కుప్పం నియోజకవర్గంలో వైసిపి చేస్తున్న హడావుడి చూస్తే చంద్రబాబుకి కష్టకాలం వచ్చినట్లు తోస్తోంది. 2024లో బాబు ఓడిపోతారని జోస్యం చెప్పలేం కానీ పరిస్థితులు యిలాగే ఉంటే మెజారిటీ తగ్గవచ్చేమో అనిపిస్తుంది. రాబోయే రెండేళ్లలో వైసిపి పలుకుబడి తగ్గితే, అప్పుడు గతంలో కంటె ఎక్కువ మెజారిటీ రావచ్చేమో కూడా! రాష్ట్రవ్యాప్తంగా వైసిపి బలం తగ్గే సూచనలున్నాయి కానీ టిడిపి బలం పుంజుకునే సూచనలు ప్రస్తుతానికి కనబడటం లేదు. టిడిపి పట్ల అభిమానంతో కాకపోయినా, వైసిపి పట్ల వ్యతిరేకతతో టిడిపికి 50-60 సీట్లు వచ్చేట్లా ఉంది పరిస్థితి. రెండేళ్లలోగా ఏం జరుగుతుందో యిప్పుడే చెప్పే సాహసం చేయలేం కాబట్టి యీ అంకెలేవీ అప్పటికి పనికి రావు. అయినా వర్తమానం బట్టి భవిష్యత్తును ఊహించడం మానవలక్షణం కాబట్టి కుప్పంలో బాబు మెజారిటీ తగ్గవచ్చు అని అంటున్నాను.
కుప్పం అంటే బాబు పెరట్లోని నియోజకవర్గమే, అక్కడ ఆయన తప్ప వేరెవరు గెలుస్తారు? అని అనుకుంటూ వచ్చిన మనకు స్థానిక వైసిపి నాయకులు ఆత్మవిశ్వాసంతో వల్లిస్తున్న గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. 1999లో బాబుకి 66వేల మెజారిటీ వచ్చింది. అది 2004కి 60 వేలైంది (70% ఓట్లు), 2009కి 46 వేలైంది (62%), 2014కి 47 వేలైంది (62.5%), 2019కి 30 వేలైంది (55%). ఇలా నానాటికీ తీసికట్టయింది. 1955 నుంచి ఆ నియోజకవర్గం తీరు చూస్తే 1955లో కాంగ్రెసు, 1962లో కమ్యూనిస్టు, 1967,72లలో స్వతంత్రుడు, 1978లో కాంగ్రెసు, 1983 నుంచి యిప్పటివరకు టిడిపి. 1983,85లలో రంగస్వామి నాయుడు గెలిస్తే, 1989 నుంచి బాబే గెలుస్తున్నారు.
7 సార్లు తనను గెలిపించి, ముఖ్యమంత్రి కావడానికి సోపానాలు వేసిన కుప్పంకు బాబు ఏమీ చేయలేదని వైసిపి ఆరోపిస్తోంది. కానీ నేను నమ్మను. విద్యాసంస్థలున్నాయి, ద్రవిడ యూనివర్శిటీ ఉంది. కానీ మునిసిపాలిటీగా చేయలేదు, అది మేమే చేశాం, గెలిచాం అంటోంది వైసిపి. అలాగే ఏమేమి చేయలేదో లిస్టు చదువుతున్నారు. అక్కడే కాదు, ఏ వూరివాళ్లను అడిగినా యిలాటి అసంతృప్తి మనసులో ఉంటుంది. దాన్ని గుర్తు చేసి, పైకి తెచ్చి, సొమ్ము చేసుకునే పనిలో పడింది వైసిపి. రోడ్లు సరిగ్గా లేవు (రాష్ట్రంలో సరిగ్గా ఎక్కడున్నాయి?), స్కూళ్లు బాగా లేవు, మరుగుదొడ్లు లేవు.. అంటూ లిస్టు చదువుతోంది. ప్రత్యేకించి స్కూళ్లను బాగు చేసి, అబ్బో అనిపించే స్థాయిలో తీర్చిదిద్ది టీవీలో చూపిస్తున్నారు. బాబు సొంత పల్లె నారావారి పల్లెలో కూడా మేమే చేశాం, ఆయనేమీ చేయలేదు అని చాటుకుంటున్నారు.
వెంగళరావుగారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్నీ ఖమ్మం జిల్లాకే తీసుకుపోయారు. పైగా తన సొంత నియోజకవర్గమైన సత్తుపల్లిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఎన్ని విమర్శలు వచ్చినా జంకలేదు. బాబుతో వచ్చిన గొడవేమిటంటే ఆయనకు ‘సొంత’ ఫీలింగు తక్కువ. తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి, ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పంకు కాదు కదా, రాయలసీమకు కూడా ఏమీ చేయలేదు. ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉండగా యావత్తు శక్తియుక్తులు హైదరాబాదుకే వెచ్చించారు. తక్కిన రాష్ట్రమంతా ఎండగట్టి (కరువు కూడా వచ్చింది లెండి) హైదరాబాదులో డబ్బు దిమ్మరించారు. ఇప్పుడు హైదరాబాదులో నిలువనీడ లేకుండా పోయింది. తెలంగాణ మొత్తంలో పార్టీ ఎక్కడుంది అంటే భూతద్దం పెట్టి వెతకాలి.
ఆ అనుభవంతోనైనా 2014-19 మధ్య ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమను వృద్ధి చేసుకుని ఉంటే కనీసం ఒక కంచుకోట ఏర్పడేది. రాయలసీమకు యివ్వాల్సిన హైకోర్టును కూడా ఎగ్గొట్టి, అంతా కృష్ణా-గుంటూరు ప్రాంతాలకే తరలించారు. కర్నూలుకి రావలసిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించారు. దాంతో ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా ఉన్న రాయలసీమ టిడిపిని నిరాదరిస్తోంది. కుప్పంలో పదేళ్ల క్రితం 60 వేల మెజారిటీ యీ రోజు 47కి పడిపోయింది కదా, దాన్ని పెంచుకోవడానికి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ధ్యాస లేకపోయింది ఆయనకి. నన్ను గెలిపించక ఏం చేస్తారు? అనే ధీమాతో ఉన్నారు. దాంతో 2019లో 30కి పడిపోయింది.
ఆ రిజల్టుతో ఉలిక్కిపడి బాబు కుప్పంపై దృష్టి పెట్టి, అక్కడకి యిల్లు మార్చి, కుప్పం కేంద్రంగా రాయలసీమను తన చేతిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయాల్సింది. కానీ ఆయన హైదరాబాదు వదలలేదు. అది యిప్పుడు వైసిపికి అస్త్రంగా మారింది. బాబు హైదరాబాదుకి లోకల్, కుప్పంకు నాన్ లోకల్. ఇక్కడ సొంత యిల్లు లేదు, అద్దె యిల్లు లేదు, అడ్రసే లేదు, ఆధార్ లేదు, ఓటరు ఐడీ లేదు, ఎన్నడూ యిక్కడ ఓటేసిన పాపాన పోలేదు. అలాటివాడు కావాలా? లోకల్‌గా నివాసముంటూ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా? అని ప్రచారం మొదలుపెట్టారు. పైగా యితన్ని గెలిపిస్తే మంత్రిని చేస్తా, మీ నియోజకవర్గం పట్టరానంతగా అభివృద్ధి అయిపోతుంది అంటున్నారు. నిజానికి బాబు స్టేచరున్నవాళ్లను ఓడించినవార్ని జెయింట్ కిల్లర్‌గా మంత్రిని చేస్తారు. ఆ ముక్కేదో ముందే చెప్పడం చాకచక్యం.
