జగన్ పై విమర్శలు.. బీజేపీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి భారతీయ జనతా పార్టీ చాలా అత్యుత్సాహాన్ని చూపుతూ ఉంది. జగన్ ఇజ్రాయెల్ పర్యటనను కూడా రాజకీయం చేయాలని బీజేపీ భావించింది. జగన్…

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడానికి భారతీయ జనతా పార్టీ చాలా అత్యుత్సాహాన్ని చూపుతూ ఉంది. జగన్ ఇజ్రాయెల్ పర్యటనను కూడా రాజకీయం చేయాలని బీజేపీ భావించింది. జగన్ కుటుంబ పర్యటనకు ప్రభుత్వ నిధులను వాడారంటూ కమలం పార్టీ వాళ్లు రచ్చ చేయాలని ప్రయత్నించారు. అయితే అందులోని అసలు కథ బయటకు రావడంతో కమలనాథులు ఇప్పుడు కామ్ అయిపోవాల్సి వస్తోంది.

జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని ఇజ్రాయెల్ తీసుకెళ్లారని, అది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటన అని, దానికోసం ప్రభుత్వ ఖాతా నుంచి ఇరవై రెండు లక్షల రూపాయలు వాడారని బీజేపీ వాళ్లు ముందుగా విమర్శలు మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ఇజ్రాయెల్ పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగత ఖర్చులతో సాగుతున్నదే అని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.

జగన్ మోహన్ రెడ్డి, ఆయన కుటుంబీకుల పర్యటన ఖర్చులు పూర్తిగా వారే పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన భద్రతా ఏర్పాట్లు మాత్రం ప్రభుత్వం బాధ్యత. మామూలుగా అయితే అది ఖర్చులేని వ్యవహారం. ఎందుకంటే ఉన్నత పదవుల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లినప్పుడు వారి వారి భద్రతా ఏర్పాట్లను ఆయా దేశాలే చూసుకుంటాయి.

దౌత్యపరంగా ప్రతిదేశం మరో దేశంతో ఇలాంటి సంబంధాలు కలిగి ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ప్రత్యేకం. తమ దేశానికి వచ్చిన ఇతర దేశాల రాజకీయ ముఖ్యుల భద్రతా ఏర్పాట్లకు ఆదేశం ముందుకురాదు. ఎవరి భద్రత వారే చూసుకోవాలనేది ఆ దేశం పెట్టుకున్న నియమం. ఆదేశంలోని ప్రముఖులు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా భద్రతా ఏర్పాట్లు వారే చూసుకుంటారు.

అదేరకంగా ఇప్పుడు జగన్ భద్రతా ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వమే చూసుకోవాల్సి వచ్చింది. అందుకోసం అక్కడి ఒక ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్నారు. అందుకోసం డబ్బులు వెచ్చించాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. జగన్ విమాన ఖర్చులకు, తన కుటుంబీకుల ఖర్చులకు ప్రభుత్వ ఖాతా నుంచి డబ్బులు వాడినట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేశారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు రీతిన మాట్లాడారు.

'కామ్రేడ్'కు నిర్వచనం అదా!