బ్రాడీ, క్యారీ యిద్దరూ కలిసి క్యారీ కాబిన్ దగ్గరకు వచ్చారు. గతంలో ఒకరిని మరొకరు అనుమానిస్తూ వచ్చివున్నారు. ఇప్పుడు అలాటి అపోహలు ఏమీ లేకపోవడంతో, పైగా బ్రాడీ తన కుటుంబాన్ని వదిలి వచ్చేయడంతో యిద్దరూ ఎంతో సంతోషంగా గడిపారు. క్యారీ తుపాకీలో గుళ్లు కూడా తీసిపారేసింది. అయితే వాళ్లకు తెలియదు – పీటర్ వాళ్లని వెంటాడుతూ అక్కడిదాకా వచ్చాడనీ, అదను చూసి బ్రాడీని చంపడానికి రైఫిల్ దగ్గరే పెట్టుకున్నాడనీ, బ్రాడీ ఒంటరిగా దొరికిన మరుక్షణం చంపేస్తానని డేవిడ్‌కు మాట యిచ్చాడనీ!
క్యారీ తన ఒంటరి జీవితం గురించి, తలిదండ్రుల గురించి చెప్పింది. ‘మా నాన్నకు ఉన్న బైపోలార్ డిసీజ్‌తో విసిగిపోయి మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. చిన్నపుడు ఆమెపై కోపం వుండేది కానీ, యిప్పుడు అర్థం చేసుకున్నాను. నేను ఆమెను తప్పు పట్టను. నాకు మా నాన్న నుంచి వారసత్వంగా ఆ రోగం వచ్చింది. నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వారూ నన్ను విడిచి వెళ్లిపోవచ్చు. అందుకనే పెళ్లి చేసుకోలేదు.’ అని చెప్పింది.
బ్రాడీ ‘నీ వ్యాధి గురించి నాకే భయం లేదు. మనం మన పెళ్లి విషయం గురించి సీరియస్‌గా ఆలోచిద్దాం. సిఐఏతో నా ఒప్పందం నేను నెరవేర్చాను. ఇక నన్ను వదిలేస్తే నాది యిక క్లీన్ స్లేటే. నీ సంగతేమిటి?’ అన్నాడు. ‘నువ్వు టెర్రరిస్టు ముద్ర నుంచి బయటపడితే చాలు, నేను ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి నీతో సెటిలయిపోతాను. నీ గురించి సిఐఏలో సాల్‌తో మాట్లాడతాను.’ అంది. కానీ ఆమెకు తెలియదు, హెడాఫీసులో ఓ గదిలో బంధింపబడి వున్న సాల్ ఆమె సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. కాపలా కాస్తున్న గార్డుతో ‘కాస్త క్యారీకి ఫోన్ చేయి’ అన్నాడు. ‘చేస్తే మీ గతే నాకు పడుతుంది.’ అన్నాడు గార్డు.
రాత్రి బ్రాడీతో హాయిగా గడిపాక పొద్దున్నే క్యారీ దగ్గర్లో వున్న మార్కెట్‌కు కేక్ కొనడానికి వెళ్లింది. బ్రాడీ నిద్రలేచి క్యారీ లేదని గమనించి, దగ్గర్లో వున్న చెరువు గట్టు దగ్గరకు వెళ్లి, కాళ్లూ చేతులూ కడుక్కుని నమాజ్ చేయసాగాడు. రాత్రంతా సరైన అదను గురించి చూస్తూన్న పీటర్ బ్రాడీ వెనుకనే చెరువు దగ్గరకు వెళ్లి దూరంగా చెట్ల చాటు నుంచి తుపాకీ గురిపెట్టాడు. ఎప్పుడైతే అతను ప్రార్థన మొదలుపెట్టాడో అప్పుడు పీటర్‌కు ‘ఇతను మంచి వ్యక్తి, చంపకూడదు’ అనిపించింది. తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
డేవిడ్ ఆఫీసు పని ముగించుకుని రాత్రి తన యిల్లు చేరి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లైటు వేసేసరికి అక్కడ పీటర్ తుపాకీ పట్టుకుని కూర్చున్నాడు. డేవిడ్ ఉలిక్కిపడ్డాడు. ‘బ్రాడీని చంపావా?’ అని అడిగాడు. ‘లేదు, చంపను. నిన్ను చంపనివ్వను కూడా. అతను మంచివాడు. అతన్ని చంపితే క్యారీ మనసు బాధపడుతుంది. నాకు తెలిసి అంత మంచి గూఢచారిణి దేశంలోనే లేదు.’ అన్నాడు పీటర్.
