ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భ‌ర్త‌కు టికెట్ ద‌క్కనుందా?!

అనంత‌పురం జిల్లా రాజ‌కీయంలో ఆస‌క్తిదాయ‌క‌మైన మార్పుల ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున చాలా మంది అభ్య‌ర్థుల మార్పుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి…

అనంత‌పురం జిల్లా రాజ‌కీయంలో ఆస‌క్తిదాయ‌క‌మైన మార్పుల ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున చాలా మంది అభ్య‌ర్థుల మార్పుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుముఖంగా ఉన్నార‌ని టాక్. 

ఈ క్ర‌మంలో… ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప‌రిశీల‌న‌లు, మార్పు చేర్పుల‌కు జ‌గ‌న్ స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితుల్లో.. కొన్ని ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్.. పూర్తి కొత్త‌ద‌నంతో ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న‌లో కూడా ఉన్నార‌ట‌. అందులో భాగంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సామాన్యుల ఊహ‌కు అంద‌ని రీతిలో అభ్య‌ర్థుల పోటీ ఉంటుంద‌నేది టాక్!

ఇందులో భాగంగా అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున స‌రికొత్త ఎంపిక ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎమ్మెల్యే భర్త అనిపించుకుంటున్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. 

అత‌డే ఆలూరి సాంబ‌శివారెడ్డి. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి భ‌ర్త సాంబ‌శివారెడ్డి. ఇన్నాళ్లూ తెర వెనుక ఉండి ఎక్కువ‌గా ప‌ని చేసిన సాంబ వ‌చ్చే ఎన్నిక‌ల్లో డైరెక్టుగా పోటీకి దిగ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అందుకు అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వేదిక కావొచ్చ‌ని టాక్! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వ‌ద్ద ఈ అంశం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం.

శింగ‌న‌మ‌ల నుంచి సాంబ‌కు అవ‌కాశం ద‌క్కేది ఉండ‌దు. ఆ రిజర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న భార్య‌కు అవ‌కాశం ద‌క్కింది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఈ జంట అక్క‌డ బాగానే ప‌ని చేసుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉండిన ప్ర‌త్య‌ర్థుల‌ను కూడా వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకున్నారు. శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కూతురును వీరు ద‌గ్గ‌రుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గం మీద కూడా మెరుగైన స్థాయిలో ప‌ట్టు సంపాదించారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున జేసీ బ్ర‌ద‌ర్స్ ఆశీస్సుల‌తో శ్రావ‌ణి రాజ‌కీయం చేస్తూ ఉన్నారు. అయితే టీడీపీలో ప‌లు అంత‌ర్గ‌త క‌ల‌హాలున్నాయి. అది వేరే సంగతి.

ఇన్నాళ్లు ఎమ్మెల్యే భ‌ర్త‌గా రాజ‌కీయం చేసిన సాంబ‌శివారెడ్డి అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి మంచి అభ్య‌ర్థే అవుతారు. ప్ర‌స్తుతం అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియ‌ర్ నేత
అనంత వెంక‌ట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వివాదాల‌కు దూరంగా త‌న ప‌ని తాను చేసుకుంటూ ఉంటారాయ‌న‌. అయితే ఎంతైనా ఆయ‌న సీనియ‌ర్. వార‌సులు రాజ‌కీయాల్లో హ‌డావుడి చేయ‌డం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో అనంత‌పురం అర్బ‌న్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌రైన నాయ‌కుడిని త‌యారు చేసుకోవాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. ఇలాంటి నేప‌థ్యంలో సాంబ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స‌రైన ఛాయిస్ కావ‌డంలో వింత లేదు. అనంత‌పురం టౌన్ కు కూత‌వేటు దూరంలో శింగ‌న‌మ‌ల ఉంటుంది. రెండు నియోజ‌క‌వ‌ర్గాలూ స‌రిహ‌ద్దును పంచుకుంటాయి. 

శింగ‌న‌మ‌ల రాజ‌కీయానికి అనంత‌పుర‌మే ఎక్కువ‌గా వేదిక అవుతూ ఉంటుంది. కాబ‌ట్టి.. ఎక్క‌డ నుంచినో వచ్చార‌నే పేరు కూడా ఉండ‌దు. ఇలాంటి నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి సాంబ పోటీ చేసినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. అయితే భార్యాభ‌ర్త‌ల‌కు చెరో నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ను జ‌గ‌న్ కేటాయిస్తారా? అనంత‌పురం నుంచి సాంబ పోటీ చేసే ప‌రిస్థితుల్లో.. శింగ‌న‌మ‌ల‌లో ప‌ద్మావ‌తికి అవ‌కాశం ఇస్తారా?  లేక మ‌రొక‌రిని అక్క‌డ బ‌రిలోకి దించుతారా? అనేది మ‌రో శేష ప్ర‌శ్న‌.