బడులే కాదు, ఆస్పత్రులపై కూడా దృష్టిపెట్టండి

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని 6 నెలల్లో మార్చేస్తాం, ఇప్పుడు ఫొటోలు తీసుకుంటాం, ఆరు నెలల తర్వాత ఫొటోతీసి తేడా మీకే చూపెడతాం అంటూ అమ్మఒడి పథకం ప్రకటన సందర్భంగా సీఎం జగన్ మాటిచ్చారు. అయితే…

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని 6 నెలల్లో మార్చేస్తాం, ఇప్పుడు ఫొటోలు తీసుకుంటాం, ఆరు నెలల తర్వాత ఫొటోతీసి తేడా మీకే చూపెడతాం అంటూ అమ్మఒడి పథకం ప్రకటన సందర్భంగా సీఎం జగన్ మాటిచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రులపై కూడా సీఎం కాస్త దృష్టిపెట్టాలని కోరుతున్నారు అభాగ్యులు. పేదల ఆరోగ్యంపై శ్రద్ధ అంటే కేవలం ఆరోగ్యశ్రీ నిధులు, పరిధి పెంచితే సరిపోదని.. అసలు పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూడకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెంచాలని కోరుతున్నారు.

అయితే ఇది ఒక్కరోజులో జరిగే పని కాదు, ఈ విషయంలో ఇప్పుడిప్పుడే తెలంగాణ సర్కారు ముందడుగేస్తోంది, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రభుత్వ ఆస్పత్రులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలకు వెళ్తూ అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తున్నారు. ఏపీ సర్కారు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళన మొదలు పెట్టాలనే డిమాండ్ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు నిధుల కొరత లేదు, పరికరాల కొరత అస్సలు లేదు, ఉన్నదల్లా నిర్లక్ష్యం మాత్రమే, అధికారులు, వైద్యులు, సిబ్బందిలో నిలువెత్తు నిర్లక్ష్యం తాండవిస్తోంది. లక్షల రూపాయలు పెట్టి పరికరాలు కొన్నా.. వందల రూపాయల విలువ చేసే అనుబంధ వస్తువులు లేక వాటిని మూలనపడేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసే అవకాశమున్నా నిర్దాక్షిణ్యంగా బయట ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో వైద్య రంగం కూడా ఒకటి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్లు బదిలీ చేసినా, పైరవీలతో వెంటనే అదే చోటకి వచ్చి చేరే సామర్థ్యం చాలామంది డాక్టర్లలో ఉంది. ఇలాంటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే మాటలు కాదు. చేతలతోనే సాధ్యం. అది జగన్ వల్లే సాధ్యమవుతుందని, నవరత్నాల్లోని హామీ కాకపోయినా సీఎం జగన్, ప్రభుత్వ వైద్యంపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే.. అటు ఆరోగ్యశ్రీ కేటాయింపులూ తగ్గుతాయి, ఇటు సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతుంది.

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన