రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదేపదే గొప్పలు చెప్పుకుంటుంటారు. అయితే ఏంటి లాభం? వయసు పైబడుతూ, అనుభవాలు పెరుగుతున్న క్రమంలో మానసికంగా ఎదిగితేనే మంచి మనిషిగా, నాయకుడిగా ప్రశంసలు అందుకుంటారు. అదేంటో గానీ చంద్రబాబు విషయంలో అంతా రివర్స్.
బాబుకు వయసు పెరుగుతున్న కొద్ది బుర్ర పాడై పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ఓర్వలేనితనం, ఇతరుల్ని ప్రేమించలేని స్వభావం రాజకీయంగా, సామాజికంగా ఆయన్ని బద్నాం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వైఎస్సార్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన నైజాన్ని చూపుతున్నాయని ఉదహరిస్తున్నారు.
2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాంధీ జయంతినాడు హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో 208 రోజుల్లో 2,817 కి.మీ. చొప్పున ఆయన పాదయాత్ర చేశారు. 2014లో విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. పాదయాత్రకు సంబంధించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా చంద్రదండు ఆధ్వర్యంలో చంద్రబాబును హైదరాబాద్‌లో సత్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేయడంతో ప్రజలకు భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేశానని చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలే చంద్రబాబు అంటే జనం ఛీకొట్టేలా చేసేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2004, ఆ తర్వాత 2009లో వైఎస్సార్ నేతృత్వంలో చంద్రబాబును ఓడించి, రెండు సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 2009లో వైఎస్సార్ ఆకస్మికంగా మరణించారు.
2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని వైఎస్సార్ ఐదేళ్లు పాలించారు. ఆయన పాలనకు మెచ్చి రెండోసారి కూడా అధికారాన్ని కట్టబెట్టారు. అంతకు ముందు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనా రీతులు జనాన్ని భయపెట్టాయి. అందుకే రెండోసారి కూడా వైఎస్సార్ నాయకత్వానికి జనం జై కొట్టారు. రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్, ఆ వెంటనే తనువు చాలించిన సంగతి తెలిసిందే.
దివంగతులైన వైఎస్సార్‌పై చంద్రబాబు తాజాగా అక్కసు ప్రదర్శించడం విమర్శలకు దారి తీసింది. 2012లో వైఎస్సార్ పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేశానని చంద్రబాబు చెప్పడం అంటే, చంద్రబాబు సంస్కారం ఎంత నీచమో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ధోరణే చంద్రబాబు అంటే జనానికి విసుగెత్తేలా చేసిందని అంటున్నారు. పాలనతో సంబంధం లేని వైఎస్సార్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడ్డం ఏంటనే నిలదీతలు ఎదురవుతున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రాన్ని పాలించిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల గురించి మాట్లాడ్డానికి చంద్రబాబుకు ఎందుకు నోరు రాలేదో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ అంటే చంద్రబాబు ఎంతలా భయపడుతున్నారో ఆయనపై విమర్శలే నిదర్శనం అంటున్నారు.