మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నట్లుండి అమెరికా వెళ్లి, అక్కడి ప్రఖ్యాత ఆసుపత్రిలో రెండు రోజులపాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వచ్చారు. ఆయన వయస్సుకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వింతా కాదు, విడ్డూరమూ కాదు. అయితే కొన్ని నెలల క్రితమే చంద్రబాబు హైదరాబాద్ లో పూర్తిగా అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఆయన రెగ్యులర్ గా చేయించుకునే పరీక్షలే అని, అందుకే చేయించుకున్నారని అప్పట్లో వివరణలు కూడా వినిపించాయి.
మరి ఉన్నట్లుండి ఇలా ముందస్తు ప్లానింగ్ లేకుండా అమెరికా వెళ్లి పరిక్షలు చేయించుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. చంద్రబాబు వెళ్లిన ఆసుపత్రి చాలా ప్రముఖమైనది, ఈ ఆసుపత్రిలోనే తెలుగు సినిమా రంగానికి చెందిన ఓ ప్రముఖ నటుడు కూడా కిడ్నీ చికిత్స ఇటీవల చేయించుకున్నాడని తెలుస్తోంది. అయితే చంద్రబాబు, ఉల్లాసంగా, హుషారుగా వున్నారు. అమెరికా వీధుల్లో చలాకీగా తిరిగారు. అందువల్ల ఆయన ఆరోగ్యానికి వచ్చిన భయం, ఆందోళన ఏమీలేదు అనే అనుకోవాలి.