జగన్ హయాంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడంలేదు, ఇది నిజం. అయితే ఎమ్మెల్యేలంతా మంత్రులపై పడి ఏడుస్తున్నారు. మంత్రులకు పనులు జరుగుతున్నాయి కానీ, ఎమ్మెల్యేల స్థాయిలో తమ మాట ఎవరూ వినడం లేదనేది వీరి కంప్లయింట్. ఎమ్మెల్యేలకు తెలియని విషయం ఏంటంటే.. అక్కడ మంత్రుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కానీ వారు బైటపడటం లేదు, వీరు బైటపడ్డారు అంతే తేడా. జిల్లాల్లో జరుగుతున్న జడ్పీ మీటింగ్ లు, ఇంచార్జి మంత్రుల సమీక్ష సమావేశాల్లో ఈ కోపతాపాలు బహిర్గతం అవుతున్నాయి. అందులోనూ జగన్ మంత్రివర్గ కూర్పుపై చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు.
తమకంటే జూనియర్లు మంత్రులుగా దూసుకెళ్తుంటే.. సీనియర్లు ఉడుక్కుంటున్నారు. ఇంచార్జిలుగా యువ మంత్రులు పక్క జిల్లాలకు వెళ్లినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి జ్వాలలన్నీ సమీక్ష సమావేశాలు, స్థానిక సమస్యలపై చర్చల సందర్భంగా బైటపడుతోంది. ఇసుక రవాణా సహా స్థానిక నాయకత్వం కనుసన్నల్లో జరగాల్సిన చాలా పనుల్లో తమకు ప్రాధాన్యత దక్కడంలేదని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు.
అధికారులెవరూ మాట వినడంలేదని ఇంచార్జి మంత్రులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వైరుధ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి మంత్రుల చేతిలో అధికారాలు కూడా జగన్ అదుపులోనే ఉన్నాయి. సీఎం జగన్ మాటకాదని ఏ మంత్రీ సొంత నిర్ణయం తీసుకోవడంలేదు. అడపాదడపా బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు అన్న క్యాంటీన్ల వంటి విషయాల్లో తీసుకున్న, తీసుకోబోతున్న నిర్ణయాలు మిస్ ఫైర్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వ్యవహారాల్లో వారికి కూడా తలంటు పడుతోంది.
అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకో ఇంకా పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చామన్న సంతృప్తికి రాలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. మంత్రులతో పోల్చుకుంటూ తమమాట చెల్లుబాటు కావడంలేదని గుర్రుగా ఉన్నారు. యువ మంత్రులు కూడా జోరు తగ్గించి కాస్త సీనియర్లను గమనిస్తూపోతే మంచిదని వైసీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.