సీఎం జగన్ కేంద్రంపై యుద్ధానికి సమరశంఖం పూరించడానికి రోజులు దగ్గరపడ్డాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీయే కావాలని జగన్ ని కార్నర్ చేస్తూ ఆ పరిస్థితి కొనితెచ్చుకునేలా ఉంది. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా సహా కేంద్ర సాయాలపై ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం జగన్ ఆలోచించారు. కానీ కమలదళం.. పైకి స్నేహం నటిస్తూ లోపల ద్వేషంతో రగిలిపోతోంది. మోదీ జగన్ ని ఆలింగనం చేసుకోవడం, అమిత్ షా ఆల్ ది బెస్ట్ చెప్పడం అన్నీ ఈ గేమ్ లో భాగమే. తీరా ఇప్పుడు జగన్ పాలన మొదలయ్యే సరికి కేంద్రం సహాయ నిరాకరణను పూర్తిగా మొదలు పెట్టేసింది.
కనీసం రాష్ట్రం తీసుకునే నిర్ణయాలను సైతం గౌరవించడం లేదంటే బీజేపీ వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గౌరవించడం పక్కనపెట్టి విమర్శించడం మొదలు పెడుతున్నారు బీజేపీ నాయకులు, ఒకరకంగా జగన్ సర్కార్ పై బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల రద్దుకి వ్యతిరేకంగా ఏకంగా కేంద్ర మంత్రి స్థాయి నుంచే లేఖలు రాయడం, పరిశ్రమల్లో 75శాతం స్థానికులకే అవకాశం ఇవ్వడాన్ని తప్పుపట్టడం, పోలవరం కాంట్రాక్ట్ పనుల రద్దుకి దురుద్దేశాలు ఆపాదించడం.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ కేంద్రం తప్పుపడుతూ వస్తోంది.
తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ అధినాయకత్వం స్క్రీన్ ప్లేనే అని అర్థమవుతోంది. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ విషయంలో వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిశారని మీడియాకు లీక్ లు ఇవ్వడం, 75 శాతం స్థానిక కోటాపై కేంద్ర మీడియా నానా రాద్ధాంతం చేయడం ఇవన్నీ కూడా బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమే. ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినదానికంటే.. బీజేపీ ఈ కొద్దిరోజుల్లోనే చాలా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తోంది, చేస్తోంది కూడా.
కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ హామీని పదే పదే దెప్పి పొడుస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. హోదాపై ప్రజల్ని వైసీపీ మోసం చేస్తోందని, అది ముగిసిన అధ్యాయమంటూ రెచ్చగొడుతున్నారు. కేంద్రంతో రాష్ట్రం సహకరించడంలేదంటూ బురదజల్లే ప్రయత్నాల్లో ఉన్నారు. వీటన్నిటినీ సీఎం జగన్ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. కేంద్ర వ్యవహార శైలిపై ఆయన ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. అయితే సరైన టైమ్ చూసుకుని కేంద్రంతో యుద్ధానికి దిగాలని ఆలోచిస్తున్నారు.
బీజేపీ, చంద్రబాబు కలిసి ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో అంతా చేశారు. ఇప్పుడు జగన్ తమకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు ఇలా ఒత్తిడి పెంచుతున్నారు. పాత లెక్కలన్నీ తవ్వితీస్తుండటంతో, పాపాల్లో తమ వాటా కూడా బైటపడుతుందనేది కమలనాథుల భయం. ఎంత ఒత్తిడి పెంచితే.. జగన్ అంతగా ఎదురు తిరుగుతారనేది వాస్తవం పాపం బీజేపీ నేతలకు తెలియకపోవచ్చు.