సుఖేశ్ పేరు చెపితే పాఠకులకు చప్పున గుర్తుకు రాకపోవచ్చు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ప్రియుడు అంటే ఓహో అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు మీడియా జాక్విలిన్ మీద పెట్టినంత ఫోకస్ సుఖేశ్ మీద పెట్టలేదు. ఇప్పటిదాకా అతని మీద వచ్చిన కేసులు, ఆరోపణల గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఏవీ నిరూపితమై శిక్ష దాకా రాలేదు. ఎప్పటికి వస్తాయో తెలీదు. పైగా చాలాభాగం కేసులు ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్) డీల్ చేస్తోంది. అది ఏ నేరాల మీద పెట్టిందో నిందితుడికి కూడా చెప్పదు. లీకులతోనే వ్యవహారం నడుపుతుంది. దేశంలో మిగతా పరిశోధక సంస్థలన్నిటినీ పడుక్కోబెట్టి ఈడీని మాత్రమే వదులుతోంది బిజెపి ప్రభుత్వం. దానికి అధికారాలు అపరిమితం, బాధ్యత శూన్యం. అందువలన సుఖేశ్ కేసు కోర్టుల్లో ఏ మేరకు నిలుస్తుందోనని నా భయం.
పైగా యింకో విషయం కూడా ఉంది. ఈ సుఖేశ్ (కొన్ని చోట్ల స్పెల్లింగ్ సుకాశ్ అని కూడా రాస్తున్నారు) చేత టోకరా తిన్నవారిలో చాలామంది అవినీతిపరులు, అవినీతికి పాల్పడదా మనుకున్నవారు, అడ్డదారిలో పనులు కావాలని చూసినవారు. ‘నేనో పెద్ద అధికారిని, నాకు చాలా పలుకుబడి ఉంది, మీకా వెధవ పనిని చిటికెలో చేసిపెడతాను, ఆ డబ్బేదో నా మొహాన పడేయండి’ అని ఆశ పెట్టి, మభ్య పెట్టి, యితను డబ్బు సంపాదించాడు. ఇప్పుడు వాళ్లంతా వచ్చి ‘ఔనండి, మేము ఫలానా మంత్రికి లంచం యివ్వాలనుకున్నాం, ఇతన్ని ఏజంటుగా పెట్టుకున్నాం’ అని సాక్ష్యం చెప్తారా? తేలుకుట్టిన దొంగల్లా, పోయిన డబ్బు ఎలాగూ పోయింది, మనమెందుకు కేసుల్లో యిరుక్కోవాలి అనుకోవచ్చు. అందుకే అతనిపై ఉన్న 30 కేసుల్లో ఎన్ని కోర్టులో నిలబడతాయో నాకు తెలియదు.
ఇతని కథ ఒక క్రమంలో చెప్పుకుని వస్తే తప్ప యితని ఎదుగుదల అర్థం కాదు. సినిమాతారలతో అతని వ్యవహారాల గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. అది చివర్లో కలిపే మసాలా లాటిది. అసలు దినుసు అతనిలో, అతని భార్య లీనాలో ఉంది. అది ఎక్కువ ఆసక్తికరం. ఇతని తండ్రి విజయన్ చంద్రశేఖరన్. మధురై దగ్గర ఓ పల్లెటూరి నుంచి బెంగుళూరుకి వచ్చి స్థిరపడిన తమిళుడు. దిగువ మధ్యతరగతి మనిషి. చిన్న చిన్న రబ్బరు కాంట్రాక్టులు చేస్తూ మెకానిక్‌గా, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ సర్వీసు చేస్తూ జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నాడు. భార్య మాల. గృహిణి. వాళ్లకు 1989లో యీ సుఖేశ్ చంద్రశేఖరన్ పుట్టాడు. ఒక్కడే సంతానం కావడంతో బాగా చదివించాలనే కోరికతో యితన్ని ఖరీదైన బాల్డ్విన్ బాయ్స్ హైస్కూలులో చేర్పించాడు. తక్కిన కుర్రాళ్లందరూ కార్లలో దిగుతూంటే, తన తండ్రి మాత్రం స్కూటర్ మీద దింపడం సుఖేశ్‌కు నచ్చలేదు. ఎలాగోలా డబ్బు సంపాదించి, కార్లు కొనాలన్న కోరిక మనసులో ముద్రించుకు పోయింది. పాఠాలు తలకెక్కలేదు. స్కూలుకి మధ్యలోనే స్వస్తి చెప్పాడు.