బాబు హైదరాబాదు నుంచి కదిలి వస్తే అమరావతిలోనే తేలుతున్నారు. పైన చెప్పినట్లు రాయలసీమపై ఫోకస్ పెట్టకుండా ఎంతసేపూ అమరావతి, అమరావతి అని కలవరిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి భువనేశ్వరిగారు గాజుల జత యిచ్చారు తప్ప కుప్పంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి యివ్వలేదు. నిజానికి ప్రజలకు దగ్గరయ్యే అవకాశాన్ని కరోనా యిచ్చింది. ఆ టైములో బాబు హైదరాబాదులో ఉండిపోకుండా ‘కష్టకాలంలో మీ మధ్య ఉన్నాను’ అంటూ కుప్పంలో తిరిగి ఉంటే గుర్తు పెట్టుకునేవారు. వయసు మీరినాయన కాబట్టి ఆయన పెద్దగా తిరగకపోయినా ‘బాబు యువసేన’ అనో తన హయాంలో ఏర్పరచిన ‘జన్మభూమి కమిటీ’ అనో వేరే ఏదో ఒక సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు చేపట్టి ఉంటే ప్రజల మనస్సులో నాటుకునేది.
తాను ఎంతో ప్రమోట్ చేసిన అమరావతి ప్రాంతంలోని మంగళగిరి కొడుకుని ఓడించి కూర్చోబెట్టింది. కానీ కుప్పం మాత్రం తల్లిలా ఆదరించి, తనను నెగ్గించింది అనే కృతజ్ఞత ఆయనలో ఉంటే యింత చులకనగా చూసేవారు కారు. పోల్చి చూస్తే వైయస్ కానీ, జగన్ కానీ పులివెందులలోనే ఓటేశారు. అక్కడ వాళ్లకు ఎంతో చేసి ఆకట్టుకున్నారు. బాబు తను జాతీయ స్థాయి నాయకుణ్ని అనుకుంటూ తనను అందలం ఎక్కించిన నియోజకవర్గాన్ని తేలికగా తీసుకున్నారు.
జగన్ యిది గ్రహించాడు. గతంలో వెంగళరావు గారిలా ఒక నియోజకవర్గంలో నిధులు గుమ్మరించ సాగాడు. వెంగళరావు తన నియోజకవర్గంలో గుమ్మరిస్తే, జగన్ తన ప్రత్యర్థి నియోజకవర్గంలో నిధులు ప్రవహింప చేశాడు. ఇంత చేసినా మన పథకం విఫలమై, వాళ్లు బాబుకే ఓటేస్తారేమోనన్న సంశయం పెట్టుకోకుండా దాన్ని అభివృద్ధి చేస్తూ పోయాడు. ‘చూశారా, 33 ఏళ్లగా మీరు గెలిపిస్తూ వచ్చినా ఆయన ఏమీ చేయలేదు, నా పార్టీని ఓడించినా మీకు అన్నీ చేస్తున్నాను’ అని చూపించడానికి యిదంతా చేస్తున్నాడు. దీన్ని ఎదుర్కోవడానికి బాబు వద్ద అస్త్రాలు లేవు.
ఈ జాతీయస్థాయి పాలిటిక్స్ అనేది ఒక వ్యామోహం. ప్రాంతీయ పార్టీల ఒంటికి యిది పడదు. ఆ విషయం ద్రవిడ పార్టీలకు బాగా తెలుసు కాబట్టే డిఎంకె 1967లోనే తమిళనాడులో (అప్పట్లో మద్రాసు రాష్ట్రం) అధికారంలోకి వచ్చినా జాతీయ స్థాయి గురించి పాకులాడ లేదు. కరుణానిధికి ఇంగ్లీషు రాదు కాబట్టి అనుకోనక్కరలేదు, జయలలితకు ఇంగ్లీషు, హిందీ వచ్చినా అటు పోలేదు. రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు కూడా యిక్కడే దేవుళ్లాడింది తప్ప, దిల్లీకి వెళ్లి మొగ్గలు వేయలేదు. అనేక విషయాల్లో డిఎంకెను కాపీ కొట్టిన ఎన్టీయార్ మాత్రం నేషనల్ ఫ్రంట్ అంటూ పెట్టి, భారతదేశం పార్టీ పెడతానంటూ దేశమంతా తిరిగి, చివరకి రాష్ట్రంలో అధికారం కోల్పోయారు. 1989లో దిల్లీలో ఎన్టీయార్ అధ్యక్షుడిగా ఉన్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పరచింది. రాష్ట్రంలో చూస్తే టిడిపి ఎంపీలు 31 నుంచి 2కు తగ్గారు. విపి సింగ్, దేవీలాల్, చంద్రశేఖర్ వంటి వాళ్లు ఎన్టీయార్‌కు జెల్ల కొట్టారు. ‘రెండు సీట్లు తెచ్చుకున్నవాడికి యిక్కడేం పని? వెళ్లి సొంతరాష్ట్రంలో పని చూసుకోమను.’ అని కొందరు ఫ్రంట్ నాయకులు ఎద్దేవా చేశారు.
ఉత్తరాదివాళ్లకు దక్షిణాది నాయకులంటే ఎప్పుడూ చులకనే. దాని నుంచి పాఠం నేర్చుకోకుండా చంద్రబాబు మళ్లీ యునైటెడ్ ఫ్రంట్ అంటూ 13 పార్టీల కూటమికి కన్వీనరయ్యారు. దాని ప్రాభవం తగ్గడంతో ఎన్డిఏ కూటమికి కన్వీనరు అయ్యారు. 2004 ఎన్నికల్లో తను ముందస్తు ఎన్నికలకు వెళ్లి, బిజెపి వాళ్లను కూడా అదే పని చేయమని ప్రోత్సహించారు. దెబ్బకి రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో ఎన్డిఏ మట్టి కరిచాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని చూస్తే రాష్ట్రంలో జాతకచక్రం తిరగబడుతుంది. ముఖ్యంగా కూటమి కన్వీనరు అనగానే భాగస్వాముల మధ్య అలకలు తీర్చడానికే టైమంతా పోతుంది. దిల్లీ చక్కర్లు పెరుగుతాయి. రాష్ట్రంలో పరిపాలన చూసుకోవడానికి టైముండదు.
పైగా పార్టీ అధ్యక్ష పదవి ఒకటి. అది వదులుకోబుద్ధి కాదు. ఎన్టీయార్‌ని గద్దె దించినప్పుడు బాబు ‘తాత్కాలిక అధ్యక్షుడిగా కేవలం ఆర్నెల్లుంటాను. తర్వాత యింకోళ్లకి అప్పగిస్తాను.’ అని మాటిచ్చి ఆ పదవి తీసుకున్నారు. 26 ఏళ్లయింది. ఒక్క క్షణం కూడా ఆ పదవి వదలలేదు. ఇటు రాష్ట్రప్రభుత్వం, పార్టీ బాధ్యతలు, యివి చాలనట్లు జాతీయ రాజకీయాలు.. ఒక్క మనిషికి యిన్ని సాధ్యమా? అందుకే 2004లో పదవి పోయింది. పదేళ్ల దాకా కుర్చీ ఎక్కే, అదీ సగం కుర్చీ ఎక్కే అవకాశం రాలేదు. అది వచ్చాకైనా తిన్నగా ఉన్నారా? 2019 ఎన్నికలకు కాస్త ముందు మళ్లీ చక్రం తిప్పే కార్యక్రమం అంటూ బయలుదేరారు. మమత, అరవింద్, రాహుల్ అంటూ దేశాటన కార్యక్రమాలు. కర్ణాటక కూడా వెళ్లి ప్రచారాలు.
