ బలంగా నమ్మారు. అదే విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. పైగా ఫలితాలు వచ్చిన తేదీ కూడా 23 కావడం (23 మే 2019) దేవుడు తన పక్కనే ఉన్నాడన్న భావనని ఆయనకు కలగజేసింది.

పదవిలోకి వచ్చినప్పటినుంచీ తన దృష్టంతా నవరత్నాల మీదే. దైవం తన పక్కన ఉన్నాడన్న భావనతో ప్రజలకి ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు పరచాలనుకున్నారూ. అనుకున్న విధంగా అన్ని పథకాలు ఒకేసారి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇంత స్థాయిలో సంక్షేమం మునుపు ఏ ప్రభుత్వమూ చెయ్యలేదన్నది వాస్తవం.

అయితే దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదని ఒక సామెత ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ సొంత వర్గంలోనే జగన్ మోహన్ రెడ్డిపై అసంతృప్తి బయలుదేరింది. దానికి కారణాలు అనేకం. బాహాటంగా చెప్పుకోకుండా లోలోపల మదనపడే లాంటివి అందులో కొన్నున్నాయి.

ఉదాహరణకి పథకాల సొమ్ముని ప్రజల ఖాతాల్లోకి జమ చేసే అధికారులు, ఉద్యోగులు ఉంటారు. ఎవరెవరికి ఎంత వెళుతుందో వాళ్లకి తెలుస్తూనే ఉంటుంది. కరోనా కారణం కావచ్చు మరొక ఇబ్బంది కావచ్చు ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతాలను జాప్యం చేసింది తప్ప పథకాలు మాత్రం టంచనుగా నడుపుతోంది. సరిగ్గా ఇక్కడే కొందరు ప్రభుత్వోద్యోగుల్లో అసంతృప్తి. తమకి జీతాలు సమయానికి రావు గానీ ప్రజలందరికీ అప్పళంగా ఇంతేసి పంచుతున్నాడంటూ చేతులు పిసుక్కుంటున్నారు, చెవులు కొరుక్కుంటున్నారు.

“ఈ ఉద్యోగం చేసుకునే కన్నా పథకాలతో బతికేయడం బెటర్. పేదవాడిగా పుట్టినా బాగుండేది”, అని ఒక ప్రభుత్వోద్యోగి అన్నమాటని పాజిటివ్ గానూ, నెగటివ్ గానూ, వ్యంగ్యంగానూ, గంభీరంగానూ విశ్లేషించుకోవచ్చు.

ముఖ్యమంత్రి గదిలో కూర్చుని కథ నడిపిస్తున్నారు కనుక ఇలాంటి లోపలి విషయాలు తెలుసుకోలేకపోతున్నారు.

ఎంత గూడచారి వ్యవస్థ ఉన్నా పూర్వం మహారాజులు సైతం మారువేషంలో నగరసంచారం చేసేవారు. జనం పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ఆ పనిలోని అంతరార్థం. ఇప్పుడు మారువేషాలక్కర్లేదు కానీ వ్యక్తిగతంగా ఉద్యోగుల్ని, ప్రజల్ని కలవాల్సిన బాధ్యత నాయకుడికుంటుంది కదా!

ఇదిలా ఉంటే లిక్కర్ విధానం మీద విపరీతమైన నెగటివిటీ పెరుగుతోంది. సొంతవాళ్లు, బయటివాళ్లు నమ్మేది ఒక్కటే. సీయం గారు తమకి అయినవాళ్ల లిక్కర్ బ్రాండ్స్ ని పెంచిపోషిస్తున్నారని..ఆఖరికి వాటర్ బాటిల్స్ కూడా ఫలానా బ్రాండ్ వే పెడుతున్నారు వైన్ షాప్స్ లో. ఇక్కడ కూడా సామాజిక వ్యాపార న్యాయం లేదు. ఇక ఆ లోకల్ లిక్కర్ తాగినా ఫలితం ఉండట్లేదని, కనుక పక్క రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు మద్యప్రియులు.

ఇలాంటి విషయాలన్నీ జనంలో కలిసి తిరిగితేనే తెలుస్తాయి. తప్పు జరుగుతుంటే సరిదిద్దుకోవడానికి, తప్పుగా అనుకుంటే నచ్చజెప్పడానికి వీలుంటుంది. అయినా పేదల వోట్ బ్యాంక్ ని అస్సలు నమ్మకూడదు. ఏ క్షణాన్నైనా మూకుమ్మడిగా లాయల్టీస్ ని మార్చేయగలరు. అటువంటి పరిస్థితి రాకూడదంటే వాళ్లని కలిసి వాళ్ల మనసు తెలుసుకోవాలి.

మంట ఏ మూల పుట్టినా అడవిని దహిస్తుంది. అసంతృప్తి ఏ వర్గంలో మొదలైనా క్రమంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు అగ్నిని ఆర్పేసేలా అసంతృప్తిని కూడా ఆర్పి వేయాలి. దానికి ప్రజాయాత్ర ఒక్కటే మార్గం.

అసలు జగన్ నాయకుడయ్యిందే సోనియా గాంధీని ధిక్కరించి. కానీ ఇప్పుడు నరేంద్ర మోదికి విధేయుడిగా కనిపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే ధోరణి కనిపించడంలేదు.

శిఖరం ఎక్కడం ఒక ఎత్తైతే, అక్కడ కొన్నేళ్లు ఉండడానికి పడాల్సిన కష్టం కూడా ఉంటుంది. ఆ కష్టమే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పడాలి.

ప్రస్తుతానికి లోకేష్, పవన్ కళ్యాణ్ వీక్ వికెట్లుగా ఉన్నారు కనుక జగన్ మంచి ప్లేయర్ గా కనిపిస్తున్నారు. అంటే సొంత బలం కంటే ప్రత్యర్థుల బలహీనత మీద తన పార్టీని నడిపిస్తున్నారు. వెంటనే సరిదిద్దుకోకపోతే ఈ పరిస్థితి ఎల్లకాలం ఉండదు.

జగన్ బయటికి రావాలి. తన సొంత బలం ప్రజాయాత్ర ద్వారా అంచనా కోవాలి.

ఇక చంద్రబాబు నాయుడు విషయానికొస్తే ఆయన పూర్తిగా జూం కాల్స్ కే పరిమితమయ్యారు. మొన్నామధ్య ప్రాంతీయ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక సమయంలో మాత్రమే ఆయన బయటికొచ్చారు. గట్టి ప్రచారం చేసారు. కానీ ప్రజలు అస్సలు తన వైపుకి తిరగలేదు. బహుశా ఆ బాధతోనే అందని ద్రాక్షకోసం ఎగరడమెందుకని ఆయన ఇంట్లోనే కూర్చుని రాజకీయ కుయుక్తులు పన్నుతూ ఉండి ఉండొచ్చు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయువుపట్టైన పథకాల అమలులో అంతరాయం కలిగే విధంగా కేంద్ర నిధులు ఆలస్యమయ్యేలా తన టీం తో కొన్ని పన్నాగలు రచిస్తున్నారని వినికిడి.

ఇదే నిజమైతే ఇంతకన్నా విలనిజం ఇంకొకటి ఉండదు. దీనికన్నా జనయాత్ర చేసి ప్రజలతో మమేకమై వారి మనసులో మాటని కనిపెట్టడమే ఉత్తమ నాయకుడి లక్షణం. ఆ మార్గంలో వెళితే మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులేయొచ్చు.

చివరిగా పవన్ కళ్యాణ్. ఈయన గురించి చెప్పుకోవడానికేమీ లేదు. శాశ్వతంగా రాజకీయాలే తన జీవితమని, మళ్లీ సినిమా మొహం చూడనని గతంలో చెప్పిన ఈయన, సంపాదన కోసం సినిమాలు చేసుకుంటే తప్పేంటని షూటింగుల్లో బిజీగా ఉంటున్నారు. సినిమాకి 50 కోట్లొస్తుంటే ఎవరు మాత్రం వదులుకోగలరు? ఈయన కేవలం టైం కోసం ఎదురు చూస్తూ టైం పాస్ చేస్తున్నారంతే. తన అన్నగారిలా రాజకీయం నుంచి తప్పుకోకుండా ఏదో ఒక వేవ్ వచ్చి తనకి అనుకూలంగా వాతావరణం మారే వరకు రెండు పడవల మీద కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఈయన కూడా జనంతో సమయాన్ని గడిపితే రాజకీయ ఫలితం మెరుగ్గా ఉంటుంది.

ప్రభుత్వ పక్ష, ప్రతిపక్ష నాయకులంతా కరోనా తగ్గుముఖం పట్టినా కూడా ప్రజల నుంచి సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఆశ్చర్యకరం. ఏ నాయకుడు గడపదాటి ముందుగా బయటికొస్తాడో వారికి కచ్చితంగా తదుపరి ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఎన్నికలొచ్చేదాకా ఆగడం సరైన పని కాదు. ఇప్పటి నుంచి ఆ కసరత్తు మొదలుపెట్టాలి.