పలు సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి సంచలన విజయాలను నమోదు చేశాయి. చంద్రముఖి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల రీమేక్ బాలీవుడ్ లో సత్తా చూపించాయి. ఈ క్రమంలోనే విక్రమ్ వేదా కూడా నిలుస్తోంది. ఈ తమిళ సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ అయ్యి.. భారీ వసూళ్లను పొందుతూ ఉంది. హృతిక్ రోషన్ కు అవసరమైన హిట్ ను అందిస్తూ ఉంది. బాలీవుడ్ మార్కెట్ లో కాసులను పండిస్తోంది ఈ సినిమా.
మరి తమిళంలో సూపర్ హిట్ అయ్యి, ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఆ తరహా ఫలితాన్ని పొందుతున్న విక్రమ్ వేదాకు అక్కడ సీక్వెల్ ప్రయత్నాలు కూడా షురూ అయ్యాయని తెలుస్తోంది. ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే.. దానికి సీక్వెల్ అంటూ హడావుడి చేయడం బాలీవుడ్ లో కొత్త కాదు. ఈ క్రమంలోనే విక్రమ్ వేదా కు కూడా సీక్వెల్ రావడం ఖాయమని తెలుస్తోంది.
వాస్తవానికి విక్రమ్ వేదాను మొదట తీసిన తమిళులు దానికి సీక్వెల్ ప్రయత్నాలేవీ చేయలేదు. అయితే సీక్వెల్ అనేది బాలీవుడ్ లో మార్కెటింగ్ స్ట్రాటజీ. కథతో సంబంధం లేదని సీక్వెల్స్ కూడా బోలెడన్ని వచ్చాయి. హిట్ టైటిల్ ను పట్టుకుని దానికి పార్ట్ టు, త్రీ అంటూ తీస్తూనే ఉంటారు. భాగీ సీరిస్ ఈ తరహాదే. పలు రీమేక్ సినిమాలతో భాగీ సీరిస్ సినిమాలు వచ్చాయి.
మరి విక్రమ్ వేదా కూడా బాలీవుడ్ కు అలాంటి ఉత్సాహం ఇస్తోంది. ప్రత్యేకించి హృతిక్ రోషన్ ఆల్రెడీ సీక్వెల్ పార్ట్ గురించి తెగ మాట్లాడేస్తున్నాడు మీడియాతో. విక్రమ్ వేదా ఫస్ట్ పార్ట్ తో పెండింగ్ లో ఉన్న అంశాలన్నింటినీ సీక్వెల్ పార్ట్ తో పరిష్కరిస్తామంటూ మీడియాతో చెబుతున్నాడు ఈ హీరో. ఇలాంటి సీక్వెల్ ప్రకటనలు ప్రస్తుత సినిమాతో కలెక్షన్లను రాబట్టుకునే ప్రయత్నమే అయినా.. బాలీవుడ్ కు ఇదో మార్కెటింగ్ స్ట్రాటజీ కాబట్టి సీక్వెల్ వచ్చినా ఆశ్చర్యం లేదు.