ఇటు జగన్ ద్రవిడ పార్టీల తరహాలో రాష్ట్రం దాటి చూపు సారించలేదు (అధికారంలోకి వచ్చినా అదే తీరు). అతను టిడిపి పార్టీ పుట్టి ముంచి, పార్టీ చరిత్రలో ఘోరాతిఘోరమైన ఓటమికి గురి చేస్తున్నాడని బాబు కానుకోలేదు. బాబు అవస్థ చూసినా యింకో రెండేళ్లకు మమతా బెనర్జీ ఉబలాట పడింది. బెంగాల్ నెగ్గగానే తృణమూల్‌ను జాతీయ పార్టీ చేస్తానంటూ ఆయాస పడి, అంతలోనే చప్పబడింది. ఇప్పుడు కెసియార్‌కు దురద వేస్తోంది. డిఎంకె, ఎడిఎంకె తరహాలో ఉన్న స్థానాన్ని కన్సాలిడేట్ చేసుకోకుండా పైకి ఎగరబోతే కిందపడడం తథ్యం. ఈ విషయం చెప్పే ప్రశాంత కిశోర్ తప్పుకున్నాడని, తెరాసతో బంధాన్ని తెంపుకున్నాడని పేపర్లో వచ్చింది.
ట్రాంపోలిన్ ఉంటుంది. దానికి కింద కట్టిన తాళ్లు గట్టిగా ఉంటే పైకి జంప్ చేయవచ్చు. తాళ్లు సడలిపోయాయేమో చూసుకోకుండా ఎగిరితే ఏమవుతుంది? బేస్ గట్టిగా ఉందో, లేక ఊబిలా మారిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. జాతీయ స్థాయికి రాష్ట్రస్థాయి, పార్లమెంటు నియోజకవర్గం ఎలా బేస్యో, రాష్ట్రస్థాయికి అసెంబ్లీ నియోజకవర్గం బేస్. ప్రధాని పదవిలో ఇందిరా గాంధీ 1977లో రాయ్‌బరేలీలో రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. 2019లో కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడుగా ఉంటున్న రాహుల్ గాంధీ అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయాడు. 1967లో జాతీయ స్థాయిలో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఉంటున్న కామరాజ్ నాడార్ విరుద్దనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక విద్యార్థి నాయకుడి చేతిలో ఓడిపోయారు. ఇలా బయట పల్లకీల మోత అయినా యింట్లో యీగల మోత తప్పని నాయకులు చరిత్రలో చాలామంది కనబడతారు.
‘చంద్రబాబు నాన్-లోకల్, ఆయన కెంత సేపు అంతర్జాతీయ యిమేజి గురించి పాకులాటే తప్ప మీ గురించి ఏం చేశాడు?’ అనే వాదన కుప్పం ప్రజల్లో బలంగా వెళ్లిందంటే బాబుకి ఎదురీత తప్పదు. దీనికి తోడు యిప్పుడు వైసిపి కులం కార్డు బయటకు తీసింది. కుప్పంలో బిసిలు మెజారిటీ ఉన్నారు. 1983 నుంచి కమ్మలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పటికైనా మా పార్టీ తరఫున నిలబడే బిసికి ఒక్క ఛాన్సు యివ్వకూడదా? అని మొదలుపెట్టారు. 2019 నుంచి జగన్ కుప్పం మీద కన్ను వేసి, ఒక పథకం ప్రకారం వెళుతున్నాడన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో తమిళ, తెలుగు నటుడు విశాల్‌ను వైసిపి అభ్యర్థిగా నిలబెడతారనే పుకారు వచ్చింది. కానీ బిసి కార్డు వాడదామనే ఆలోచన రావడంతో రెడ్డి కులస్తుడైన విశాల్‌ను పక్కన పెట్టేసి ఉంటారు.
స్వస్థలాలలో ఓడిపోయిన నాయకుల జాబితా రాశాను కాబట్టి కుప్పంలో బాబుది కూడా అదే గతి అని నేననటం లేదు. మహా అయితే మెజారిటీ తగ్గవచ్చు తప్ప, నెగ్గుతాడనే యిప్పటికి అనుకుంటున్నాను. అయితే యీ హడావుడి వలన ఒకటి మాత్రం తథ్యం. బాబు కుప్పంలో ఎక్కువ రోజులు ఉండి ప్రచారం చేయవలసి వస్తుంది. అది చాలు వైసిపికి! పార్టీ అధ్యక్షులకు, ముఖ్యమంత్రులకు తను పోటీ చేసే నియోజకవర్గాన్ని ఒక్కదాన్నీ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. రాష్ట్రమంతా తిరగాలి. కానీ వాళ్ల ప్రత్యర్థికి ఆ బాధ లేదు. నియోజకవర్గం ఒక్కదాన్నే పట్టుకుని, గడపగడపకూ తిరుగుతూ ‘నేనిక్కడే ఉంటాను. ఆయనలా కాదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను.’ అంటూ చెప్పుకుంటాడు.
