నిరుపేదల ఆకలి తీర్చడానికి అందుబాటు ధరలో అన్నం పెట్టే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు. వీటివలన కీర్తి చంద్రబాబునాయుడుకు దక్కుతుందేమో అని ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ ఆలోచన చంద్రబాబునాయుడు సొంతది కాదు.. ఆయన కేవలం కాపీ కొట్టారంతే.
జనాకర్షణ కోసమే ఈ అయిడియా ఇంప్లిమెంట్ చేసినప్పటికీ.. వాస్తవంలో ఇది నిరుపేదలకు, పూటకూటికి కూడా వెతుకులాడుతూ ఉండే దారిద్ర్యంతో బాధపడేవారికి, అలమటించే వారికి, రోజు కూలీలకు అందరికీ ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహంలేదు. ఇవి ఇప్పుడు మూత పడ్డాయి. సెప్టెంబరులో కొత్త విధానం తీసుకువస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు.
రెండురోజుల్లోనే మంత్రి బొత్స మరో బ్రహ్మాండమైన అయిడియాను ప్రకటించేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు భవనాల అవసరం లేదుట. వాటి స్థానంలో మొబైల్ క్యాంటీన్లను ప్రారంభిస్తారుట. రద్దీ ఎక్కడుంటే అక్కడే అన్న క్యాంటీన్లను నిర్వహించేలాగా.. మొబైల్ వాహనాలలో వీటిని నిర్వహిస్తారట. మూసేసిన రెండురోజుల్లోనే మంత్రిగారికి ఇంత భ్రష్ట అయిడియా రావడం గొప్ప విషయమే.
అన్ని క్యాంటీన్లకు భవనాల నిర్మాణంలో అవినీతి జరిగిందని భావిస్తుంటే గనుక.. వాటి మీద కూడా విచారణ చేయడం బాగుంటుంది. అంతేతప్ప.. ఆ భవనాలను మొత్తం పక్కన పెట్టేసేలా.. ఇలాంటి మొబైల్ అయిడియాలు ఏమిటో అర్థం కావడంలేదు. కడుపు కూటికి గతిలేని సామాన్యుడికి మధ్యాహ్నం అయ్యేసరికి పలానాచోట అయిదురూపాయలకే అన్నం దొరుకుతుందనే నమ్మకంటే ఉంటే.. ఏదో ఒక రీతిగా అక్కడకు చేరుకుని కడుపు నింపుకుంటాడు.
ఇప్పడు బొత్స చెప్పే ప్రకారం ఉన్న క్యాంటీన్లను చెదలు పట్టించేసి.. కొత్తగా ఎవరికైనా వాహనాల కాంట్రాక్టులు అప్పజెప్పి.. మొబైల్ క్యాంటీన్లను ప్రారంభిస్తే… ఆకలితో మాడే పేదవాడు.. ఆ మొబైల్ క్యాంటీన్ ఆకలి వేసిన సమయానికి ఊర్లో ఎక్కడున్నదో వెతుక్కుంటూ తిరుగుతూ ఉండాలన్నమాట. ఇంత అపభ్రంశపు అయిడియాలో బొత్స సత్యనారాయణ గారికి ఎలా వస్తున్నాయో గానీ.. ప్రభుత్వం పరువు తీసేలా ఉంటున్నాయి.