కార్యకర్తలు హర్ట్ అవుతున్నారు.. జగన్ కు కొత్త తలనొప్పి

అవినీతిని తరిమేస్తాం, అన్నింటా పారదర్శక పాలన కొనసాగిస్తూమంటూ సీఎం జగన్ ఓవైపు చెబుతుంటే.. మరోవైపు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, చోటా నేతలు మాత్రం టీడీపీ హయాంలో లాగా తమకు న్యాయం జరగకపోదా అని ఎదురు…

అవినీతిని తరిమేస్తాం, అన్నింటా పారదర్శక పాలన కొనసాగిస్తూమంటూ సీఎం జగన్ ఓవైపు చెబుతుంటే.. మరోవైపు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, చోటా నేతలు మాత్రం టీడీపీ హయాంలో లాగా తమకు న్యాయం జరగకపోదా అని ఎదురు చూస్తున్నారు. అడ్డదారుల్లో అయినా సరే పార్టీ మమ్మల్ని తృప్తి పరుస్తుందని అంచనా వేసుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే గూడూరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు కార్యకర్తల ఆందోళన.

వాలంటీర్ల పోస్టుల్లో వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేదని ఏకంగా ఎమ్మెల్యే ఆఫీస్ ముందే నిరసన తెలియజేశారు పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్షం దీన్ని భూతద్దంలో చూపించినా ఇది వాస్తవంగా జరిగిన విషయమే. వీళ్లు బైటపడ్డారు కానీ, చాలాచోట్ల కార్యకర్తలు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ హయాంలో నిరుద్యోగ భృతి రాక, వైసీపీ వచ్చాక ఉద్యోగాలు రాక ఇంక మనం దేనికి అని ఆలోచిస్తున్నారు.

ముఖ్యంగా వాలంటీర్ పోస్టులు, సచివాలయ పోస్టులపై వైసీపీ వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు సచివాలయాల పోస్టులపై ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ క్యాడర్ కు మేమున్నామంటూ సంకేతాలు పంపించారట. వసూళ్ల దందా కూడా మొదలైందని వినికిడి.

ఈ విషయం బైటకు పొక్కబట్టే.. హడావిడిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేదీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. “గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా వారి మాటలు నమ్మొద్దు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తా”మంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఎక్కడో ఏదో జరుగుతోందనే అనుమానానికి ఈ స్టేట్ మెంట్ బలం చేకూరుస్తోంది. జగన్ ఆశయం గొప్పదే అయినా, అమలులో లోపాలుంటే అది అభాసుపాలుకాక తప్పదు. వాలంటీర్ల పోస్టుల భర్తీలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుంది. నమ్ముకున్న వాళ్లకి ఉద్యోగాలివ్వకపోతే హర్ట్ అవుతారు, పోనీ పైరవీలకు చోటిద్దామంటే ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయి. దీంతో స్థానిక నేతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

కాంట్రాక్ట్ పోస్టులే కదా, కనీసం వీటిలో కూడా న్యాయం చేయరా అన్నట్టు చూస్తున్నారు కార్యకర్తలు. జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అధికారులకు క్లారిటీ ఇవ్వకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉంది. ప్రతిభకు పెద్దపీట వేసి, పారదర్శకంగా పోస్టుల భర్తీ జరిగితేనే జగన్ పై సామాన్య ప్రజలకు నమ్మకం కుదురుతుంది. అది జరగాలంటే కార్యకర్తలను బుజ్జగించాల్సిందే. ఎలా బుజ్జగిస్తారనేది ఇప్పుడు జగన్  చేతుల్లోనే. ఈ వ్యవహారాన్ని ఎంత తొందరగా ముగిస్తే అంతమంచిది. లేదంటే ముఖ్యమంత్రికి కొత్త తలనొప్పులు తప్పవు.

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!