ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనం ఒక్కసారిగా ఇళ్లలో నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. బతుకు జీవుడా అని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రోడ్డుమీద పడ్డారు. కాళ్ల కింద భూమి కంపించడమే ఒంగోలు ప్రజానీకం భయానికి ప్రధాన కారణం.
ఈ వేళ ఉదయం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఉదయం 6.55 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. అలాగే కర్నాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4గా నమోదైంది. ఈ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉదయం 10.15 గంటలకు ఒంగోలులోని శర్మ కళాశాల, అంబేద్కర్ భవన్, ఎన్జీవో కాలనీ, సుందరయ్య భవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు వెల్లడించారు. మొత్తానికి కరోనా వైరస్‌తో ఇప్పటికే అల్లాడిపోతున్న జనానికి మరో విపత్తు కూడా భయపెట్టడం గమనార్హం.