పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెద్దగా టచ్ లో ఉండరు చాలా మంది నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలకు బాగా టచ్లో ఉండే వారు కూడా, అధికారం అందాకా తీరు మార్చుకుంటూ ఉంటారు. ఎంత రాజకీయ నేపథ్యం ఉన్న వారు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తూ ఉండటం పెద్ద వింత కాదు. ఇలాంటి క్రమంలోనే ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పలువురు ఎమ్మెల్యేలు ఇలాంటి తీరుతో వ్యవహరిస్తున్నారనే పేరుంది. వీరిలో ఒకరు గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి.
గత ఎన్నికల్లో వెంకటరామిరెడ్డి భారీ మెజారిటీతోనే నెగ్గారు. తెలుగుదేశం అభ్యర్థి జితేందర్ గౌడ్ పై వెంకటరామిరెడ్డి 48 వేల ఓట్ల భారీ మెజారిటీతో నెగ్గారు. అంతకు ముందు ఎన్నికల్లో జితేందర్ గౌడ్ చేతిలో ఓడిన వెంకటరామిరెడ్డి అలా ప్రతీకార విజయాన్ని భారీ స్థాయిలో నమోదు చేశారు. మరి ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఎలా ఉందంటే.. నియోజకవర్గం స్థాయిలో పెద్దగా అందుబాటులో ఉండరనే పేరును సంపాదించుకున్నారు ఈ పొలిటీషియన్.
ప్రజలకైనా, క్యాడర్ కు అయినా వెంకటరామిరెడ్డి పెద్దగా అందుబాటులో ఉండరని.. దీంతో నియోకవర్గంలో ఎమ్మెల్యే దొరకడం అనేది దుర్లభమైన అంశంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు క్లాసులు పీకుతున్నారని, నెలలో సగం రోజులు ప్రజల మధ్యన ఉండాల్సిందే అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పష్టం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో.. నియోజకవర్గం లో పెద్దగా అందుబాటులో ఉండని నేతల జాబితా కూడా ఒకటి జగన్ చేరిందంటున్నారు. మరి ఆ జాబితాలో వెంకటరామిరెడ్డి ఉన్నారో లేదో కానీ , క్షేత్ర స్థాయి అభిప్రాయాలను బట్టి పెద్దగా అందుబాటులో ఉండని నేతగా వెంకటరామిరెడ్డికి పేరు వచ్చింది. మరి గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సంగతెలా ఉన్నా.. వచ్చేసారి విజయం కావాలంటే వెంకటరామిరెడ్డి వ్యవహారంలో తేడా ఉండాలేమో!