వీఐపీలు, వీవీఐపీలు తిరుమలకు వస్తున్నారంటే… ప్రొటోకాల్ అధికారులు వేచి వుండడం చూస్తుంటాం. కానీ వాళ్లకంటే ముందు బీజేపీ నాయకుడు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి కాచుకుని ఉండడం కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధు గత రెండు రోజులుగా తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్నారు. తిరుమల శ్రీవారు, పద్మావతి అమ్మవారిని తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె దర్శించుకున్నారు.
అయితే వారికి ప్రొటోకాల్ దర్శనం చేయించడంతో పాటు చేసుకున్న ప్రముఖుడిగా భానుప్రకాశ్‌రెడ్డి వార్తలకెక్కడం గమనార్హం. ఎక్కడైనా అధికార పార్టీ నేతల హడావుడి చేస్తుండడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకుంది. ఇది వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నారు. తెల్లారి లేచినప్పటి నుంచి జగన్ క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని తిరుమల శ్రీవారి కేంద్రంగా ఏపీ ప్రభుత్వంపై హిందుత్వ వ్యతిరేక ముద్ర వేయడానికి భానుప్రకాశ్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు.
అలాంటి వ్యక్తికి టీటీడీ అధికారులు పెద్ద పీఠ వేయడం ఏంటో వైసీపీ నేతలు, కార్యకర్తలకు భేతాళ ప్రశ్నలా మిగిలింది. ఇదే వైసీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఒకట్రెండు బ్రేక్ దర్శనాలు ఇప్పించుకోవాలంటే తల ప్రాణం తోకకు వస్తున్నట్టు వాపోతున్నారు. అలాంటిది బీజేపీ నేతకు మాత్రం అదెలా సాధ్యమో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీలో అంతా తానై వ్యవహరిస్తున్న ఓ కీలక అధికారి… దర్శనాల విషయంలో తనిష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచి ఉన్నాయి.
అలాంటిది జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని 24 గంటలూ తూర్పార పట్టే ప్రతిపక్ష నేత టీటీడీలో అధికార దర్పం ప్రదర్శించడంపై వైసీపీ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన వరకూ ఒక్క విమర్శ లేకుంటే చాలు, ప్రభుత్వాన్ని, జగన్‌ను ఎన్ని తిట్లు తిట్టినా ఫర్వాలేదనే భావనతోనే ఓ అధికారి భానుకు టీటీడీలో ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలున్నాయి.
అధికారంలోకి ఉన్న పార్టీగా తమ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకపోగా, తమ పార్టీని తిట్టేవాళ్ల హవా కొనసాగడంపై వైసీపీ శ్రేణులు కినుక వహిస్తున్నాయి. టీటీడీ అధికారుల స్వార్థం… అంతిమంగా వైసీపీ శ్రేణులకు మూడు నామాలు పెడుతోందనే వాదన కూడా లేకపోలేదు.