ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు ఎప్పటికీ సాకారం అయ్యేలా కనిపించడం లేదు. ఇందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగమే నిలువెత్తు నిదర్శనం. అధికారం గురించి ప్రతి రాజకీయ పార్టీ కలలు కంటూ వుంటుంది. కలలు నిజం కావాలంటే ఎంతో శ్రమించాల్సి వుంటుంది. ప్రజల నమ్మకాన్ని చూరగొనాల్సి వుంటుంది. అయితే బీజేపీవి పగటి కలలు. రాత్రి కలలు నిద్రకు, పగటి కలలు పనికి చేటనే సామెత చందాన ..ఏపీ బీజేపీ నేతల మాటున్నాయి. అధికారంలోకి వస్తే… అది చేస్తాం, ఇది చేస్తామనే ప్రగల్భాలు బాగున్నాయి. అయితే అధికారంలోకి రావడం ఎట్లా? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలి.
దేశమంతా విస్తరిస్తున్న బీజేపీకి, ఏపీలో మాత్రం కనుచూపు మేరలో అధికారం దక్కుతుందనే నమ్మకం కలగడం లేదు. ఇందుకు ఏపీ బీజేపీ నేతల వైఖరే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు బీజేపీనే తప్ప, ఏపీ ప్రాంతీయ పార్టీల అనుబంధ , అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శ బలంగా ఉంది. ఇది నిజం కూడా. ఎంతసేపూ ఏపీలో ఎప్పటికీ టీడీపీనే అధికారంలో ఉండాలని కొందరు, వైసీపీ వుంటే తమకు మేలని మరికొందరు బీజేపీ నేతలు కోరుకుంటున్నారు.
రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీలో వుంటున్న నేతల వల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతోంది. ఇదిలా వుండగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైఖరి భలే విచిత్రంగా వుంటోంది. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పులిలా ప్రత్యర్థులపై విరుచుకుపడడం చూసి, తాను కూడా అదే అనుకుని వీర్రాజు గాండ్రించాలని అనుకుంటుంటారు. నేలవిడిచి సాము చేయడం అంటే ఏంటో సోము వీర్రాజును చూసి తెలుసుకోవచ్చు. ఏపీలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని సోము వీర్రాజు పరోక్షంగా ప్రకటించారు.
“ఏపీ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడే పోలవరం, రాజధాని సాకారం అవుతాయి. ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తాం. రెండు యూనిట్లు వుండే లారీ ఇసుక రూ.4 వేలకు, ట్రాక్టర్ ఇసుక రూ.1500కు అందిస్తాం. మొక్కల పెంపకం బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తాం” అని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంకా ఇలాంటివి అనేకం చేస్తామని ఆయన చెప్పారు.
అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో ఆయన ఆలోచిస్తున్నట్టు లేదు. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్. దీన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన బాధ్యత వుంది. ఆ విషయాన్ని మరిచిపోయి, అధికారంలోకి వస్తేనే పూర్తి చేస్తామని చెప్పడం ద్వారా, ఎప్పటికీ అది నిర్మాణానికి నోచుకోదని తేల్చి చెప్పినట్టైంది. ఇలాగైతే జనం ఓట్లు వేస్తారా? రాజధాని విషయంలోనూ బీజేపీ ఆడుతున్న డ్రామాల్ని జనం గమనిస్తున్నారు. అమరావతిలోనే రాజధాని వుండాలనేది బీజేపీ అభిప్రాయమట. మళ్లీ ఇదే బీజేపీ పాలనలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం… మీ రాజధాని, మీ ఇష్టమని హైకోర్టులో అఫిడవిట్లు వేసింది.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి నిధులు ఇస్తే బీజేపీపై గౌరవం పెరుగుతుంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే నిజంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనే నమ్మకం ఏర్పడుతుంది. ఇవేవి బీజేపీ చేయదు. మాటలు మాత్రం కోటలు దాటిస్తుంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ అమ్మకం, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ఏపీలో భవిష్యత్ ఉందనుకోవడం ఆ పార్టీ పగటి కలలుగా భావించొచ్చు. ఎప్పటికీ ఏపీలో అధికారంలోకి వచ్చేది, చచ్చేది లేదని… ఉత్తుత్తి హామీలు ఇస్తున్న బీజేపీ నేతల్ని చూస్తూ జనం నవ్వుకుంటున్నారు.