‘చంపడం చేతకాక ఏవో కబుర్లు చెపుతున్నావ్’ అన్నాడు డేవిడ్. ఈసారి పీటర్ కోపంగా ‘చంపడం నాకు ఓ లెక్క కాదు, కానీ నేను చెడ్డవాళ్లనే చంపుతాను. మంచివాళ్ల జోలికి వెళ్లను. నువ్వు వేరేవాళ్ల చేత బ్రాడీని చంపిస్తే, చూశావుగా యిలా నీ యింట్లోకి చొరబడి నిన్ను లేపేస్తాను. జాగ్రత్త.’ అని చెప్పి పీటర్ వెళ్లిపోయాడు.
ఎంతో సెక్యూరిటీ వున్న తన యింట్లోకి తుపాకీతో చొరబడిన పీటర్ సామర్థ్యం, సాహసం, పట్టుదల చూసి డేవిడ్ భయపడ్డాడు. బ్రాడీ జోలికి వెళితే అన్నంత పనీ చేస్తాడని తోచింది. మర్నాడు ఆఫీసుకి వెళ్లగానే సాల్‌ను విడుదల చేసి రాజీ పడదామని చెప్పాడు. తాజాగా చేయించిన పాలీగ్రాఫ్ టెస్ట్‌ను బుట్టదాఖలు చేస్తానన్నాడు. బ్రాడీ జోలికి వెళ్లనని మాట యిచ్చాడు. సాల్ తన యిక తన పనులు చురుగ్గా చేసుకోసాగాడు.
క్యారీ, బ్రాడీ కాబిన్ నుంచి తిరిగి వచ్చేశారు. ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకుని, క్రమేపీ పెళ్లి దిశగా అడుగులు వేద్దామనుకున్నారు. బ్రాడీ మైక్‌ను ఒక బార్‌లో కలిసి, తనూ జెసికా విడిపోతున్నామనీ, తన స్థానంలో అతను రావాలని కోరుకుంటున్నాననీ చెప్పాడు. మైక్ తలూపాడు. ఇటు క్యారీ ఆఫీసుకి రాగానే ‘నజీర్‌ను పట్టుకున్నావు కాబట్టి నీకు ప్రమోషన్ యిస్తారు. స్టేషన్ చీఫ్ అవుతావు, ఒప్పుకో, కానీ యికనైనా బ్రాడీ వంటి టెర్రరిస్టుతో సంబంధం వదులుకో.’ అన్నాడు.
కానీ క్యారీ ‘బ్రాడీకి సిఐఏ నుంచి విముక్తి రాగానే ఉద్యోగం మానేసి, తనను పెళ్లాడాలనుకుంటున్నా’ అని చెప్పింది. సాల్‌కి అది నచ్చలేదు. నీలాటి సమర్థవంతురాలు ఏజన్సీ వదిలేస్తే ఎలా? అని మందలించాడు. ‘ఏజన్సీ గురించి సర్వమూ త్యాగం చేయడం వలననే నీ వైవాహిక జీవితం భగ్నమైంది. నేనా పొరబాటు చేయదలచుకోలేదు. నా స్వభావం, నా లోపాలు అన్నీ తెలిసి, అతను నాతో అడుగులు వేద్దామనుకుంటున్నాడు. నేను ఆ అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. ఏజన్సీలో నేను కాకపోతే మరొకరు వస్తారు’ అంది క్యారీ.
