తెలుగుదేశం పార్టీ తనవైన వ్యూహాలతో రెచ్చిపోతోంది. చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసుల నేపథ్యాన్ని తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా తమవైన రీతిలో, తమవైన రాతలతో రెచ్చిపోతూ ఉండటం గమనార్హం! చిన్న పిల్లలపై దాడి, చిన్న పిల్లలు.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మొదలుపెట్టి.. నారా లోకేష్ బాబు, పచ్చ మీడియా.. వరస కథనాలను వండి వారుస్తూ ఉన్నారు. ఇదే పాయింట్ ను సామూహికంగా హైలెట్ చేస్తూ తమదైన గోబెల్స్ ప్రయత్నాన్ని చేస్తూ ఉండటం గమనార్హం!
మరి ఇంతకీ అక్కడేం జరిగింది? కొన్నాళ్ల నుంచి ఏం జరుగుతోందనే అంశం గురించి వాకబు చేస్తే.. విశ్వసయనీయ సమాచారం ప్రకారం ఆసక్తిదాయకమైన విషయాలు తెలుస్తున్నాయి. వాస్తవానికి విజయ్ ను వివిధ కేసుల్లో అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు చాన్నాళ్లుగానే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. నోటి దురుసు అధికంగా కలిగిన విజయ్ ఇది వరకే బాహాటంగా రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అతివాది వలే.. ఒక రకమైన తీవ్రవాది తరహాలో మాట్లాడటం .. ఆయనకు అలవాటే. ఈ విషయంలో తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు తీసిపోడు విజయ్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల మీదే కాదు..గతంలో చిరంజీవి పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది ఇతడికి. కట్ చేస్తే.. చింతకాయల విజయ్ ను వివిధ కేసుల విషయంలో అరెస్టుకు ఏపీ పోలీసులు చాన్నాళ్లుగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. విజయ్ తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు! ఎంతలా అంటే.. వరసగా ఫోన్ నంబర్లను కూడా మార్చేస్తూ తన జాడ చిక్కకుండా చూసుకుంటున్నాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉంటున్నాడు విజయ్. ఈ క్రమంలోనే పాతిక సిమ్ ల వరకూ మార్చేశాడంటే ఇతడి పరారీ ప్రయత్నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఎట్టకేలకూ విజయ్ జాడను గుర్తించి పోలీసులు అరెస్టు ప్రయత్నం చేయగా… ఈ సారి చిన్న పిల్లలను అడ్డు పెట్టుకుని, ఆడవాళ్లను ముందుకు తోసి వెనుక వైపు నుంచి పారిపోయాడు విజయ్. ఇతడి ఇంటికి పోలీసులు చేరుకోగానే.. ముందు వైపుకు పిల్లలను, ఆడవాళ్లను పంపించి.. దొడ్డిద్వారం నుంచి విజయ్ పరారీ అయినట్టుగా తెలుస్తోంది. అరెస్టుకు భయపడి.. ఇలాంటి టెక్నిక్ ప్రయోగించారు.
ఇక వాళ్లే చిన్న పిల్లలను ముందుకు తోసి.. పోలీసులు పిల్లలతోనూ, ఆడవాళ్లపైనా దాడి చేసినట్టుగా కట్టుకథలు అల్లుతున్నారు చంద్రబాబు, లోకేష్ బాబు, పచ్చ మీడియా వర్గాలు! పరారీ కోసం ఆడవాళ్లను, పిల్లలను అడ్డు పెట్టుకుని… దొంగదారిలో పారిపోయి, ఇలా పిల్లలపై దాడి అని, ఆడవాళ్లపై దాడి అంటూ కట్టుకథలు తెలుగుదేశం పార్టీకే సాధ్యం అవుతోంది కాబోలు. పారిపోయి.. ఇలా గగ్గోలు పెట్టి.. తమ గోబెల్స్ ప్రచారాన్ని నమ్మించడానికి తెలుగుదేశం వర్గాలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి!