అర్థం పర్థం లేని మాటలతో రాష్ట్రప్రభుత్వం మీద విరుచుకుపడిపోవడంలో సోము వీర్రాజు అందె వేసిన చేయి. హిందూత్వ ఎజెండాను భుజాన మోయడమూ.. విద్వేషపూరిత మాటలు ప్రజల్లోకి వదిలిపెట్టడమూ.. బిజెపి ఈ రాష్ట్రానికి చాలా చాలా ఒరగబెట్టేసిందనే అబద్ధాలను ప్రచారం చేయడమూ తప్ప.. ఆయన ఉద్ధరిస్తున్నది ఏమీలేదు.
పైగా సోము వీర్రాజు పార్టీ పగ్గాలుచేపట్టిన కాణ్నించీ.. ఏపీలో బిజేపి ఎదుగూబొదుగు లేకుండా పడి ఉన్నదని.. కేంద్రంలో మోడీ ప్రాభవానికి తగిన వైభవం రాష్ట్రంలో ఏర్పడలేదనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మరింత అడ్డగోలు మాటలతో సోము వీర్రాజు రెచ్చిపోతున్నారు.
తాజాగా ఆయన పలుకుతున్న ప్రగల్భాలు ఎలా ఉన్నాయంటే.. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చిటికెల వ్యవదిలో పూర్తి చేయడానికి సిద్ధం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకుండా, కొర్రీలు పెడుతూ మీనమేషాలు లెక్కిస్తున్న కారణంగా నీరుగారిపోతున్న ఈ ప్రాజెక్టు గురించి.. కేంద్రం తప్పిదంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.
కాగా, కేంద్రాన్ని దోషిగా చూపించడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారంటూ సోము తాజాగా ఆరోపిస్తున్నారు. అక్కడికి అదేదో ప్రజలకు తెలియని సంగతిలాగా ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని, పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేసి చూపిస్తుందని సోము అంటున్నారు. ఇదంతా పెద్ద నాటకీయ డైలాగుల్లాగా ఆయన వల్లెవేస్తున్నారు.
నిజానికి పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వప్రాజెక్టు! తాను నిధులు కాజేయడానికి చంద్రబాబు చేసిన కుట్ర వల్ల.. రాష్ట్రప్రభుత్వం నిర్మాణం చేపట్టే వ్యవహారంలో భాగమైంది. చంద్రబాబు నిధులు బొక్కుతున్నాడని గుర్తించి.. కేంద్రం నిధుల్ని కట్టడి చేసేసింది. జగన్ సర్కారు వచ్చిన తర్వాత కూడా నిధులు ఇవ్వకుండా ఏడిపిస్తోంది.
అయితే సోము వీర్రాజు లాంటి వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. జగన్ కు సవాళ్లు విసరడం కాదు.. ఆయన సరిగా పనిచేయడం లేదని అనుకుంటే గనుక.. ఆయనను అంటే ఏపీ ప్రభుత్వాన్ని నిర్మాణ బాధ్యతలనుంచి పక్కకు తప్పించడం అనేది కేంద్రం చేతిలో పని! ఆ సంగతి వారు తెలుసుకోవాలి.
కేంద్రానికి చేతనైతే ఏపీ ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి.. నిర్మాణం మొత్తం వారే పూర్తి చేయవచ్చు. పోలవరం ద్వారా రాగల కీర్తి మొత్తం తమ ఖాతాకే కావాలని కోరుకోవచ్చు. అయితే కొత్తనాటకాలు షురూ చేయకుండా.. పోలవరం తొలుత ప్రకటించిన ఎత్తుతోనే అదే మాదిరిగి నిర్మాణం పూర్తి చేయాలి. జాతీయ ప్రాజెక్టుగా బాధ్యత మొత్తం వారిదే గనుక.. నిర్వాసితుల వ్యవహారం కూడా వారే చూడాలి.
చేతనైతే ఆ పని చేయాలి. అడ్డగోలు ప్రగల్భాలు పలుకుతూ ఉండే సోము వీర్రాజుకు తమ గోదావరి జిల్లాలకు, యావత్ రాష్ట్రానికి మేలుచేసే పోలవరం ప్రాజెక్టు మీద నిజంగానే అంత ప్రేమ ఉంటే గనుక.. కేంద్రం ద్వారానే ఏపీ ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి కేంద్రంతోనే పనులు పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు.