తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడు షమాస్ సిద్దిఖీ ట్విట్టర్లో ఎట్టకేలకు స్పందించాడు. అయితే ఆ ఆరోపణలను మాత్రం ఖండించకపోగా, వాటి వెనుక మరెవరో ఉన్నారంటూ ప్రత్యారోపణలకు దిగాడు. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలకు అతని సమాధానం మరింత బలం చేకూర్చినట్టైంది.
విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కుటుంబ కొన్ని రోజులుగా తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. నవాజుద్దీన్పై ఆయన రెండో భార్య పలు ఆరోపణలు చేయడంతో పాటు విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే. ఆ గొడవ ఒక వైపు నడుస్తుండగానే మరోవైపు ఆయన తమ్ముడిపై లైంగిక ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. వరుసకు కూతురయ్యే జమీనాని లైంగికంగా వేధించాడని నవాజుద్దీన్ తమ్ముడిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ తమ్మడు షమాస్ సిద్ధిఖీ తన ట్విట్టర్ వేదికగా తాజాగా స్పందించాడు. ఆయన ఏమంటారంటే…
‘కొందరు చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్మెంట్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు లేదు. కాని ఢిల్లీ పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో కొత్తగా చేర్చారు. ఈ అసత్య ప్రచారాలని మీడియాలో ప్రచారం చేయడం వెనుక ఓ వ్యక్తి ఉందనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తుంది. త్వరలో నిజాలేంటో బయటపడుతాయి’ అని షమాస్ పేర్కొన్నాడు.
ఈ ట్వీట్లో ఎక్కడా తాను లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఖండించలేదు. పైగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణల ప్రచారం వెనుక ఓ వ్యక్తి ఉందంటున్నాడే తప్ప, అసలు తాను అలాంటి ఘటనకు పాల్పడలేదని మాత్రం చెప్పలేదు.
బాధితురాలు జమీనా రెండురోజుల క్రితం ఢిల్లీ పోలీసులకి నవాజుద్దీన్ తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. తొమ్మిదేళ్ల వయస్సులో వరుసక తండ్రి అయ్యే వ్యక్తి తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.