ఇన్నాళ్లూ ఆళ్లగడ్డ, నంద్యాల అవతల వాళ్లకు భూమా కుటుంబంలో ఇంతమంది రాజకీయనేతలు ఉన్నారని పెద్దగా తెలియదు. భూమా, ఎస్వీ కుటుంబానికి సంబంధించి పైకి కనిపించే నేతల గురించినే చాలామందికి తెలుసు. అయితే గత కొన్నాళ్లుగా వీరి కుటుంబాల నుంచి ఒక్కొక్కరు బయటకువచ్చి తలా ఒక పార్టీలోకి చేరుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ, ఎస్వీ మోహన్‌రెడ్డిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో నాగిరెడ్డి మరణంలో భూమా బ్రహ్మానందరెడ్డి తెరమీదకు వచ్చారు.
అంతవరకూ భూమా నాగిరెడ్డి చెట్టు నీడన బయటివాళ్లకు బ్రహ్మానందరెడ్డి మొహం కనపడలేదు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాగోలో నెగ్గి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే అనిపించుకున్నారు. అయితే అది కొన్నాళ్ల ముచ్చటే అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక ఇప్పుడు సోదరుడిని తనవెంట నడిపించుకుని భారతీయ జనతాపార్టీలోకి చేరాలని అఖిలప్రియ అనుకున్నారట. అయితే బ్రహ్మానందరెడ్డి మాత్రం తను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని అంటున్నారట.
వీలైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలి అనేది అఖిలప్రియ ఆలోచన. అది కుదరకపోతే బీజేపీ వద్దా ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారట. అయితే బ్రహ్మానందరెడ్డి మాత్రం తను తెలుగుదేశం పార్టీని వీడేదిలేదని చెబుతున్నారట. సోదరుడిని తీసుకుని బీజేపీలోకి వెళితే అంతో ఇంతో విలువ ఉంటుందని అఖిల అనుకుంటున్నారట. అయితే బ్రహ్మానందరెడ్డి మాత్రం టీడీపీని వీడేందుకు ససేమేరా అంటున్నారని టాక్.
ఇక భూమా నాగిరెడ్డి అన్న భూమా భాస్కర్ రెడ్డి తనయుడు భూమా కిషోర్ రెడ్డి ఇటీవలే భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. ఆయన అఖిలప్రియతో తీవ్రంగా విబేధించారు. అఖిలప్రియ బీజేపీలోకి చేరే ప్రయత్నంలో ఉందనే వార్తలు వస్తున్నా.. కిషోర్ రెడ్డి మాత్రం ఆమె తీరును, ఆమె భర్త తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
తను సొంతంగా వెళ్లి బీజేపీలోకి చేరారు. ఇక ఎస్వీ కుటుంబీకులు కూడా ఎన్నికల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు.. ఎన్నికలకు ముందే జగన్‌కు జైకొట్టారు. ఇలా భూమా-ఎస్వీ కుటుంబాల్లోని వారు తలా ఒక పార్టీలో కనిపిస్తున్నారిప్పుడు! మరికొందరు క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు!