ఏదైనా ఒక సినిమాకు రెండో పార్ట్ రావడమే గగనం అయిపోయింది. దక్షిణాదిన సీక్వెల్ ఫార్ములా ఇప్పటికీ హిట్ అనిపించుకోలేకపోతోంది. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయినా దానికి సీక్వెల్ అనే సరికే జనాలకు విసుగు వస్తోంది. ఇక్కడ స్టార్ హీరోలు తమ సూపర్ హిట్ సినిమాలను ప్రాంచైజ్ లుగా మార్చి సీక్వెల్స్ తీస్తున్నా జనాలు తిరస్కరిస్తూ ఉన్నారు. సౌత్ లో స్టార్ హీరోలు అయిన పవన్ కల్యాణ్, సూర్య వంటి వాళ్లకే సీక్వెల్ ఫార్ములా అంత వర్కవుట్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు.
'సింగం' సినిమాకు రెండో పార్ట్ తీసి మెప్పించిన సూర్య, మూడో పార్ట్ తీసి చేతులు కాల్చుకున్నాడు. మూడో పార్ట్ కూడా తొలి రెండు పార్ట్ లకు తీసిపోని రీతిలో ఉన్నప్పటికీ జనాలు విసిగిపోయారు. ‘ఇక చాల్లే’ అనే తీర్పును ఇచ్చారు. దీంతో ఎస్ త్రీతో సూర్య ఆపేయాల్సి వచ్చింది. కమర్షియల్ గా కూడా ఆ సినిమా ఆడలేదు.
ఇక విక్రమ్ కూడా అలాంటి ప్రయత్నమే చేసి తన మార్కెట్ ను కోల్పోయాడు. ఎప్పుడో హిట్ అయిన ‘సామి’ కి సీక్వెల్ చేసి అతడు చేతులు కాల్చుకున్నాడు. సామి తమిళంలో పాటు తెలుగులో కూడా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. దీంతో సామి సీక్వెల్ కు మార్కెట్ ఉంటుందనుకుంటే రెండు చోట్లా అది డిజాస్టర్ అయ్యింది.
ఇక తెలుగులో కూడా ఏనాడూ సీక్వెల్స్ సరిగా ఆడిన దాఖలాలు లేవు. శంకర్ దాదా జిందాబాద్ రిజల్ట్ ఏమిటో తెలిసిన సంగతే. ఇక పవన్ కల్యాణ్ తన సక్సెస్ ఫుల్ సినిమా ‘గబ్బర్ సింగ్’ కు సీక్వెల్ చేసి ఎలాంటి ఫలితాన్ని పొందాడో తెలిసిన సంగతే. తెలుగు వాళ్లు స్టార్ హీరోల సినిమాలను ఒకసారి చూస్తే, మళ్లీ దానికి కొనసాగింపు అంటే అంత ఇష్టపడరు అని సీక్వెల్ సినిమాల రిజల్ట్స్ చెబుతూ ఉన్నాయి.
తెలుగులో సీక్వెల్ సినిమాల్లో మినహాయింపు ఏదైనా పొందింది అంటే అది లారెన్స్ ‘ముని’ సీరిస్ మాత్రమే. ఆ అనువాద సినిమాలు మాత్రం ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి హిట్ అనిపించుకుంటున్నాయి. వాస్తవానికి ‘ముని’ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. తమిళం నుంచి అనువాదం అయిన ఆ సినిమాను అప్పట్లో తెలుగు వాళ్లు పట్టించుకోలేదు. అయితే తమిళంలో 'ముని-2' అంటూ కాంచన వచ్చింది. అక్కడతో పాటు ఇక్కడా హిట్ అయ్యింది. ఆ తర్వాత సీక్వెల్స్ అందుకున్నాడు లారెన్స్. సక్సెస్ ఫుల్ సాగుతున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ వెర్షన్ పనిలో ఉన్నాడు.
ఇక తెలుగులో సీక్వెల్ ఫార్మాలను అనుసరించడానికి కూడా ఎవరూ పెద్దగా ఇష్టపడటం లేదు. రవితేజ కు 'కిక్ 2' ఎలాంటి అనుభావాన్ని మిగిల్చిందో తెలిసిన సంగతే. ఇంకా బోలెడన్ని తెలుగు సినిమాకు సీక్వెల్స్
ప్రపోజల్స్ వచ్చినా అవి పట్టాలు మాత్రం ఎక్కలేదు. 'ఇడియట్ 2' , 'అదుర్స్ 2 ఈ కోవకు చెందిన సినిమాలే. అవి కేవలం ప్రతిపాదనల వరకే వచ్చి అడ్రస్ లేకుండా పోయాయి.
ఇక ఎలాగోలా సీక్వెల్ అంటూ వచ్చిన 'గాయం 2' 'మనీ మనీ మోర్ మనీ', 'నాగవల్లి', 'దేవి 2' తో సహా ఎన్టీఆర్ బయోపిక్ సెకెండ్ పార్ట్.. ఇలా అన్నీ అన్నీ ఫ్లాఫులుగానే నిలిచాయి. విశేషం ఏమిటంటే..త్వరలోనే 'మన్మథుడు 2' రాబోతోంది. తొలి పార్ట్ కూ సీక్వెల్ కు ఏ మాత్రం సంబంధం లేకపోయినా మన్మథుడు టు అనే టైటిల్ ను వాడుకున్నట్టుగా రూపకర్తలు ప్రకటించారు. వరసగా తెలుగులో సీక్వెల్స్ ఆడని నేపథ్యంలో మన్మథుడు టు ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాల్సి ఉంది.
ఇక ఇలా తెలుగునాట సీక్వెల్స్ కు ప్రేక్షకులు రెడ్ సిగ్నల్ చూపిస్తూ ఉంటే.. బాలీవుడ్ లో మాత్రం సీక్వెల్ అంటే చాలు జనాలు ఎగబడుతూ ఉన్నారు. ఒక కథకూ మరో కథకూ ఏ మాత్రం సంబంధం లేకున్నా అక్కడ సీక్వెల్ అని అంటున్నారు. ఇప్పటి వరకూ చాలా సినిమాల కథలు అలానే ఉంటున్నాయి. ఒక సినిమాలోని పాత్ర మరో సినిమాలో ఏమీ కంటిన్యూ కావు. మొదటి పార్ట్ లో కథకూ, రెండో పార్టులో కథకు ఏ మాత్రం సంబంధం ఉండదు.
కేవలం మొదటి పార్ట్ పేరును క్యాష్ చేసుకోవడానికే పార్ట్ టు అని అంటున్నారు. పాత్రలు, పాత్రధారులు, కథ-కథనం.. ఇలా ఏదీ పొంతన లేకుండా పోయాని అక్కడ సీక్వెల్స్ వస్తూనే ఉన్నాయి. అవి విజయవంతమైన ప్రాంచైజ్ లుగా మారుతూ ఉన్నాయి. 'అషికీ 2' వంటి సినిమా హిందీలో సృష్టించిన సంచలనం ఏ పాటిదో అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాకూ తొలి వెర్షన్ 'ఆషికీ'కి ఏ మాత్రం సంబంధం ఉండనే ఉండదు. అది వేరే కథ, ఇది వేరే కథ. బహుశా హిందీలో సీక్వెల్ వెర్షన్లలో పాత్రలు కంటిన్యూ అవుతున్నది ‘మున్నాభాయ్’ సీరిస్ లోనూ, ‘దబాంగ్’ సీరిస్ లలో మాత్రమేనేమో.
ఇక త్వరలోనే హిందీలో మరో సీక్వెల్ సినిమా విడుదల కాబోతోంది. అదే ‘హౌస్ ఫుల్ ఫోర్’. ఈ సినిమాలో బోలెడంతమంది తారలున్నారు. అక్షయ్ కుమార్ తో మొదలుకుని రానా దగ్గుబాటి వరకూ అనేక మంది ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. హౌస్ ఫుల్ సీరిస్ లో ఇది నాలుగో సినిమా. వాస్తవానికి ఇది ఎక్కడెక్కడో మొదలై ఎక్కడికెక్కడికో సాగుతూ ఉంది. ఈ కథనంలో ప్రస్తావించిన సినిమాలకు ఒకదానితో మరోదానికి సంబంధం లేని రీతిలో హౌస్ ఫుల్ కథకు కూడా సంబంధం లేకుండా ఉంటుంది.
రెండు వేల పదిలో వచ్చిన హౌస్ ఫుల్ సినిమాకు మూలాధారం ఒక దక్షిణాది సినిమా. సౌత్ లో నవ్వించిన ఆ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమా పేరు ‘నవ్వండీ లవ్వండీ’. తమిళంలో కమల్ హాసన్ చేసిన సినిమా ఇది. ప్రభుదేవా రెండో హీరో. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సరదా సినిమా తెలుగు వారినీ ఆకట్టుకుంది. క్రేజీ మోహన్ రచనలో రూపొందిన ఈ సినిమాను హిందీలో ‘హౌస్ ఫుల్’ గా రీమేక్ చేశారు. దక్షిణాది సినిమాలను రీమేక్ చేసే బాలీవుడ్ ప్రొడ్యూసర్లలో ఒకరైనా సాజిద్ నడియావాలా ఆ సినిమాను రూపొందించారు. అది హిందీలో సూపర్ హిట్ అయ్యింది. అక్కడ నుంచి సీక్వెల్స్ వరద మొదలైంది.
హిందీలో హౌస్ ఫుల్ సినిమా తొమ్మిదేళ్ల కిందటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని అంచనా! అంతలా హిట్ అయ్యింది ఆ సినిమా. దీంతో రెండేళ్లకే హౌస్ ఫుల్ టూ వచ్చింది. అది కూడా అప్పటికే సౌత్ లో అరగదీసిన సినిమానే. ముందుగా మళయాళంలో వచ్చిన ఆ సినిమా ఆ తర్వాత తమిళంలోనూ, తెలుగులోనూ రీమేక్ అయ్యింది. తెలుగులో ఆ సినిమా పేరు ‘హంగామా’. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వేణుమాధవ్, అలీలు హీరోలుగా రూపొందింది.
కామెడీ సబ్జెక్ట్ అయితే తెలుగు వాళ్లకు అంతగా నచ్చలేదు. ఏదో ఒక మోస్తరుగా ఆడి వెళ్లింది ఆ సినిమా. ఆ తర్వాత హిందీలో 'హౌస్ ఫుల్ 2'గా వచ్చింది ఆ కథ. అది కూడా బాగానే ఆడింది. వాస్తవానికి ‘నవ్వండీ లవ్వండీ’ సినిమాకూ ‘హంగామా’ సినిమాకూ ఏ మాత్రం సంబంధం ఉండదు. అయితే హిందీలో మాత్రం ఈ రెండు సినిమాలనూ ఒకదానికి మరోటి సీక్వెల్ గా మార్చారు! హిట్స్ కొట్టారు.
హౌస్ ఫుల్ థర్డ్ పార్ట్ మాత్రం బాలీవుడ్ వాళ్లు సొంతంగా అల్లుకున్న మరేదో కథ. ఇక నాలుగో పార్ట్ ను కూడా సొంతంగానే అల్లుకున్నట్టుగా ఉన్నారు. ఒక దక్షిణాది సినిమా రీమేక్ తో మొదలైన ప్రాంచైజ్ ఇలా వరస పెట్టిసినిమాలకు మూలం అవుతూ ఉండటం గమనార్హం. ఆ బాలీవుడ్ వాళ్ల తీరును చూస్తుంటే ఈ హౌస్ ఫుల్ ఫోర్ హిట్ అయితే, దీనికి ఐదో పార్టు, ఆరో పార్టులను కూడా తీసేలా కనిపిస్తూ ఉన్నారు!