సిఐఏ హెడ్‌క్వార్టర్స్ లాంగ్లీలో వాల్డెన్ స్మారకసభ ఏర్పరచారు. దానికి వాల్డెన్ భార్య, కొడుకు, బ్రాడీలను పిలిచారు. సాల్ మాత్రం హాజరు కాలేనన్నాడు. నజీర్ మృతదేహాన్ని ఎయిర్‌ఫోర్స్ వారి విమానంలో తీసుకెళ్లి సముద్రంలో గుర్తు తెలియని చోట ఖననం చేస్తున్నారు. దగ్గరుండి అంత్యక్రియలు పర్యవేక్షించే పని అతనికి అప్పగించారు.
బ్రాడీ స్మారక కార్యక్రమానికి బయలుదేరాడు. సూటు వేసుకుని వెళ్లాలి. ఇంట్లోనే వుంది. దాని కోసం యింటికి వెళ్లాల్సి వచ్చింది. బెడ్‌రూమ్‌లోకి వచ్చి సూటు వేసుకుంటూ వుంటే డానా వచ్చి పలకరించింది. డ్రస్ వేసుకుంటూనే ఆమెతో మాట్లాడాడు. ‘అవేళ, ఎలిజబెత్ చనిపోయిన రోజు యిలాగే డ్రస్ చేసుకుంటూన్నపుడు నన్ను గది బయటే పెట్టి మాట్లాడావు. ఇవాళ లోపలకి రానిచ్చావ్. ఆ రోజు నువ్వు వింతగా ప్రవర్తించావని గ్రహించావా?’ అని అడిగింది డానా. బ్రాడీ ‘‘అవేళ ఏదో తిక్కగా వుండి ఏదో చేయబోయాను. నేను మారాను. మళ్లీ అలాటిది ఎన్నడూ చేయను.’’ అని హామీ యిచ్చాడు.
తన ఉపన్యాసంలో డేవిడ్ వాల్డెన్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. సభలో దూరదూరంగానే కూర్చుని ఉన్న క్యారీ, బ్రాడీ ఒకరిని చూసి మరొకరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇతరుల ఉపన్యాసాలు జరుగుతూండగా యిద్దరూ చల్లగా బయటకు జారుకుని, పై అంతస్తులోని సాల్ ఆఫీసు గదిలోకి చేరారు. నేను ఉద్యోగం మానేసి నిన్ను పెళ్లాడడానికి నిశ్చయించుకున్నా అని క్యారీ చెప్పింది. బ్రాడీ సంతోషించాడు. ఓ అద్దాల కిటికీ సమీపంలో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ వుండగా, బ్రాడీ దృష్టి కింద పార్కింగ్‌లో వున్న తన కారుపై పడింది. ‘నా కారు ఎవరు కదిపారు? పట్టుకుని వచ్చి మీటింగు అవుతున్న బిల్డింగు ఎదురుగా పెట్టారేమిటి?’ అని ఆశ్చర్యపడ్డాడు.
ఇంతలోనే పెద్ద శబ్దంతో బాంబులు పేలాయి. కారులోంచి ఒక అగ్నిగోళం వెలువడి తాకడంతో ఆ భవనమంతా గడగడలాడింది. పొగ దట్టంగా అలముకుంది. మంటలు వ్యాపించాయి. ఏకంగా సిఐఏ హెడ్‌క్వార్టర్స్ మీదనే టెర్రరిస్టులు ఎటాక్ చేశారని క్యారీకి అర్థమైంది. వెంటనే బ్రాడీపై అనుమానం పోయింది. అతను స్పృహతప్పి వున్నాడు. అయినా జేబులోంచి రివాల్వర్ తీసి, అతనికి గురిపెట్టి లేపింది. ‘చెప్పు, యిది నీ పనేనా? అందుకనేనా నాకు సైగ చేసి పైకి తీసుకుని వచ్చావ్?’ అని అడిగింది.