చదువు అబ్బలేదు కానీ బహుభాషా ప్రావీణ్యం కలిగింది. ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఎదుటివాళ్లను సులభంగా నమ్మించి, బుట్టలో పెట్టగల సామర్థ్యం అబ్బింది. నల్లగా ఉన్నా, ఎత్తు 5‘ 9‘‘ మాత్రమే అయినా, రూపం లేకపోయినా, తనొక పెద్ద అధికారినని ఎవరినైనా సులభంగా నమ్మించగల చాకచక్యాన్ని సంపాదించుకున్నాడు. తన క్లాస్‌మేట్స్‌లో చాలామంది తలిదండ్రులు గవర్నమెంటులో ఉన్నతాధికారులు కావడంతో వాళ్లింకి వెళ్లి, వాళ్లు మాట్లాడే, మసలే తీరుని అధ్యయనం చేశాడు. 18 ఏళ్ల వయసు వచ్చేసరికే బ్యూరోక్రాట్స్, వ్యాపారస్తులు, రాజకీయనాయకులు వెళ్లే క్లబ్బులకు ప్రవేశం సంపాదించి, వాళ్ల లావాదేవీలను గమనిస్తూ, టెండర్లు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఎలాట్ అయ్యే విధానం వాటిలో డబ్బు చేతులు మారే పద్ధతి, వాళ్ల పరిభాష, బాడీ లాంగ్వేజి అన్నీ అధ్యయనం చేసేశాడు.
15 ఏళ్ల వ్యవధిలో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, దిల్లీ రాష్ట్రాలలో దాదాపు వెయ్యి మందిని మోసగించి, రమారమి రూ. 500 కోట్ల దాకా ఆర్జించడానికి యీ నైపుణ్యం ఉపయోగ పడింది. 33 ఏళ్ల వయసున్నతనికి 15 ఏళ్ల నేరచరిత్ర అంటే దాని అర్థం 18 ఏళ్లకే రంగంలోకి దిగాడని! కరక్టుగా చెప్పాలంటే 18 ఏళ్ల రావడానికి ముందే అతను దీనిలో ఓనమాలు దిద్దాడు. 2006 ఏప్రిల్‌లో17 ఏళ్ల వయసులో, అంటే డ్రైవింగ్ లైసెన్సు అప్లయి చేసే వయసు రాకుండానే కర్ణాటక మొత్తంలో అతను ఏ వాహనమైనా నడిపేందుకు అనుమతించే ఆదేశం ఒకటి తయారు చేసి, దానిపై పోలీసు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు!
ఆ తర్వాత 2007 ఆగస్టులో తలిదండ్రులతో కలిసి కోటి రూపాయల ఫ్రాడ్‌కి పాల్పడ్డాడు. 76 ఏళ్ల ముసలాయన తనకున్న స్థలాన్ని బెంగుళూరు డెవలప్మెంట్ అథారిటీ వాళ్లు స్వాధీనం చేసుకుందని లబోదిబో మంటూ ఉంటే సుఖేశ్ వెళ్లి ‘‘ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ నాకు స్నేహితుడు. అతనికి చెప్పి స్థలాన్ని విడిపిస్తాను. పైగా ఓ ఎన్నారై చేత మీ స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకునేట్లు చేస్తాను. కానీ దానికి ఖర్చవుతుంది.’’ అన్నాడు. సుఖేశ్ తలిదండ్రులు కూడా ఔనౌను అంటూ ముసలాయన్ను నమ్మించి రూ.1.15 కోట్లు కొట్టేశారు.ఆ డబ్బుతో సుఖేశ్ 5 కార్లు, 12 వాచీలు కొన్నాడు. అతనికి అదో పిచ్చి. ప్రస్తుతం అతని దగ్గర రూ. 18 కోట్ల విలువ చేసే 85 వాచీలు, రూ. 35 కోట్ల విలువ చేసే 54 కార్లు ఉన్నాయి.
ఈ హంగులతోనే అతను డబ్బున్న ఓ పెద్ద పబ్లిక్ ఫిగర్ అని జనాల్ని నమ్మిస్తూ వచ్చాడు. వాచీలన్నీ కుడి మణికట్టుకే పెడతాడు. ఎడమ చేయి పాంటు జేబులోంచి బయటకు తీయడు. ఎందుకంటే దానికి నాలుగు వేళ్లు లేవు. యాక్సిడెంటులో పోయాయని కొందరంటారు. అబ్బే కడుపు మండిన వాళ్లెవరో పట్టుకుని కోసేశారని కొందరంటారు. ఎందుకంటే అతను వందమంది నిరుద్యోగులకు లంచాలతో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి కోట్ల డబ్బు కొట్టేశాడు. వాళ్లలో ఎవరైనా చేసి ఉండవచ్చు. ఉద్యోగాలనే కాదు, ఎవరికి ఏ అవసరం ఉన్నా ‘లీవిట్ టు స్మిత్’ అనే రకం అతను. ఓ పేరున్న స్కూలులో తన పిల్లవాడి ఎడ్మిషన్ కోసం ఒకాయన తంటాలు పడుతున్నాడని విని అతన్ని ఓ కాఫీ షాపులో కలిసి ‘ఆ స్కూలు మా నాన్నగారిదే. ఆయనకు చెప్పి సీటిప్పిస్తే నాకెంత యిస్తారో చెప్పండి.’ అని బేరం పెట్టాడు.
దురదృష్టవశాత్తూ రెండు టేబుళ్ల అవతల కూర్చున్నవాడు ఆ స్కూలు ఓనరు కొడుకే. అతనొచ్చి యితన్ని చావబాదాడు. దాంతో ప్రత్యక్షంగా వ్యవహారాలు చేయడం కంటె ఫోన్లో బురిడీ కొట్టించడం యీజీ అనుకున్నాడితను. ఎందుకంటే వాయిస్‌తో అనేక గమ్మత్తులు చేయగలడు. మిమిక్రీ చేయగలడు. రెండు, మూడు కంఠస్వరాలతో మాట్లాడగలడు. ఇంతకీ మోసపోయిన ముసలాయన యితని మీద, తలిదండ్రుల మీదా కేసు పెట్టాడు. జైల్లో పడి, త్వరలోనే బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇటీవలే కింది కోర్టు ఆ కేసును కొట్టేసింది కూడా. సుఖేశ్‌కు అది తొలి కేసు.
ఇక రెండో కేసు 2009లో ‘కర్ణాటక మంత్రి గాలి కరుణాకర రెడ్డి గారబ్బాయిని, మీకు కొత్త కారు కోసం వెయిట్ చేస్తున్నారు కదా, అడ్డదారిలో త్వరగా యిప్పిస్తాను.’ అని రూ.3.72 లక్షలు కొట్టేశాడు. బాధితుడు కేసు పెట్టాడు. మంత్రి గారబ్బాయి బిల్డప్ కోసం ఉత్తుత్తి గన్‌తో ఓ గన్‌మన్‌ను పెట్టుకున్నాడు. వాడికి జీతం ఎగ్గొట్టాడు. అయ్యో చిన్నవాడు కదాన్న జాలి లేదు. 2013లో దిల్లీలో ఓ ఫార్మ్‌హౌస్ వాచ్‌మన్ దగ్గరకు వెళ్లి ‘నేను ఓ సినిమా కంపెనీ తరఫున వచ్చాను. మీ ఫార్మ్‌హౌస్‌లో షూటింగుకి మా నిర్మాతను ఒప్పిస్తాను. మీ ఓనరుకి చెప్పకుండా వచ్చినది నువ్వే తీసుకో. ఓ మూడు లక్షలిస్తే బేరం కుదురుస్తా.’ అని వాణ్నీ ముంచాడు. 2009లో బెంగుళూరులో బిఎమ్‌డబ్ల్యు కారు యిప్పిస్తానని చెప్పి మరొకడి దగ్గర రూ.2 లక్షలు కొట్టేశాడు.
మరొకడితో ఓ ఫస్ట్‌క్లాసయిన కారుని ప్రభుత్వం వేలం వేసేస్తోంది. ఎలాగోలా దాన్ని మీకు యిప్పిస్తాను. నేను ముఖ్యమంత్రి కరుణానిధి మనవణ్ని అని చెప్పి రూ.2 లక్షలు కాజేశాడు. ప్రభుత్వం వేలంలో స్కార్పియో కారు అని చెప్పుకునే 2010లో యింటాయన దగ్గర రూ.3.5 లక్షలు స్వాహా చేశాడు. నెలకు రూ.50 వేల అద్దెకు త్రీ బెడ్రూమ్ ఎపార్టుమెంటు తీసుకుని అద్దె ఎగ్గొట్టాడు. అదే సంవత్సరంలో ముఖ్యమంత్రి మనవణ్నని చెప్పుకునే లగ్జరీ కారు యిప్పిస్తానంటూ మరొకడి దగ్గర రూ. 6 లక్షలు గుంజాడు. ముఖ్యమంత్రి మనవణ్ని అని చెపితే మోసపోయిన వాళ్లలో లీనా మేరియా కూడా ఉంది.
