కేసీఆర్ అక్కడ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు?

తెలంగాణా సీఎం కేసీఆర్ చాలా కాలంగా ఊరిస్తున్న జాతీయ పార్టీ సాకారమయ్యే రోజు వస్తోంది. మొదట్లో ఆయన థర్డ్ ఫ్రంట్ అంటూ దేశమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగారు. చాలామంది నాయకులని కలుసుకున్నారు. మంతనాలు…

తెలంగాణా సీఎం కేసీఆర్ చాలా కాలంగా ఊరిస్తున్న జాతీయ పార్టీ సాకారమయ్యే రోజు వస్తోంది. మొదట్లో ఆయన థర్డ్ ఫ్రంట్ అంటూ దేశమంతా కాలికి బలపం కట్టుకొని తిరిగారు. చాలామంది నాయకులని కలుసుకున్నారు. మంతనాలు జరిపారు. కానీ ప్రయోజనం కలగలేదు. ఈయన నాన్ బీజేపీ కూటమి అంటే ఏమైనా వర్కవుట్ అయ్యేదేమో. కానీ నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి అనేసరికి ఈయన జాతీయ నాయకులు అనుకునేవారు దాన్ని ఒప్పుకోలేదు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఏమిటి అంటూ పెదవి  విరిచారు. ఇదిలా నడుస్తుండగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన బిహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆయన కేసీఆర్ లా కాకుండా కాంగ్రెస్ ను కూడా కలుపుకుపోతున్నారు. 

థర్డ్ ఫ్రంట్ అంటే లాభం లేదననుకున్న కేసీఆర్ ఏకంగా జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది కాలమే చెప్పాలి. కేసీఆర్ జాతీయ పార్టీ పేరు దాదాపు ఖరరాయిందని.. భారతీయ రైతు సమితిగా ప్రకటింవచ్చని ప్రచారం జరుగుతోంది. అక్టోబరు 5న తెలంగాణ భవన్‌లో జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారు.

టీఆర్‌‌ఎస్‌‌ ఎన్నికల గుర్తయిన ‘కారు’నే జాతీయ పార్టీకి కూడా వర్తింపచేయాలని  తీర్మానం చేస్తారట. జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా వారు పాల్గొంటారట. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించే తీర్మానాన్ని ఇప్పటికే ఖరారు చేశారు.

అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌‌ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. పార్టీ సెక్రటరీ జనరల్‌‌ కె. కేశవరావుతో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేస్తుంది. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 పార్లమెంట్‌‌ సీట్లలో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. ఒకప్పటి (నిజాం పాలనలోని) హైదరాబాద్‌‌ సంస్థానంలో ఉన్న  ప్రస్తుత తెలంగాణ, కర్నాటకలోని బీదర్‌‌, గుల్బర్గా, ఉస్మానాబాద్‌‌, రాయచూర్,  మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌, పర్భణీ, నాందేడ్‌‌, బీడ్‌‌ ప్రాంతాలపై ప్రధానంగా ఫోకస్‌‌ పెట్టనున్నట్లు సమాచారం. వీటితో పాటు దేశవ్యాప్తంగా బలమైన రైతు ఉద్యమ నేతలు ఉన్న ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. అక్కడ రైతు ఉద్యమ నేతలను ఎన్నిక బరిలో దింపాలన్న యోచనలో ఆయన ఉన్నారు. 2024 పార్లమెంట్‌‌ ఎన్నికల్లో కనీసం 50 లోక్‌‌సభ స్థానాల్లో కారు గుర్తుపై అభ్యర్థులను దించేలా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారట. 

కర్నాటకలో సినీ నటుడు ప్రకాశ్‌‌ రాజ్‌‌, గుజరాత్‌‌లో ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్‌‌ సింగ్‌‌ వాఘేలా కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశముందని సమాచారం. ఏపీలోనూ కేసీఆర్‌కు అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశముంది. ఏపీలో ఎన్ని పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తారో చూడాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి.. ఫలితాల ఆధారంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. వీటన్నింటిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

మొత్తం మీద కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ జాతీయ పార్టీకి కూడా అధ్యక్షుడిగా ఉంటారు. మరి ఇలా రెండు పార్టీలకు ఒక్కడే చీఫ్ గా ఉండవచ్చా? లేదా గులాబీ పార్టీకి కేటీఆర్ ను అధ్యక్షుడిగా చేస్తారా? కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నప్పుడు గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తుందా? చేయదా? అది అసెంబ్లీ ఎన్నికలకే పరిమితమవుతుందా? ఇలాంటి చాలా సందేహాలను కేసీఆర్ నివృత్తి చేయాల్సి ఉంటుంది.