కొత్త పెళ్లికూతురు అత్తింటి కెళ్లినా, మనసంతా పుట్టింట్లోనే వుంటుందన్నది పెద్దలమాట. ఆ అభిమానం, ఆ అటాచ్ మెంట్ అలాంటిది. కానీ రాజకీయ నాయకులు ఇలావుండరు. ఇలా పార్టీ మారితే, అలా కండువా మార్చితే టోన్ మారిపోతుంది. కానీ సుజనా చౌదరి వ్యవహారం మాత్రం చిత్రంగా వుంది. ఆయన పసుపు చొక్కా విప్పి, కాషాయం కట్టినా రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన మనసంతా చంద్రబాబు, తెలుగుదేశం చుట్టూనే తిరుగతోంది.
దీన్నే ఈకాలం భాషలో ఇస్మార్ట్ లేదా డబుల్ దిమాక్ అంటారేమో? ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటేనే అర్థమైపోతోంది జగన్ ను విమర్శించడానేకే అని. అయితే దాన్ని ఓకె అని కొంతవరకు సరిపెట్టుకోవచ్చు. కానీ సుజనా మరో అడుగు ముందుకేసి చంద్రబాబు మీద తెగజాలి కురిపిస్తున్నారు. 'అయ్యో.. ఆ రోజు అలా చేయకుండా వుండాల్సింది.. అయ్యో, ఆ రోజు నేను చెప్పింది వినాల్సింది' ఇలా తెగ వాపోతుంటారు.
అలా చేసివుంటే తాను ఇప్పుడు పార్టీ మారాల్చిన ఖర్మ వుండేది కాదు, మళ్లీ సెంట్రల్ లో మినిస్టర్ అయ్యే అవకాశం వుండేది. రాజకీయ జీవితం సాఫీగా వుండేది. తనదేకాదు, చంద్రబాబుది కూడా. ఇప్పటిలా అమెరికా రోడ్ల మీద పేలాలు తింటూ ఖాళీగా తిరగకుండా, ఫుల్ బిజీగా గడిపేవారు. ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఎలాగైనా మోడీ-బాబుల బంధాన్ని పునర్జీవింప చేయాలనే సుజన తన స్మార్ట్ నెస్ అంతా వాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి నుంచి మొదలుపెడితే, వచ్చే ఎన్నికల నాటికి కాషాయం-పసుపు కలుస్తాయని ఆయన భావన కావచ్చు.
ఇన్ని మాట్లాడుతున్న సుజన, గత ఎన్నికల టైమ్ లో మోడీని ఎన్నెన్మి మాటలు చంద్రబాబు అన్నారు? ఎన్ని రాష్ట్రాలు తెగతిరిగి మోడీని ప్రధాని కాకుండా చేయాలని కిందామీదా అయ్యారు? ఇలా మోడీకి కిట్టని పనుల ఎన్ని చేసారు? అన్నది మాత్రం మరచిపోతున్నారు. కానీ సుజన డబుల్ దిమాక్ తో మరిచిపోయినా, మోడీ మరిచిపోతారా? చంద్రబాబును దగ్గరకు తీస్తారా? అలా చేస్తే మరోసారి మోసపోవడానికి రెడీ అయినట్లే అనుకోవాలి.