లీనా తండ్రి పాల్ కేరళలోని త్రిశూర్‌కు చెందినవాడు. దుబాయిలో స్థిరపడ్డాడు. లీనా అక్కడే పుట్టి పెరిగింది. బెంగుళూరులో డెంటల్ సైన్సెస్ కోర్సులో చేరి, సినిమాలపై మోజుతో మధ్యలో మానేసింది. చెన్నయ్ నుంచి సుఖేశ్ ఫోన్ చేసి ‘తమిళంలో సినిమా తీస్తున్నాను, చెన్నయ్ రా’ అని పిలిపించాడు. బెంగుళూరులో రెండో కేసు తర్వాత అతను మధురై వెళ్లి ఓ సినిమా హాలు మేనేజరుని కలిసి మీ థియేటర్‌కు డిజిటల్ సౌండ్ సిస్టమ్ పెట్టిస్తా అంటూ డబ్బు లాగి దానితో 2 కార్లు, 21 వాచీలు కొన్నాడు. మేనేజరుకి అనుమానం వచ్చి నిలదీస్తే అతని గొంతు నులిమి చంపబోయాడు.
ఇలా డబ్బు పోగేసి, లీనాను కలవడానికి వెళ్లినపుడు పెద్ద బుగ్గ కారులో, అసిస్టెంటుతో సహా వెళ్లాడు. కరుణానిధి మనవణ్నని చెప్పుకున్నాడు. అది చూసి ఆమె మురిసి మూర్ఛపోయింది. మోహన్ లాల్ వేసిన ‘‘రెడ్ చిల్లీస్’’ (2009) సినిమాలో ఆమెకో వేషం యిప్పించాడు. సినిమాల మాట ఎలా ఉన్నా, ఓ పక్క టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అతనితో కలిసి సహజీవనం చేసింది. వాళ్లిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. త్వరలోనే అతనొట్టి మోసగాడని లీనాకు తెలిసిపోయింది. బెంగుళూరులో అతను చేసిన మోసాల కూపీ లాగుతూ చెన్నయ్ వచ్చిన దేవరాజ అనే పోలీసు అధికారికి అతని కూపీ యిచ్చి, సుఖేశ్‌ను అరెస్టు చేసేందుకు సహకరించింది. అతను జైల్లో పడగానే, కేరళ వెళ్లిపోయింది. సుఖేశ్ త్వరలోనే బెయిలు మీద బయటకు వచ్చాడు. కేరళ వెళ్లి లీనాను బతిమాలి బామాలి ఒప్పించాడు. ఇకపై తనతో మోసాల్లో పాలు పంచుకోవడానికి అంగీకరింప చేశాడు.
ఇది 2011. అప్పణ్నుంచి లీనా భర్త వ్యవహారాలు చక్కపెడుతూ, అతను పోగేసిన డబ్బుకి చట్టబద్ధమైన ముసుగుగా ఉపయోగపడింది. ‘నెయిల్ ఆర్టిస్ట్రీ’ అనే పేర ఒక లగ్జరీ నెయిల్ ఆర్ట్ సులాన్ తెరిచి, అనేక చోట్ల బ్రాంచీలు ప్రారంభించి, యీ దొంగ డబ్బుని దాని ద్వారా వచ్చిన ఆదాయంగా చూపించింది. డబ్బు వేరేలా వస్తున్నా, సినిమాలపై వ్యామోహంతో ‘‘హస్బండ్స్ ఇన్ గోవా’’ (2012), ‘‘మద్రాస్ కఫే’’ (2013), ‘‘బిర్యానీ’’ (2021), ‘‘కోబ్రా’’ (2022) సినిమాల్లో నటించింది. లీనా కోచీలో ఉన్న రోజుల్లోనే సుఖేశ్ కోయంబత్తూరులో ఉంటూ ప్రభుత్వ కాంట్రాక్టులు యిప్పిస్తానంటూ రూ. 12.5 లక్షల దాకా కొట్టేశాడు.
