భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇంకా బుద్ధి వచ్చినట్లుగా కనిపించడం లేదు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీ కంటె కూడా.. రాష్ట్రాన్ని వంచించిన భారతీయ జనతా పార్టీనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఛీత్కరించుకుంటున్నారనే సంగతి.. ఇటీవలి ఎన్నికల్లో చాలా స్పష్టంగా తేలిపోయింది. అయినా సరే.. భాజపా నాయకులు ఇప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ద్రోహచింతనతోనే మాట్లాడుతూ… మరిన్ని ఛీత్కారాలను మూటగట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా విషయంలో భాజపా ఎంత వంచనకు పాల్పడిందో ప్రజలందరికీ క్లారిటీ ఉంది. అందుకే ఒకప్పట్లో రాష్ట్రంలో అంతోఇంతో ప్రాభవం కలిగి ఉన్న పార్టీకి ఈసారి ఒక్కశాతం ఓట్లు కూడా దక్కలేదు. చివరికి రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 1.2 కంటె ఎక్కువ ఓట్లు సాధించింది. అయినా భాజపాను గద్దె ఎక్కించడం ద్వారా.. ఏపీ ప్రజలు ఏ ప్రత్యేకహోదానైతే కోరుకున్నారో.. ఆ విషయంలోనే మోసపోయారు. రకరకాల మాయమాటలు చెబుతూ.. ఆ అంశాన్ని దాటవేయడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్మోహనరెడ్డి సర్కారు కూడా ప్రత్యేకహోదా కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చేవరకు మడమ తిప్పేదిలేదని.. ప్రకటించింది. కేంద్రం వైఖరి ఎలా ఉన్నప్పటికీ.. తాము మాత్రం ప్రయత్నలోపం చేయకూడదని అనుకుంటోంది. అయితే ఈ విషయంలో భాజపా నేతలు మాత్రం వైకాపాను తప్పుపడుతుండడమే చిత్రం. తాము చేయాల్సింది చేయకపోగా.. వైకాపా వారు ప్రత్యేకహోదా మాటెత్తడం కూడా ఏపీ ప్రజల్ని మోసం చేయడమే అనే మాటలు అంటున్నారు. పురందేశ్వరి తాజాగా మాట్లాడుతూ హోదా విషయంలో ఏపీ ప్రజల్ని సీఎం జగన్ మభ్య పెడుతున్నారని అంటున్నారు.
జగన్ తన ప్రయత్నాలేవో తాను చేసుకోవచ్చు గాక… కానీ.. భాజపా నేతలు హోదా ఇస్తే ఇవ్వాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతే తప్ప.. ఇలా ముల్లుతో గుచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు వారిని మరింతగా ఛీత్కరించుకుంటారు. భాజపాలో తాము నెంబర్ టూ స్థానానికి రావాలని కలగంటున్న భాజపా.. ఎన్ని రాజకీయ ఎత్తుగడలు అయినా వేయవచ్చు గానీ.. ప్రత్యేకహోదా మాటెత్తకుండా ఉన్నంతవరకే మర్యాద మిగిలి ఉంటుందని తెలుసుకోవాలి.