కొన్నాళ్ల క్రితం నైజాంలో సినిమాల కొనుగోలు తగ్గిపోయింది. కేవలం దిల్ రాజు, ఏషియన్ సునీల్ మాత్రమే కీలక బయ్యర్లుగా మిగలడంతో, ఒక స్టేజ్ లో ఆ ఇద్దరూ డిస్ట్రిబ్యూషన్ తప్ప కొనుగోళ్లు చేయమని అనడంతో టాలీవుడ్ లో కాస్త ఇబ్బందికర పరస్థితి ఏర్పడింది. మినిమమ్ గ్యారంటీ అమౌంట్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ కు తీసుకోవడం లేదా, కావాల్సినంత అమౌంట్ రికవరీ ప్రాతిపదికన ఇచ్చి పంపిణీ చేయడం తప్ప, నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ లు అన్నవి లేకుండాపోయాయి.
ఇలాంటి నేపథ్యంలో తప్పని సరై సినిమాలు వారికే ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈయన లేకుంటే ఆయన, ఈ ఇద్దరు కాకుంటే సురేష్ బాబు. ఇలాంటి నేపథ్యంలో చిన్న బయ్యర్లు బయటకు రావడం, వాళ్లు తీసుకున్న సినిమాలు హిట్ కావడంతో మార్కెట్ చేజారుతోందని గమనించి, మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాను దిల్ రాజు కొనకుండా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నారు. పూరికి చార్మికి అదే చెప్పారు. మిగిలిన ఏరియాలు అమ్మేయండి. ఇది డిస్ట్రిబ్యూట్ చేసుకోండి మీకు మంచి డబ్బులు వస్తాయి అని. ఒక విధంగా ఆయన చెప్పిందే ఇప్పుడు నిజమయ్యేది వుంచుకుని వుంటే. కానీ వారి అవసరాల వల్ల అమ్మేసారు. చిన్నబయ్యర్ కొని ఇప్పుడు మాంచి లాభాలు సంపాదించారు.
అలాగే మరికొన్ని సినిమాలు కూడా అటు ఆసియన్ సునీల్ చేజార్చుకున్నారు. నేరుగా డియర్ కామ్రేడ్ కొనకుండా, కోటిన్నర ఎక్కువ వేసి మారు బేరానికి కొన్నారు. ఇప్పుడు ఆ ఎక్కువ ఇచ్చిందే లాస్ గా కనిపిస్తోంది. లీడ్ బయ్యర్లు సినిమాలు వదిలితే చిన్న బయ్యర్లు రంగంలోకి వస్తున్నారు. అందుకే మళ్లీ పంపిణీ అనే జపం చేయకుండా కొనే దిశగా ఆలోచిస్తున్నారు.
ఆసియన్ సునీల్ బ్యాకెండ్ లో వుండి కొన్ని సినిమాలు కొనిపిస్తున్నారని బోగట్టా. దిల్ రాజు కూడా గ్యాంగ్ లీడర్ సినిమాను ఎనిమిది కోట్లకు పైగా మొత్తానికి నైజాం ఏరియా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏ సినిమా వెనుక ఏముందో? ఏ సినిమాను జనం నెత్తిన పెట్టుకుంటారో?
అందుకే కాస్త బాగుంటాయి అనుకున్నవి, రీజనబుల్ రేట్లకు కొనే ఆలోచనలో వున్నారు నైజాం లీడ్ బయ్యర్లు. లేదూ అంటే ఎవరో ఒకరికి అమ్మే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. వీళ్లనే నమ్ముకుని పంపిణీకి వదిలేయడం లేదు.