బ్రాడీ బిత్తరపోయాడు. ‘నాకేమీ తెలియదు. నజీర్ మరణానికి ప్రతీకారంగా అతని అనుచరులు దీన్ని చేసి వుండవచ్చు. నా కస్సలు సమాచారం లేదు. నాకు తెలియకుండా నా కారులో వాళ్లు ఏదో పెట్టారేమో, నన్ను నమ్ము. అలాటి హీనకృత్యం చేసే బదులు నన్ను నేను చంపుకుంటాను.’ అని చెప్పసాగాడు. క్యారీ ఓ పట్టాన నమ్మలేక పోయింది. ‘పోయిపోయి నీలాటి వాడికోసం అన్నీ త్యాగం చేద్దామనుకున్నాను చూడు, నేనెంత మూర్ఖురాలిని.’ అని ఏడ్చింది.
కాస్సేపటికి బ్రాడీ అమాయకుడని ఆమెకు నమ్మకం కుదిరింది. అతని కారుని ఉపయోగించుకుని టెర్రరిస్టులు యీ ఘాతుకం చేశారంటే, అతన్ని యిరికిద్దామని చూస్తున్నారని అర్థమైంది. అతని ప్రమేయం లేదంటే సిఐఏలో ఎవరూ నమ్మరని కూడా ఆమెకు తెలుసు. అందుకని తామిద్దరూ ఎవరి కంటా పడకుండా బయటపడాలని, ఏదైనా సురక్షిత ప్రదేశానికి పారిపోవాలని అర్థం చేసుకుంది. అతన్ని తీసుకుని దొడ్డిదారిన కిందకు దిగి, కారులో ఎక్కించుకుని బయలుదేరింది. ఈ దారుణకాండతో కలకలం రేగడం వలన ఎవరూ వీళ్ల గురించి పట్టించుకోలేదు.
కారులో బ్రాడీని తీసుకుని ఒక చోటకి తీసుకెళ్లింది. ‘ఆపత్సమయాల్లో అవసరాలకై డబ్బు దాచుకోవాలని మా అమ్మ చెప్పేది. ఇక్కడ దాచుకున్నా.’ అంటూ ఆ లాకర్‌లో దాచిన డబ్బు, తన పేర తయారు చేయించుకున్న దొంగ పాస్‌పోర్టులు బయటకు తీసింది. మధ్యలో ఒకతని దగ్గర ఆగి బ్రాడీకి దొంగ పాస్‌పోర్టు తయారు చేయించింది. తన సెల్ ఆఫ్ చేసింది. బ్రాడీని కూడా ఆఫ్ చేయమంది. కుటుంబానికి కాల్ చేయవద్దంది.
కెనడా సరిహద్దు దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి, అక్కణ్నుంచి అరణ్యం లోంచి నడుచుకుంటూ వెళ్లి, మాంట్రియల్‌లో దూరదామని అనుకున్నారు. మధ్యదారిలోనే టీవీ వార్తల ద్వారా విషయాలు తెలిశాయి. ఆ దాడిలో మొత్తం 200 మంది చనిపోయారు. 27 గురు మాత్రమే బతికారు. పోయినవారిలో వాల్డెన్ భార్య, కొడుకు, డేవిడ్ కూడా వున్నారు. ఈ దాడికి కారణం నేనే అంటూ బ్రాడీ చెప్తున్న వీడియోను అల్ ఖైదా విడుదల చేసింది. గతంలో ఆత్మాహుతి ప్రయత్నానికి ముందు అతను చేసిన వీడియోను ఎడిట్ చేసి యిప్పుడు విడుదల చేశారన్నమాట.
‘నేను ఎందుకిలా చేశానని మీరనుకోవచ్చు. వాల్డెన్ పరమ దుర్మార్గుడు, డ్రోన్ ఎటాక్ చేశాడు’ అంటూ సాగిన ఆ వీడియోను యిప్పుడిలా వాడుకున్నారు. అందుకే అతని కారులో బాంబులు పెట్టారు. ఈ దాడిలో బ్రాడీ ఆత్మాహుతి చేసుకుని చచ్చిపోయాడని అందరూ అనుకున్నేట్లా అది పనికి వచ్చింది. సరిగ్గా వాల్డెన్ స్మారకసభకే దాని టైమింగ్ సెట్ చేశారు. అది చూసిన అమెరికా ప్రజలందరూ బ్రాడీని అసహ్యించుకుంటున్నారు. దేశద్రోహి, టెర్రరిస్టు అనుకుంటున్నారు.
