కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి థరూర్‌కు ఆ పార్టీ తెలంగాణ నాయకులు మొహం చాటేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నిక బరిలో శశి థరూర్, మల్లిఖార్జున్ ఖర్గే నిలిచిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే వైపు మొగ్గు చూపుతున్నారు. అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ప్రయత్నించినప్పటికీ, శశి థరూర్ అంగీకరించలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం శశి థరూర్ చెప్పాపెట్టకుండా హైదరాబాద్‌లో దిగారు. ప్రచారంలో భాగంగా కలవాలని అనుకుంటున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి శశి థరూర్ ఫోన్ చేశారు. అయితే సమీప బంధువు చనిపోయారని, ప్రస్తుతం తాను కలవలేనని రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి రేవంత్‌ను కలుస్తానని శశి ట్విటర్‌లో పేర్కొన్నారు.
మల్లిఖార్జునఖర్గే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యినట్టే అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కర్నాటకకు చెందిన ఖర్గే దళిత నాయకుడు. ఆయన ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కలిసొస్తుందనే చర్చ నడుస్తోంది.
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా కూడా ఖర్గే సేవలందించారు. ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కావడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో శశి థరూర్‌ను కలిసేందుకు ఆ పార్టీ నేతలు విముఖత చూపుతున్నారు.