సీమ రాజకీయంలో గత కొన్నాళ్లుగా జేసీ కుటుంబీకల స్వరం కాస్త తగ్గుముఖం పట్టడం గమనార్హం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తమవైన కామెంట్లతో జేసీ కుటుంబీకులు రెచ్చిపోతూ ఉంటారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డిలు యాక్టివ్ గా ఉన్న రోజుల్లో అయినా, జేసీ పవన్, జేసీ అస్మిత్ లు రాజకీయ బాధ్యతలు తీసుకున్నాకా.. అయినా వీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం కొనసాగేది. అయితే కొన్నాళ్లుగా వీరి వాయిస్ అంత రైజ్ కావడం లేదు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులూ.. చంద్రబాబును బాగా పొగిడే వారు. అదే సమయంలో పార్టీలోని వారితో కలహించుకునే వారు. జగన్ పై అప్పట్లో విరుచుకుపడే వారు. అనంతపురం సాక్షి ఆఫీసు ముందు ప్రభాకర్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక తెలుగుదేశం పార్టీ ఓడిపోయే పరిస్థితుల్లో కూడా వీరు ఆ పార్టీపై విపరీత అభిమానం కురిపించారు. పోలింగ్ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని గట్టిగా నమ్మారు. అయితే అది జరగలేదు. ఆ తర్వాత జగన్ పై అడపాదడపా విరుచుకుపడ్డారు. చంద్రబాబును పొగిడారు. కానీ కొన్నాళ్లుగా వీరు అనూహ్యంగా కామ్ అయ్యారు.
మధ్యమధ్యలో తెలుగుదేశం పార్టీ నేతలతో పేచీలు తప్ప వేరే ఏం లేవు. చంద్రబాబును అతిగా పొగడటం లేదు. ఇదే సమయంలో జగన్ పై పెద్దగా విమర్శలు లేవు! మరి ఇది వ్యూహాత్మక మౌనమా! అనే సందేహాలు రేగుతున్నాయిప్పుడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కామ్ గా రాజకీయం చేయడం జేసీ సోదరుల అలవాటుకాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా హడావుడి, బోలెడంతమందిని విమర్శించడం రొటీనే. అలాంటి వారు ఇప్పుడు కామ్ గా ఉండటం, పెద్ద పొలిటికల్ పంచ్ లు వేయకపోవడం, హడావుడి చేయకపోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున వీరు చాలా సీట్లనే అడుగుతున్నారనే అంతర్గత ప్రచారం ఒకటి ఉంది. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం, అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ను వీరు ఆశిస్తున్నారంటారు. దీంతో పాటు.. పుట్టపర్తి, శింగనమల వంటి చోట్ల కూడా తాము చెప్పిన వారికే తెలుగుదేశం పార్టీ టికెట్ ను కేటాయించాలనేది కూడా చంద్రబాబు వద్ద వీరు పెట్టిన ప్రతిపాదన అంటారు. మరి వీరికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో ఎవ్వరికీ తెలియదు.
మరి ఇన్ని టికెట్లు కోరుతున్నప్పుడు అధికార పక్షంపై వీరి అటాక్ కూడా గట్టిగా ఉండాలి. అయితే అది లేదిప్పుడు. పైపెచ్చూ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల తాడిపత్రిలో తన అనుచరవర్గంతో జగన్ పట్ల సానుకూలంగా మాట్లాడిన వైనం కూడా చర్చనీయాంశం అవుతోంది. జగన్ ను ఢీ కొట్టేయాలనే ఉత్సాహం కానీ, ఆ విధంగా అనుచరులను రెచ్చగొట్టడం కానీ ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై కానీ, జగన్ నిర్ణయాలను తప్పు పట్టే వైఖరిని కానీ దివాకర్ రెడ్డి పెద్దగా కనబరచలేదు. ప్రభాకర్ రెడ్డి ది అలాంటి హడావుడి లేదు. ఇక జేసీ పవన్ కూడా దూకుడైన వైఖరి లేదు!
ఇలా జేసీ కుటుంబీకులు కాస్త నెమ్మదించారు. మరి ఇది వ్యూహాత్మకం కావొచ్చు. వీరు బీజేపీలోకి చేరతారని, కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే టాక్ లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ వాటిపై అంత సీరియస్ నెస్ లేదు కానీ, వీరు దూకుడు తగ్గించడంతోనే.. కొత్త అనుమానాలు రేగుతున్నాయి. వీరేదో వ్యూహాన్ని ఫాలో అవుతున్నారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.