ఇప్పటికే జయలలిత జీవితంపై సినిమాలు, వెబ్ సీరిస్ లు అంటూ వ్యవహారాన్ని అరగదీశారు. రమ్యకృష్ణ జయలలిత పాత్రలో కనిపిస్తోందంటూ హడావుడి చేసిన క్వీన్ వెబ్ సీరిస్ పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోయింది. ఆ వెబ్ సీరిస్ ఇప్పుడు ఒక టీవీ చానల్ లో ప్రసారం అవుతూ ఉంది. దాని నాణ్యత చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.
దాని కన్నా కొన్ని తమిళ సీరియల్సే కొంచెం నాణ్యతతో తీస్తారేమో. అంత నాసికరమైన చిత్రీకరణ తో ఉంది ఆ వెబ్ సీరిస్. రమ్యకృష్ణ కనిపించే పార్ట్స్ సంగతేమో కానీ వేర్వేరు నటీమణులు శక్తి పాత్రలో కనిపించే సీన్లు మరీ నాసికరకంగా ఉన్నాయి. నటీనటులు ఏదో తమ డైలాగులను ఒప్పజెప్పి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తారు. సుదీర్ఘమైన సీన్లలో కూడా కెమెరా యాంగిల్ కూడా మారదు! లాంగ్ షాట్ పెట్టి వాళ్లిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నట్టుగా కొన్ని ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించేశారు. ఆ స్థాయిలో ఉంది క్వీన్ నాణ్యత!
ఆ సంగతలా ఉంటే..జయలలిత జీవితంపై సినిమాగా ప్రచారం చేసుకుంటున్న 'తలైవీ' గురించి అందులో నటిస్తున్న కంగనా రనౌత్ ఒక విషయాన్ని చెప్పింది. అదేమిటంటే.. ఆ సినిమా ను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు భారీ ధరకు అమ్మారట. హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఆ సినిమాను 55 కోట్లకు అమ్మినట్టుగా కంగనా చెప్పుకొచ్చింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ రెండింటికీ ప్రసార హక్కులను అమ్మారట.
అయినా ఆ సినిమాను డైరెక్టుగా ఓటీటీల్లో విడుదల చేయరట. థియేటరికల్ రిలీజ్ తర్వాతే ఆ సినిమా ఓటీటీల్లో విడుదల అవుతుందని కంగనా చెప్పింది. ఇప్పటికే జయలలిత లుక్ లో కంగనా గెటప్ పై విమర్శలు వచ్చాయి. ఆ ఫస్ట్ విడుదలప్పుడు ట్రోల్స్ తప్పలేదు. అయినా పెద్దమొత్తానికే ఆ సినిమా వెబ్ ప్రసార హక్కులు అమ్ముడయినట్టుగా ఉన్నాయి.