ఇది చూడగానే క్యారీ ఆలోచన మారింది. ఈ ఘటనకు కారకులెవరో కనిపెట్టి బయటపెట్టాలి, బ్రాడీ అమాయకుడని రుజువు చేయగలగాలి. అప్పుడే గూఢచారిణి వృత్తిని వదిలేసి, అతన్ని పెళ్లాడి, పిల్లల్ని కని, గృహిణిగా స్థిరపడాలని కన్న కలలు నెరవేరుతాయి. అది జరగాలంటే తను సిఐఏలో కొనసాగాలి. గూఢచారిణిగా తన నైపుణ్యమంతా ఉపయోగించి, టెర్రరిస్టులను పట్టుకుని యీ దాడి చేశామని ఒప్పించాలి. ఇది ఎన్నాళ్లు పడుతుందో తెలియదు. కానీ తను అతనితో కెనడా వెళ్లి ఎక్కడో రహస్యంగా తలదాచుకుంటే లాభం లేదు. పైగా బ్రాడీ పట్ల తనకున్న ప్రేమ తెలిసిన సిఐఏ తననూ వెంటాడుతుంది.
ఈ పరిస్థితుల్లో తను సిఐఏకు వెనక్కి వెళ్లి తీరాలి. తను యిలా వచ్చేసి వెనక్కి వెళ్లేందుకు 7 గంటలు పడుతుంది. తను కనబడకపోయేసరికి ఆఫీసువాళ్లు మొదట చచ్చిపోయిందని అనుకుని వుంటారు. శవాల్లో కనబడకపోయేసరికి ఎక్కడకు పోయిందో అనుకుంటారు. తన ఆబ్సెన్స్‌కు కారణాన్ని వాళ్లు నమ్మేట్లు చెప్పగలగాలి. స్పృహ తప్పి ఓ మూల పడివున్నానని చెపితే నమ్ముతారా? సిసిటివిల ద్వారా తన కారు ఊరు బయటకి వెళ్లిందని కనిపెడతారా? వాళ్లు తన మాట నమ్మకపోతే బ్రాడీతో చేతులు కలిపిందని అనుకునే ప్రమాదం వుంది.
ఏదోలా వాళ్లను కన్విన్స్ చేయలేకపోతే ఉద్యోగం నిలవదు. ఉద్యోగం లేకపోతే బ్రాడీని నిర్దోషిగా నిరూపించలేదు. ఈలోగా బ్రాడీని టెర్రరిస్టులు వెంటాడి చంపకూడదు. జీవితంలో మళ్లీ అతన్ని మళ్లీ కలుస్తుందో లేదో తెలియదు. అయినా అతనిపై అంతులేని ప్రేమతో తను ఏళ్ల తరబడి దాచుకున్న డబ్బంతా అతనికి యిచ్చేసి అతన్ని ఒంటరిగా అడవులలో నడిచి వెళ్లిపోమంది. సెల్బీ లేక్ దగ్గర జూన్ అనే తన ఫ్రెండుకు కాబిన్ వుందని, అందులో తలదాచుకోమని చెప్పింది. పరిస్థితులు మెరుగుపడ్డాక మళ్లీ కలుద్దామంది.
భవిష్యత్తు అగమ్యగోచరంగా వుందనే భావం ముప్పిరికొంటూండగా క్యారీ బ్రాడీని గాఢంగా హత్తుకుని ముద్దాడింది. బ్రాడీకీ తన బతుకు యిక ముందెలా సాగుతుందో తెలియటం లేదు. దాడి జరిగాక సిఐఏ, ఎఫ్‌బిఐ సిబ్బంది తన యింటికి వెళ్లి వెతికితే బాంబులతో నిండిన జాకెట్ దొరికిందంటే తన గురించి దేశప్రజలందరికీ టెర్రరిస్టనే అభిప్రాయమే కలుగుతుంది. తాను చేయని యీ నేరం తన నెత్తి మీద పడింది.
తన కుటుంబంపై దేశద్రోహి కుటుంబమనే మచ్చ పడింది. వాళ్లు ఎలా తట్టుకుంటారో తెలియదు. భార్యాబిడ్డలు తనను ఎంత తిట్టుకుంటారో తెలియదు. అసలే సెన్సిటివ్ అయినా డానా ఏ ఆత్మహత్యా ప్రయత్నమో చేయదు కదా! దేశద్రోహి భార్య అన్న ముద్ర పడిన జెసికాను మైక్ పెళ్లాడతాడా? ఇలాటి ముద్రతో ఆమెకు ఉద్యోగం దొరుకుతుందా? పిల్లలకు అన్నం పెట్టగలదా?
కావాలంటే అల్‌ఖైదా నజీర్ చావుతో మా సంస్థ నిర్జీవం కాలేదని సిఐఏ ఆఫీసుపై దాడి ద్వారా అమెరికాను హెచ్చరించి ఊరుకోవచ్చు. కానీ మధ్యలో తనను యిరికించి, తనే చేశానని చూపడం దేనికి? నజీర్‌ను పట్టివ్వడానికి తను సాయపడ్డానని తెలిసి తనపై కోపంతోనే ఆ వీడియోను యిలా వాడుకుంది. మరి అలాటిది తను సజీవంగా వుందని తెలిస్తే ఊరుకుంటుందా? భార్యాబిడ్డల్ని వదిలేసి క్యారీతో స్థిరపడదామని చూస్తే యిలా జరిగిందేమిటి? తన కోసం డబ్బంతా యిచ్చేసి, ఉద్యోగాన్ని రిస్కు చేసి, నింద మోయడానికి, కేసు పెడితే శిక్ష వేయించుకోవడానికి సిద్ధపడుతున్న క్యారీ ఋణాన్ని తీర్చుకోవడం ఎలా? ఇలాటి ఆలోచనలతో బ్రాడీ ఆమె నుండి వీడ్కోలు తీసుకున్నాడు.
ఇదీ క్యారీ అనే గూఢచారిణి ప్రేమ ప్రస్తుతానికి ముగిసిన ఘట్టం. దీనితో రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఈ ఘటన తర్వాత 7 గంటల గైరుహాజరీపై క్యారీపై విచారణ జరుగుతుందా? డేవిడ్ చనిపోయాడు కాబట్టి సాల్ అతని స్థానంలో డైరక్టరు అవుతాడా? దాడి చేసినదెవరో సిఐఏ కనిపెట్టగలుగుతుందా? బ్రాడీ కుటుంబం గతి ఏమవుతుంది? – యిలాటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే తర్వాతి సీజన్లు చూడాలి. నేను యీ సీరియల్ యింతటితో ఆపుతున్నాను కాబట్టి ఆసక్తి వున్నవాళ్లు హాట్‌స్టార్‌లో చూడవచ్చు.
ఒక విషయం చెప్పాలి – ఈ సీరియల్‌కు నేనాశించినంత మంది నుంచి రెస్పాన్సు రాలేదు. సబ్జక్టు క్లిష్టమైంది. నేను అవసరమైనంత సరళంగా చెప్పి వుండకపోవచ్చు. అధికాంశం పాఠకులు బుర్రను దీనిపై ఖర్చు పెట్టడం యిష్టపడక పోయి వుండవచ్చు. గతంలో యూరోప్ గాథలు మధ్యలో ఆపేసినప్పుడూ నేను ఖేదపడ్డాను. ఇప్పుడూనూ..! అయినా తెలుగు పాఠకులకు వెరైటీ రుచి చూపించాలనే నా తపన ఎప్పటికీ పోదు. నార్స్ పురాణగాథలు ‘థార్’ సినిమాల ద్వారా కొందరికి తెలుసు. వాటిని చెప్పడానికి చూస్తాను. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల గురించి వాటిపై తీసిన సినిమాల ద్వారా చెప్పాలని కూడా వుంది. ప్రయత్నం చేస్తూంటాను. కొనసాగింపు మీ రెస్పాన్స్‌పై ఆధారపడి వుంటుంది. (సమాప్తం) (ఫోటో – ప్రేమికుల వీడ్కోలు ఘట్టం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2020)
[email protected]