అగ్ర హీరోల మధ్య పోటీ తీవ్రమైన దశలో ప్రతి స్టార్ హీరో మార్కెట్ పెంచుకునే భారీ చిత్రాలపై దృష్టి పెడుతున్నాడు. ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలే చేస్తోండగా, ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ రాజమౌళి సినిమాతో బిజీగా వున్నారు. ఈ టైమ్‌ని అల్లు అర్జున్ తనకి అనుకూలంగా వాడుకుంటున్నాడు. అగ్ర హీరోలలో ముగ్గురు బిజీ అయిపోవడం, పవన్‌కళ్యాణ్ రిటైర్మెంట్ తీసుకోవడంతో మార్కెట్లో పెద్ద హీరోల సినిమాలు లేని లోటు పెరిగింది.
అందుకే అల్లు అర్జున్ వరుసగా చాలా చిత్రాలని క్యూలో పెడుతున్నాడు. త్రివిక్రమ్‌తో చిత్రం పూర్తి కాకముందే సుకుమార్ చిత్రం కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో వుంది. త్రివిక్రమ్ చిత్రం పూర్తి కాగానే దీని పనులు వేగం పుంజుకుంటాయి. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్లో 'ఐకాన్' చేయనున్నాడు. అలాగే బోయపాటి శ్రీనుతో మళ్లీ గీతా ఆర్ట్స్‌లో ఒక మాస్ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.
వచ్చే యేడాదిలో త్రివిక్రమ్ సినిమాతో సహా మొత్తం మూడు సినిమాలు రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ ప్రణాళిక వేసుకున్నాడు. ఒకవేళ ఆ ప్లాన్ అనుకున్నట్టు అమలు చేయలేకపోయినా, సంక్రాంతి నుంచి సంక్రాంతికి మూడు సినిమాలు రావడమయితే ఖాయం. టైమ్ చూసి అల్లు అర్జున్ స్పీడ్ పెంచడంతో బిజినెస్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆనందిస్తున్నారు.