ఈ జంట 2012 వరకు కోచిలోనే ఉంది. కానీ అక్కడున్న ఎమాన్యుయేల్ సిల్క్స్ వాళ్లు చీటింగు కేసు పెట్టడంతో అక్కణ్నుంచి జండా ఎత్తేయవలసి వచ్చింది. వాళ్లు కొటాయంలో తెరిచిన బ్రాంచి ప్రారంభోత్సవానికి కత్రినా కైఫ్‌ను తీసుకుని వస్తానని మాట యిచ్చి రూ.20 లక్షలు తీసుకుని తన బదులు అల్లు అర్జున్ను తీసుకెళ్లాడు. దాంతో వాళ్లు కేసు పెట్టారు. వీళ్లు చెన్నయ్‌కు జంప్ చేసి, 2013లో రూ. 12 కోట్ల మోసానికి పాల్పడ్డారు. బాలసుబ్రమణియన్, చిత్ర అనే భార్యాభర్తలు శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మెషిన్లు అమ్మే వ్యాపారం పెట్టారు. ఇతను వాళ్లను కలిసి ‘కర్ణాటక ప్రభుత్వం జనాలకు ఉచిత శానిటరీ నేప్కిన్స్ యివ్వాలనుకుంటోంది. జయకుమార్ అనే ఐఏఎస్ అధికారి ఆ వ్యవహారం చూస్తున్నారు. నేను పరిచయం చేస్తాను, మీరు ఆయనకు యివ్వాల్సినది యిస్తే 30 వేల యంత్రాలు కొంటాడు. రూ.132 కోట్ల కాంట్రాక్టు మీకు వస్తుంది.’ అని చెప్పాడు.
వీళ్లు సరేనంటే ఒక లాండ్‌లైన్ నెంబరు యిచ్చాడు. అది కర్ణాటక సెక్రటేరియట్ ఉన్న ప్రాంతందే. ఆ నెంబరుకు ఫోన్ చేయగానే ఒకావిడ ‘నేను జయకుమార్ సెక్రటరీని’ అంటూ సుఖేశ్‌కు లైను కలిపింది. సుఖేశ్ ఫోన్ తీసుకుని ‘నేను జయకుమార్‌ని. మీరు రూ.19 కోట్లు లంచం యిస్తేనే ఆ కాంట్రాక్టు మీకు వస్తుంది.’ అని చెప్పాడు. ఈ దంపతులు అది నమ్మారు కానీ అంత డబ్బు వాళ్ల దగ్గర లేదు. కెనరా బ్యాంకు, అంబత్తూరు బ్రాంచ్ మేనేజరును కలిసి రూ.19 కోట్ల ఋణం యిమ్మనమని అడిగారు. అంత పెద్ద లోను యివ్వలేనని మేనేజరు చెప్పగానే, మళ్లీ సుఖేశ్ జయకుమార్ అవతారం ఎత్తి, ఆయనతో మాట్లాడి, గవర్నమెంటు డాక్యుమెంట్లు కూడా కొన్ని పంపి, వాళ్లకు ప్రభుత్వ ఆర్డరు వచ్చినట్లు ఆయన్ను నమ్మించాడు. దాంతో లోను శాంక్షనయింది.
సుఖేశ్ ఆదేశాల మేరకు ఆ డబ్బును కొద్దికొద్దిగా వివిధ ఖాతాలకు పంపడం ప్రారంభించిది బ్యాంకు. ‘చాలామందికి దీనిలో వాటా యివ్వాలి. వాళ్ల బినామీలకు పంపాలి కదా’ అని సుఖేశ్ చెప్పడంతో బ్యాంకు వాళ్లు నమ్మారు. కానీ కొన్ని రోజులకు యీ ట్రాన్సాక్షన్లు బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వాళ్లకు అనుమానం వచ్చి ఆపించేశారు. వ్యాపారాభివృద్ధికి సప్లయిర్లకు పంపవలసిన డబ్బును యిలా వ్యక్తులకు పంపడమేమిటని వాళ్ల ప్రశ్న. కానీ వాళ్లు ఆపేటప్పటికే రూ. 12 కోట్లకు రెక్కలు వచ్చాయి. కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగితే అలాటి ప్రతిపాదనే లేదన్నారు. మోసం బయటపడింది. సుఖేశ్, లీనాలపై కేసు పెట్టారు. కానీ సెక్రటరీగా మాట్లాడినది లీనాయేనని నిరూపించలేక పోవడం చేత కేసు నుంచి ఆమెను తప్పించారు.
