బీజేపీలోకి చేరికలు ఏవీ..?!

భారతీయ జనతా పార్టీ హిట్‌ లిస్టులో రాయలసీమ ఉందని కమలనాథులు లీకులు ఇచ్చారు. తమ పార్టీలోకి వాళ్లు వస్తున్నారు, వీళ్లువస్తున్నారు.. అంటూ హడావుడి చేశారు కమలం పార్టీ వాళ్లు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి…

భారతీయ జనతా పార్టీ హిట్‌ లిస్టులో రాయలసీమ ఉందని కమలనాథులు లీకులు ఇచ్చారు. తమ పార్టీలోకి వాళ్లు వస్తున్నారు, వీళ్లువస్తున్నారు.. అంటూ హడావుడి చేశారు కమలం పార్టీ వాళ్లు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి నెలలు గడుస్తున్నా భారతీయ జనతా పార్టీలోకి  చేరికలు పెద్దగా లేకపోవడాన్ని గమనించవచ్చు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో పలువురు నేతల పేర్లను బీజేపీలోకి చేరిక అనే లీకుల విషయంలో ప్రస్తావించారు. అయితే చేరింది మాత్రం పెద్దగా ఎవరూలేదు. ఏదో ఒకరిద్దరు మాత్రమే కమలం పార్టీ తీర్థం  పుచ్చుకున్నారు. మిగతావారు మాత్రం కమలం వైపు చూడకపోవడం గమనార్హం!

బీజేపీలోకి చేరబోతున్నారనే జాబితాలో జేసీ సోదరుల పేర్లు, పరిటాల కుటుంబం, భూమా కుటుంబం.. ఇలా చాలామంది పేర్లే వినిపించాయి. అయితే వారిలో ఎవరూ ఇప్పటివరకూ  కమలం పార్టీ వైపు చూడకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ చెప్పుకోదగిన స్థాయిలో చేరికలు లేనే లేవు. కర్నూలుజిల్లా టీడీపీనేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ బీజేపీలోకి చేరారు. అది కేవలం అవకాశవాద చేరిక మాత్రమే అని వేరే చెప్పనక్కర్లేదు.

టీజీకి ఉన్న జనబలం ఏ పాటిదో కూడా ఇప్పటికే వివిధ ఎన్నికలతో క్లారిటీ వచ్చింది. కర్నూలు ఎమ్మెల్యేగా నెగ్గడానికి టీజీ, ఆయన తనయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పడరాని పాట్లు పడ్డారు. అయినా గెలవలేకపోయారు. ఎప్పుడో వైఎస్‌ గాలిలో గెలవడమే తప్ప టీజీకి మళ్లీ గెలవలేకపోయారు. చివరకు నామినేటెడ్‌ ఎంపీతో తెలుగుదేశం పార్టీ తరఫున సర్దుకున్నారు. కానీ.. అవకాశవాదం కొద్దీ బీజేపీలోకి చేరిపోయారనే పేరును తెచ్చుకున్నారు. ఈసారి రాజ్యసభ సభ్యత్వకాలం ముగిస్తే ఆ తర్వాత టీజీ బీజేపీ తరఫున నెగ్గుగలరా అంటే కర్నూలు జిల్లాలో ఎవరైనా సులభంగా సమాధానం చెప్పగలుగుతారు.

ఇక అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యేల వరదాపురం సూరి కూడా ఎంచక్కా బీజేపీలోకి చేరిపోయారు. అయనదీ పరమ అవకాశవాద చేరికే. తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్‌ దొరికితే పోటీచేయడం లేకపోతే పక్కకు వెళ్లడం సూరికి కొత్త ఏమీకాదు. టీడీపీ అధికారంలో లేని నేపథ్యంలో ఆయన బీజేపీలోకి చేరారు. అదంతా కాంట్రాక్టుల వ్యవహారమే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. భారీఎత్తున రోడ్డు కాంట్రాక్టులు చేపట్టారు వరదాపురం. ఆ బిల్లులు పెండింగ్‌లో పడకుండా చూసుకునేందుకు ఆయన బీజేపీలోకి చేరారనేది బహిరంగ రహస్యమే అని విశ్లేషకులు అంటున్నారు.

వారిద్దరి తర్వాత కనీసం ఆ తరహా అవకాశవాద చేరికలు కూడా బీజేపీలోకి లేకపోవడం గమనార్హం. బీజేపీలోకి చేరగానే తమకు రాజ్యసభ సభ్యత్వం స్థాయి పదవిని కోరారట జేసీ దివాకర్‌ రెడ్డి, భూమా అఖిలప్రియ వంటివాళ్లు. ఇలా పార్టీలోకి చేరి అలా పెద్ద పదవులు లభించే పరిస్థితి బీజేపీలో ఉండదు. అందుకే వారి చేరికలు ఆగాయి అనేమాట వినిపిస్తూ ఉంది. అయితే నేతలు వేచి చూసే ధోరణితో ఉన్నట్టున్నారు.

ఏపీలో, రాయలసీమలో బీజేపీకి ఉన్న బలం ఎంతో వారికి తెలియనిది కాదు. రేపు వీళ్లు మళ్లీ బీజేపీ తరఫున పోటీచేసి జనాల్లోకి వెళ్లినా.. వీళ్లెవ్వరో ప్రజలకు తెలుసు కానీ, బీజేపీ గుర్తు ఏమిటో కూడా జనసామాన్యానికి తెలియదు. అదీ భారతీయ జనతా పార్టీ పరిస్థితి.

ఇలాంటి నేపథ్యంలో సీమకు చెందిన తెలుగుదేశం నేతలు భారతీయ జనతా పార్టీలోకి చేరే విషయంలో ఆచితూచి స్పందిస్తున్నట్టుగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో వారు తాపీగా మాత్రం ఉండలేకపోతూ ఉన్నారు. లోకేష్‌ నాయకత్వం అంటే తెలుగుదేశంలోని నేతలు కలవరపడుతూ ఉన్నారని సమాచారం.

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన