టికెట్ రేట్లు: వీకెండ్ లో పెంచాలి, వీక్ డేస్ లో తగ్గించాలి

థియేటర్లలో టికెట్ రేట్లపై నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తాజాగా స్పందించారు. ఓవర్సీస్ తో పాటు, బెంగళూరులో అమల్లో ఉన్న పద్ధతిని తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలంటున్నారు. వారాంతాల్లో ఒకలా, మిగతా రోజుల్లో మరోలా టికెట్ రేట్లు…

థియేటర్లలో టికెట్ రేట్లపై నిర్మాత/డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తాజాగా స్పందించారు. ఓవర్సీస్ తో పాటు, బెంగళూరులో అమల్లో ఉన్న పద్ధతిని తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలంటున్నారు. వారాంతాల్లో ఒకలా, మిగతా రోజుల్లో మరోలా టికెట్ రేట్లు పెంచుకునే/తగ్గించుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుందంటున్నారు.

“ఒక వారంలో టికెట్ రేట్లు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనే సౌలభ్యాన్ని థియేటర్లకు కల్పించాలి. గరిష్ఠ టికెట్ రేటుతో పాటు తగ్గించుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వాలి. ఉదాహరణకు వారాంతంలో టికెట్ 250 రూపాయలకు అమ్మితే, సాధారణ రోజుల్లో 150 రూపాయలకే అమ్మే వీలు కల్పించాలి.”

ఈమధ్య థియేటర్లలో ఫుట్ ఫాల్ (ఆక్యుపెన్సీ) పెరిగిందనేది కేవలం ఓ భ్రమ అంటున్నారు సురేష్ బాబు. కేవలం మంచి సినిమాలు చూసేందుకు మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారని, ఫ్లాప్ సినిమాకు ఆక్యుపెన్సీ అస్సలు ఉండడం లేదని తెలిపారు. ప్రతి రోజూ ఫుట్ ఫాల్ ను గమనిస్తున్న తాము, ఎక్కడా ఆక్యుపెన్సీ శాతం పెరిగినట్టు గమనించలేదన్నారు. ప్రస్తుతం థియేటర్లలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని, కంటెంట్ ఉన్న సినిమానే ఆడుతుందని స్పష్టం చేశారు.

“స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాల్ని చూడ్డానికి నేను కూడా ఇష్టపడతాను. అందులో ప్రొడక్షన్ వాల్యూస్, మంచి పాటలు, భారీ లొకేషన్స్ ఉంటాయి. కానీ అన్ని వేళల్లో ఇది పని చేయదు. ఉదాహరణకు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా సూపర్ హిట్టయింది. కానీ అతడి గత చిత్రాలు ఫ్లాప్. అలాగే అక్షయ్ కుమార్ ఓఎమ్జీ-2 కూడా పెద్ద హిట్. కానీ అతడి మునుపటి చిత్రాలు ఫ్లాప్. మరోవైపు విరూపాక్ష, బేబి లాంటి సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబట్టాయి. సో.. సినిమా చిన్నదా, పెద్దగా అనేది ముఖ్యం కాదు. కంటెంట్ ముఖ్యం.”

మంచి కథలు దొరక్కపోవడంతో సినీ నిర్మాణాన్ని తగ్గించానని తెలిపిన సురేష్ బాబు.. తన కొడుకులు రానా, అభిరామ్ తో సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని, ప్రస్తుతం ఆ చర్చలు సాగుతున్నాయని తెలిపారు.