ఈ ఫ్రాడ్ చేస్తూండగానే సుఖేశ్ ఓ చిలక్కొట్టు కొట్టాడు. ఓ రోజు ఓ పేపర్ యాడ్ చూశాడు. స్కైలార్క్ అనే టెక్స్టైల్ కంపెనీ మేం బల్క్ ఆర్డర్లు తీసుకుంటాం అని యిచ్చిన ప్రకటన అది. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి ‘నేను జయకుమార్ అని కర్ణాటక ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీని. స్కూలు పిల్లలకు ఉచిత యూనిఫాం యిచ్చే ప్రతిపాదన ఒకటి మాకుంది. రూ. 400 కోట్ల ఆర్డరిప్పిస్తాను. నాకేమిస్తారు?’ అని అడిగాడు. ఇతనో ఫ్రాడ్ అని తెలుసుకునే లోపునే ఆ కంపెనీ వాళ్లకు రూ.84 లక్షలు చేతిచమురు వదిలిపోయింది. దక్షిణాది నుంచి యితర ప్రాంతాలకు తమ కార్యకలాపాలు విస్తరించాలనే ఉద్దేశంతో యీ జంటు ముంబయికి వెళ్లింది. అక్కడుండగానే 2015లో పెళ్లి చేసుకుంది. అక్కడ ఒక ‘లయన్ ఓక్ ఇండియా’ పేరుతో ఓ కంపెనీ పెట్టి పోంజీ స్కీము (ఇవాళ కొంత డిపాజిట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత రెట్టింపు తిరిగి యిస్తామని ఆశ పెట్టే స్కీము) ప్రారంభించారు. 5 వేల నుంచి 5 లక్షల దాకా ఎంతైనా తీసుకునేవారు. కానీ క్యాష్‌లోనే యిమ్మనేవారు.
వచ్చిన డబ్బులో ఒక్క పైసా కూడా బ్యాంకులో వేయలేదు. సుఖేశ్ మరిన్ని కార్లు కొన్నాడు. చుట్టూ నలుగురు సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని తిరిగేవాడు. హంగుకోసం ఆఫీసులో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగు ఒకటి (అదీ డూప్లికేటే) వేలాడేది. దానికి ఎదురుగా ఓ కత్తి! ఇది అలెగ్జాండరుది, పారిసులో వేలంలో కొన్నాను అని యితను చెప్పుకునేవాడు. 450 మంది రూ. 19.5 కోట్ల పెట్టుబడి పెట్టారు. కానీ ఏడాది తిరక్కుండానే ఎవరో పోలీసులకు ఫిర్యాదు చేయడం, వాళ్లొచ్చి కంపెనీ మూయించేసి, యితన్ని అరెస్టు చేయడం జరిగాయి. బయటకు వచ్చేశాక 2016లో చెన్నయ్ వెళ్లి ఓ రియల్ ఎస్టేటు డీల్‌లో ఓ డాక్టరును దగా చేసి రూ. 50 లక్షలు సంపాదించాడు.
అప్పట్లో అంటే 2017లో శశికళ మేనల్లుడు దినకరన్ ఎడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులను తన వర్గానికి తెప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని యితను వెళ్లి ‘ఎన్నికల కమిషన్‌లో నాకు తెలిసున్న వారున్నారు. ఓ రూ.50 కోట్లు మనవి కావనుకుంటే పని అయిపోతుంది. మధ్యలో నాక్కొంత కమిషన్ యిస్తే చాలు అన్నాడు. ఇతను ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం యిస్తూండగా దిల్లీ పోలీసుల కంట పడి వాళ్ల యితన్ని అరెస్టు చేశారు. దినకరన్ తనకేమీ తెలియదన్నాడు. ఏది ఏమైనా సుఖేశ్‌కు యీ వ్యవహారంలో రూ.1.30 కోట్లు ముట్టింది. దిల్లీ పోలీసులు యితన్ని తీహార్ జైల్లోకి అండర్‌ట్రయల్‌గా (కేసు విచారణలో ఉన్న వ్యక్తి) పెట్టారు. అతను దిల్లీలో ఉన్న మరో కారాగారం రోహిణి జైల్లో కూడా కొంతకాలం ఉన్నాడు. మరొకరైతే కృంగిపోయేవారు. కానీ సుఖేశ్ దాన్ని ఓ పెద్ద అవకాశంగా మలచుకున్నాడు. ఇంకా పెద్ద ఫ్రాడ్ చేశాడు. దాని వివరాలు తర్వాతి వ్యాసంలో. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)