కాలేజీ ఎన్నికల రోజుల నుంచి చూస్తున్నాను. ఓటు వేసేటప్పుడు చాలామంది వాళ్లు మనల్ని వచ్చి అడిగారా లేదా అన్నది చూస్తారు, ఇద్దరూ అడిగితే ఎవరు ముందు వచ్చి అడిగారన్నది చూస్తారు. తమ ప్రత్యర్థిలా మనిషిమనిషినీ పలకరించడం ప్రముఖ నాయకుడికి వీలు కాదు. ర్యాలీ నిర్వహించి ఓపెన్ జీపులో చేతులూపుతూ వెళ్లిపోతాడు. తన తరఫున స్థానికంగా తన ప్రతినిథిని ఐదేళ్లూ ఉంచి, ఒక ఆఫీసు నడుపుతూ ఏడాదిలో మూడు, నాలుగు సార్లయినా వస్తే తప్ప స్థానికులతో డిస్కనెక్ట్ అయిపోతాడు. అందుకే ముఖ్యమంత్రి హోదాలో బయట వెలిగినా నియోజకవర్గంలో ఓటమి పాలవుతాడు. అది గ్రహించక బోల్తా పడినవాళ్లలో ఎన్టీయారూ ఉన్నారు. 1989లో కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక అనామకుడి చేతిలో ఓడిపోయారు. మరో చోట గెలిచారు కాబట్టి సరిపోయింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు. రెండు చోట్ల పోటీ చేశారు. ఒక్క చోటే గెలిచారు. ముఖ్యమంత్రి అయిపోతాడేమో అనుకున్నవాడు ఒక చోట ఓడిపోవడమేమిటి? పవన్ కళ్యాణ్‌కి ఆ సందిగ్ధం లేకపోయింది. రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ సిఎం, సిఎం అని నినాదాలిచ్చిన అభిమానులు రాష్ట్రమంతా పరుచుకుని పోయారు తప్ప ఆ రెండు నియోజకవర్గాల్లోనూ కాన్సట్రేట్ కాలేదు. అందుకే ఓటమి. మమతా బెనర్జీ పౌరుషానికి పోయి తన సొంత నియోజకవర్గం వదిలి నందిగ్రామ్‌లో పోటీ చేసింది. అక్కడ శుభేందు అధికారి ఆవిడకు దడ పుట్టించాడు. దాంతో ప్రచారంలో చివరి రోజులు అక్కడే క్యాంప్ వేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇవన్నీ తెలిసిన బాబు కుప్పం విషయంలో రిస్కు తీసుకోలేరు. మామూలుగా కొందరు నాయకులు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తూంటారు. బాబు ఎప్పుడూ అలా చేయలేదు. ఈరోజు చేస్తే వెంటనే ‘బాబుకి తనపై తనకే నమ్మకం పోయింది’ అనే సంకేతం టిడిపి క్యాడర్‌లోకి వెళ్లిపోతుంది. వాళ్లకే కాదు, కుప్పం వాళ్లకు కూడా.
