వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రీఎంట్రీ..?

ఎన్నికల ముందు ఆవేశం కొద్దీ పార్టీని వీడిన వారిలో కొందరికి రీఎంట్రీకి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ముందు పార్టీని వీడినవారు తిరిగి ఆ పార్టీలోకి…

ఎన్నికల ముందు ఆవేశం కొద్దీ పార్టీని వీడిన వారిలో కొందరికి రీఎంట్రీకి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ముందు పార్టీని వీడినవారు తిరిగి ఆ పార్టీలోకి చేరడం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు గౌరు కుటుంబం. వీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున టికెట్‌ దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ లభించకపోవడంతో గౌరుచరిత, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డిలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి దక్కడంతో వీరు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.

వీరు యమ అర్జెంటుగా ఆ పార్టీలోకి చేరడం వెనుక మరో కథ కూడా ఉంది. వీరి సమీప బంధువు మాండ్ర శివానందరెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాల ఎంపీ టికెట్‌ లభించడంతో వీరు తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయి పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ సంపాదించారు. అయితే గౌరు కుటుంబానికి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఎంత అండగా నిలిచారో అందరికీ తెలిసిన సంగతే. అయినా వీరు అలాంటి కృతజ్ఞత ఏదీలేకుండా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అలాచేరి కూడా అక్కడ వీరు బావుకున్నది ఏమీలేదు!

పాణ్యం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి చరిత ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా ఈమె అలవాట్లో పొరపాటుతో 'జై జగన్‌' అని నినదించి తనే నవ్వుకున్నారు. అలా ప్రహసనంగా మారింది వీరి తెలుగుదేశం పార్టీ చేరిక. వీరు అలా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లగానే ఇటువైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని గ్రహించలేక వీరు తెలుగుదేశంలో చేరారు.

ఒకవేళ వీరు వైఎస్సార్సీపీలోనే ఉండి, పాణ్యం ఎమ్మెల్యే టికెట్‌ను జగన్‌ చెప్పిన వారి కోసం త్యాగంచేసి ఉంటే వీరికి ఎంత ప్రాధాన్యత దక్కేదో వివరించనక్కర్లేదు. ఎమ్మెల్సీ పదవి లేదా మరో నామినేటెడ్‌ పోస్టు కచ్చితంగా దక్కేది. అయితే వీరు మాండ్ర మాయకు లోనై తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మంచి అవకాశాన్ని కోల్పోయారు. అయితే వీరిపై ఇప్పటికీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పాజిటివ్‌గానే ఉన్నారట. దీంతోనే వీరికి తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఎంట్రీ లభించబోతోందని సమాచారం.

ఏదో ఆవేశంలో వీరు ఊగిపోయి తెలుగుదేశంలో చేరినా.. వీరు తిరిగి వస్తామని పంపిన ప్రతిపాదనలకు జగన్‌ సూఛాయగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో త్వరలోనే గౌరు దంపతులు మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కాబోతున్నారని కర్నూలుజిల్లా టాక్‌!

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన