నిస్సిగ్గుగా ‘మతం’ రచ్చ.. ఇంకా ఎంతవరకూ వెళ్తారో!

తనకు ఫుడ్‌ డెలివర్‌ చేసిన వ్యక్తి ముస్లిం అంటూ జొమాటో ద్వారా వచ్చిన ఆహారాన్ని వెనక్కు పంపించాడు ఒక ఘనుడు. ఆ విషయాన్ని ట్వీట్‌ చేసి తనేదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా చెప్పుకున్నాడు. అసలు ఇలాంటి…

తనకు ఫుడ్‌ డెలివర్‌ చేసిన వ్యక్తి ముస్లిం అంటూ జొమాటో ద్వారా వచ్చిన ఆహారాన్ని వెనక్కు పంపించాడు ఒక ఘనుడు. ఆ విషయాన్ని ట్వీట్‌ చేసి తనేదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా చెప్పుకున్నాడు. అసలు ఇలాంటి చెత్త పనులను ట్వీట్‌ చేయకుండా ట్విటర్‌ చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అనే ప్రాథమిక అవగాహన లేకుండా ఇలాంటి మూర్కులు వ్యవహరిస్తూ ఉంటారు. ముస్లిం డెలివరీ చేశాడని హిందువు ఆహారాన్ని వెనక్కు పంపినా, హిందూ డెలివరీ చేశాడంలూ ముస్లిం ఆహారాన్ని వెనక్కు పంపినా.. అది అహంకారం, విద్వేషం మాత్రమే అవుతుంది తప్ప మరోటికాదు.

ఒళ్లు కొవ్వెక్కి ఇలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్లకు మీడియాలో వస్తున్న ప్రచారాన్ని చూసి మరి కొంతమంది మూర్కులు ఇలాంటి పనులు చేయవచ్చు. ఉచిత ప్రచారం కోసం ఇలాంటి పనులు చేస్తారు కొంతమంది. ఇలాంటి మూర్కత్వం వ్యాపిస్తూ పోతే అది ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కాస్త ఇంగితం ఉన్నవాళ్లు ఆలోచించాల్సిన అంశం.

ఈ అంశం మీదే కొందరు ఆలోచన పరులు మరిన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆర్డర్‌ చేసిన అన్నాన్ని ఒక ముస్లిం డెలివరీ చేశాడని నువ్వు వద్దన్నావు సరే, మరి ఆ అన్నాన్ని పండించింది ఎవరో నీకు తెలుసా? ఒక ముస్లిం రైతు ఆ ఆహారాన్ని పండించి ఉండొచ్చు కదా. లేదా దాన్ని తయారుచేసింది ఒక ముస్లిం అయ్యుండొచ్చు కదా! అప్పుడు ఏమవుతుంది నీ మత మౌడ్యం? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరి ముస్లిం డెలివరీ చేసిన ఆహారాన్ని నువ్వు భుజించవు సరే, మనదేశంలో వాడుతున్న పెట్రో ఉత్పత్తులు అన్నీ ముస్లిం రాజ్యాల నుంచే కదా వస్తున్నాయి, నువ్వు పెట్రోల్‌ వినియోగించవా? అనే ప్రశ్నలూ ఉత్పన్నం అవుతున్నాయి మరికొందరు మాత్రం అది అతడి స్వేచ్చ అంటూ మాట్లాడుతున్నారు. అయితే స్వేచ్ఛ ఎప్పుడూ విద్వేషాలను రేపేలా ఉండకూడదు. ఆ విషయాన్ని రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు.

మరోసారి ఇలాంటి విద్వేషపూరిత ట్వీట్లేస్తే కేసులుపెట్టి అరెస్టు చేస్తామంటూ సదరు వ్యక్తికి పోలీసులు కూడా హెచ్చరిక జారీచేశారు. ఆహారానికి మతం ఉండదంటూ.. జొమాటో ఆ వ్యక్తికి హితబోధ చేసింది. అయినా తీవ్రం అవుతున్న మతమౌడ్యం ఇంకా ఇలాంటి ఎంతమంది మూర్కులను హీరోలను చేస్తుందో అనేదే ఆందోళనకరమైన అంశం.
-ఎల్‌.విజయలక్ష్మి

అగమ్యగోచరంగా టీడీపీ… అంతుబట్టని తీరులో జనసేన