బాబు అధికారంలోకి మళ్లీ వస్తారని తోస్తేనే కుప్పం వాళ్లు ఆయన వెంట నిలుస్తారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేమాటైతే కుప్పంలో బాబుని గెలిపించి జగన్ ఆగ్రహానికి గురి కావాలని అనుకోరు. కుప్పంలో తిష్ట వేసి బాగా కాంపెయిన్ చేసుకుని, యితర ప్రాంతాల్లో కూడా టిడిపి గెలిచి తను మళ్లీ సిఎం అవుతానన్న ధీమా కుప్పం వారికి కలిగిస్తేనే బాబు నెగ్గుతారు. కానీ యిక్కడే తిష్ట వేస్తే రాష్ట్రమంతా టిడిపి గతేమిటి? బాబు ప్రచారం లేకుండా మెజారిటీ నియోజకవర్గాల్లో నెగ్గగల సత్తా టిడిపి పార్టీకి ఉందా అన్న సందేహం కుప్పం వాళ్లకు వస్తే..? ఇది కాచ్-22 సిట్యుయేషన్. కుప్పం బయటకు వెళ్లకపోతే పార్టీ నెగ్గదు, వెళితే ఆయన నెగ్గడు.
ఈ సమస్యను అధిగమించాలంటే ఒకటే మార్గం ఉంది. బాబు రాష్ట్రమంతా తిరగకపోయినా, యితర ప్రచారకులు తిరిగి పార్టీని విజయపథంలో నడిపించాలి. బానే ఉంది, ఆ యితర ప్రచారకులు ఎవరు? నాకైతే తోచటం లేదు. అచ్చన్నాయుడు కొంతమేరకు చేస్తారు. కానీ ప్రముఖులైన వాళ్లకు టిక్కెట్లు యిస్తే తమ సొంత నియోజకవర్గం, మహా అయితే అటు రెండూ, యిటు రెండూ ఓ ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఊరుకుంటారు. బాబే కుప్పం నుంచి కదలటం లేదు, మనమెందుకు కదలాలి? అని అనుకుంటారు. పార్టీలో ప్రచారకులుగా బాబు ఎవర్నీ తయారు చేయలేదు. ఎక్కడికి వెళ్లినా ఆయనే వెళ్లారు. పాదయాత్రైనా, జీపు యాత్రైనా ఆయనే చేస్తారు. ఆ యాత్రల్లో కూడా యితరుల చేత మాట్లాడించి, వాళ్లకు ఖ్యాతి వచ్చేట్లు చేయరు. ఆయనే గంటల తరబడి మాట్లాడతారు.
అది కూడా ఆకర్షణీయంగా మాట్లాడరు. ఆయనకు వాగ్ధాటి లేదు. మధ్యమధ్యలో చతురోక్తులు విసరలేరు. (ఆ మాట కొస్తే యీనాటి ఆంధ్ర నాయకుల్లో ఎవరూ మంచి వక్తలు లేరు), ఎన్టీయార్ చైతన్యరథంపై వెళ్లేటప్పుడు రెండు, మూడు నిమిషాలకు మించి మాట్లాడేవారు కారు. గంటల తరబడి ప్రజలు నా గురించి వేచి ఉన్నారే, పావుగంటైనా మాట్లాడకపోతే ఎలా అని అనుకునేవారు కారు. ఆయన ఏం మాట్లాడతాడో ప్రజలకు ముందే తెలుసన్న విషయం ఆయనకీ తెలుసు. ఆ రెండు మాటలూ ఆయన నోట వస్తే అదో ఉత్సాహం ప్రజలకు. చంద్రబాబు ఏం మాట్లాడతారో తెలుగు ప్రజలందరికీ కంఠతా వచ్చు. సైబరాబాదు, హైదరాబాదు, బిల్ గేట్స్, ఐటీ విప్లవం, అమెరికాలో మనవాళ్లున్నారంటే అది నా ఘనతే, విజనరీ, ఒలింపిక్స్.. వగైరా, వగైరా! ఈ మధ్య అమరావతి చేరింది. ఆయన మధ్యలో ఊపిరి పీల్చుకోవడానికి ఆగితే, ప్రజలే యీ పాయింట్లు అందించగలరు. అలాటప్పుడు బాబు గంటల తరబడి మాట్లాడవలసిన పని ఉందా? దాని బదులు వేరేవాళ్ల చేత మాట్లాడించి, తను క్లుప్తంగా ముగిస్తే పోతుంది కదా!
