లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో యావత్ భారతదేశాన్ని ఆకర్షించిన కర్ణాటకలోని మండ్య పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ మరోసారి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లోక్‌సభ సమరంలో నిఖిల్‌పై మాజీ మంత్రి అంబరీశ్ సతీమణి సుమలత స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం నిఖిల్‌పై పోటీ చేసేందుకు కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఇద్దరు యువ నేతలకు మండ్య జిల్లాలోని కృష్ణరాజపేటె అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా మారనుంది. కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిలో భాగంగా కాంగ్రెస్ – జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అనర్హత వేటుకు గురయ్యారు. ఈనేపథ్యంలో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో అసంతృప్త ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వస్తే ఉప ఎన్నికల అవసరం ఉండకపోవచ్చు. అనర్హత వేటు నుంచి మినహాయించి రాజీనామాలు ఆమోదించినా ఎన్నికలు తప్పనిసరి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల వేటలో పడ్డాయి.
మండ్య జిల్లా దళపతులకు కంచుకోటగా ప్రసిద్ధి. అయితే లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి సుమలత చరిత్ర తిరగరాశారు. ప్రస్తుతం మరోసారి దళపతులకు పరాభవం ఎదురు కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కేఆర్ పేటెలో జేడీఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేఆర్ పేటె ఎమ్మెల్యే నారాయణేగౌడపై జనాల్లో వ్యతిరేకత ఉంది.
దీనికి తోడు జేడీఎస్‌కు కూడా ప్రస్తుతం పరిస్థితి బలహీనంగా ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా పుంజుకుంటోంది. దీనికి తోడు బీవై విజయేంద్ర పోటీ చేస్తే ఎంపీ సుమలత కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈక్రమంలో నిఖిల్ మరోసారి ఓడిపోతారని భావిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో పోటీపై యువనేతలు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని.. పోటీపై ఇంకా తీర్మానించలేదని చెబుతున్నారు.
కేఆర్ పేటె ఉప ఎన్నికలు వస్తే తాను బీజేపీ నుంచి పోటీ చేస్తాననే విషయమై ఇంకా పార్టీ పెద్దలతో చర్చించలేదని సీఎం యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర తెలిపారు. పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. జాతీయ నాయకుల నిర్ణయం మేరకు పోటీ చేయాలా? వద్దా? అనేది తెలుస్తుందన్నారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే విషయం గురించి తెలియదని చెప్పారు. కాగా కేఆర్ పేటె స్థానం నుంచి నిఖిల్ పోటీ చేయబోరని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. ఉప ఎన్నికలపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. ఈక్రమంలో అభ్యర్థి ఎవరనేది నిర్ణయించలేదని చెప్పారు. అయితే సినిమా షెడ్యూల్ త్వరగా ముగించుకోవాలని.. రాజకీయాలపై దృష్టి పెట్టాలని దేవెగౌడ సూచించారు. అంతేకానీ కేఆర్ పేటె నుంచి పోటీ చేస్తారని చెప్పలేదని స్పష్టం చేశారు.