బాలీవుడ్ కు ‘తారా సింగ్’ నేర్పించిన పాఠం

తారా సింగ్.. 22 ఏళ్ల కిందట ఈ పేరు ఓ ప్రభంజనం. గదర్ సినిమాలో సన్నీ డియోల్ పాత్ర ఇది. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే అప్పట్లో ఓ…

తారా సింగ్.. 22 ఏళ్ల కిందట ఈ పేరు ఓ ప్రభంజనం. గదర్ సినిమాలో సన్నీ డియోల్ పాత్ర ఇది. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే అప్పట్లో ఓ సెక్షన్ మీడియా ఈ సినిమా విజయాన్ని అంగీకరించలేదు. మరుసటి రోజు పత్రికల్లో పేలవమైన సమీక్షలు వచ్చాయి. కానీ, ప్రేక్షకుల తీర్పు ముందు ఈ సమీక్షలు తేలిపోయాయి. గదర్ – ఏక్ ప్రేమ్ కథ సూపర్ సెన్సేషనల్ హిట్టయింది.

మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైంది గదర్-2. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో బాలీవుడ్ లో వినిపించిన కామెంట్స్ అన్నీఇన్నీ కావు. సన్నీడియోల్ కు మార్కెట్ లేదన్నారు. ఇప్పుడు అమీషా పటేల్ హీరోయిన్ ఏంటని పెదవి విరిచారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అంతంతమాత్రంగానే జరిగింది.

కానీ మరోసారి ఈ సినిమా అందరి అంచనాల్ని తారుమారు చేసింది. ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ బరిలో వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది. 66 ఏళ్ల వయసులో సన్నీ డియోల్ సక్సెస్ అందుకున్నారు. కెరీర్ క్లోజ్ అయి పేజ్-3 సెలబ్రిటీగా కొనసాగుతున్న అమీషా పటేల్, 48 ఏళ్ల వయసులో సక్సెస్ కొట్టింది.

ఇదంతా గదర్-2 కథ-కథనంలో మహత్యం. అదే ఇప్పుడు బాలీవుడ్ కు ఓ పెద్ద పాఠం. కొన్నేళ్ల కిందటి సంగతి.. ఎంత పెద్ద సినిమా అయినా బాలీవుడ్ లో ఫ్లాప్ అయింది. షారూక్ లాంటి హీరోలు సైతం మట్టికరిచారు. సౌత్ సినిమాలు బాలీవుడ్ ను డామినేట్ చేసిన టైమ్ అది.

ఎలాంటి సినిమా తీస్తే బాలీవుడ్ జనాలకు నచ్చుతుందంటూ సినీ మేధావులంతా తలలుపట్టుకున్న టైమ్ అది. మధ్యలో కశ్మీర్ ఫైల్స్, పఠాన్ లాంటి సినిమాలు సక్సెస్ అయినా బాక్సాఫీస్ మేజిక్ ఫార్ములా అంతుచిక్కలేదు. ఇప్పుడు గదర్-2 వచ్చింది. బాలీవుడ్ కు సిసలైన పాఠం నేర్పించింది.

కేవలం కథ, కథనాన్ని నమ్ముకుంటే చాలు.. హంగులు అక్కర్లేదని నిరూపించింది గదర్-2. మరీ ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులు, ఇన్నాళ్లూ దేన్ని ప్రేమించారు.. ఆ మూలం ఏంటనేది గదర్-2 సినిమా చూపించింది.

మల్టీప్లెక్సు కల్చర్ తో బాలీవుడ్ రూపురేఖలు మారిపోయాయి. ఏ, బి, సి సెంటర్లు అనే విభజన రేఖ వచ్చేసింది. కార్పొరేట్ ముసుగు వేసుకున్న బాలీవుడ్.. సినిమాల్ని కేటగిరీలుగా విభజించడం స్టార్ట్ చేసింది. అక్కడే బాలీవుడ్ తన ఆత్మ కోల్పోయిందంటున్నారు సినీ విశ్లేషకులు. దీనికితోడు రేటింగ్స్ కల్చర్ బాలీవుడ్ ను దెబ్బతీసిందంటున్నారు.. ఈ తప్పులన్నింటినీ గదర్-2 సినిమా ఎత్తిచూపించింది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా, సిసలైన 'బాలీవుడ్ సినిమా'కు అర్థం చెప్పింది.