కానీ వాళ్లెవరికీ తనంత వాక్చాతుర్యం లేదని బాబు అభిప్రాయం. తనయుడు లోకేశ్‌పై కూడా ఆయనకు పెద్దగా నమ్మకం లేనట్లుంది. లోకేశ్ పాదయాత్ర, సైకిల్ యాత్ర అని ఏడాది నుంచి వింటూనే ఉన్నాం. ఆయన యింకా గడప దాటలేదు. ఆయన వలన పార్టీకి మేలు జరగదని బాబుకి భయమంటారు. నిజానికి లోకేశ్ సన్నబడి స్మార్ట్‌గా కనబడుతున్నారు. ఉపన్యాసాల్లో తడబాటు బాగా తగ్గింది. ఓ నెల్లాళ్లు రోజంతా జనాల్లో మసలితే, వక్తృత్వం అదే పట్టుబడుతుంది. లోకేశ్ బాగా పుంజుకున్నా, తను పోటీ చేస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లా వరకే చూసుకోగలడు. రాష్ట్రమంతా తిరగమంటే మంగళగిరి అనుభవం దృష్ట్యా అతనికీ భయం వేస్తుంది.
అందువలన టిడిపి అర్జంటుగా ఓ పాతిక మంది ప్రచారకులను నియమించుకోవాలి. గ్లామరున్నవాళ్లుంటే సంతోషం. కనీసం మంచి వక్తలైనా కావాలి. వాళ్లకు తర్ఫీదు యిప్పించాలి. పార్టీ ఏ లైన్స్ మీద పోరాటం చేయబోతోందో ఎప్పటికప్పుడు బ్రీఫింగు యివ్వాలి. అందరూ ఒకే మాట చెప్పాలి. ఒక్కోరూ ఒక్కో ధోరణిలో మాట్లాడకూడదు. సినీతారలను నమ్ముకుంటే లాభం లేదు. వాళ్లు సభలకు జనాలు వచ్చేట్లా చేయగలరు కానీ వచ్చినవారిని ఎలా యింప్రెస్ చేయాలో వాళ్లకు తెలియదు. ఇంప్రెస్ చేసే పని యీ ప్రచారకులకు అప్పగించాలి.
ఎవరైనా యీ వ్యాసం చదివి బాబుగారితో యిలా చేద్దామా అంటే ఆయన నోరు చప్పరించి ‘ఎందుకూ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మన కూటమికి ప్రచారం చేస్తాడులే. లేదా బోయపాటి చేత నా ప్రసంగాల వీడియో చేయించి ఊరూరా వేద్దాం. కాకపోతే 2014లో మోదీ చేసినట్లు ప్రతీ ఊళ్లో నా లేజర్ షోలు ఏర్పాటు చేద్దాం, నేను ఒక చోట నుంచి మాట్లాడితే యావత్ ఆంధ్ర చూసేస్తుంది, వినేస్తుంది’ అనవచ్చు. మోదీ మంచి వక్త. ఈయన కాదు. పైగా వ్యక్తి మన సమక్షంలో ఉండి మాట్లాడితే ఉండే యింపాక్ట్ వేరు, వాళ్ల బొమ్మ మాట్లాడితే ఉండే యింపాక్ట్ వేరు. అందుకే సినీతారలను తెరపై వందలాది సార్లు చూసినా ప్రత్యక్షంగా చూడడానికి జనం ఎగబడతారు. ఇక పవన్ ఉన్నా అతని ఫ్యాన్స్ గోలలో పక్కవాళ్లు కనుమరుగై పోతారు. పవన్‌ను చూడడానికి జనం బాగానే వస్తారు కానీ వచ్చినవాళ్లకు తన భావాలను ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆయనకు తెలియదు.
ఎలా చూసినా టిడిపి ముందే మేల్కొని రాష్ట్రమంతా తిరగగల ప్రచారకులను ఏర్పాటు చేసుకోవాలని నాకు పదేపదే అనిపిస్తోంది. బాబు ఏమనుకుంటున్నారో మరి!
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)