రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపకపోతే లక్షమందితో వచ్చి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని కూల్చేస్తామంటూ తాజాగా ఓయూ జేఏసీ హెచ్చరించింది. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల సంచలన వ్యాఖ్యల వెనక ఎవరున్నారనే విషయం బహిరంగ రహస్యం. టీఆర్ఎస్ ప్రోద్బలంతోనే పక్క రాష్ట్రంలోని ప్రాజెక్ట్ పై ఆ స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఓయూ జేఏసీ. ఇలా రెండు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది టీఆర్ఎస్.
గతంలో లక్షనాగళ్లు పెట్టి రామోజీ ఫిలింసిటీని దున్నేస్తామని హెచ్చరించిన కేసీఆర్, ఆ తర్వాత ఏం చేశారు? ఎవరితో లాలూచీ పడ్డారు? ఎవరికి మేలు చేశారనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు లక్షనాగళ్లు పెద్ద హాట్ టాపిక్ అయితే ఇప్పుడు లక్షమందితో కూల్చివేత మరో హాట్ టాపిక్.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేరట్ ని కూల్చేస్తామంటూ ఓయూ జేఏసీ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా టీఆర్ఎస్ రాజకీయ స్వలాభం కోసమేనంటున్నాయి ప్రతిపక్షాలు. రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడాలను రెచ్చగొట్టేందుకే ఇలా మాట్లాడించారని చెబుతున్నారు.
కృష్ణా-గోదావరి జలాలు.. కేంద్ర ఆధిపత్యం అనే అంశంపై ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు వినిపించాయి. ప్రాజెక్టుల్లో నిల్వఉంచిన సాగునీటిని, విద్యుత్ అవసరాల కోసం వృథాగా సముద్రం పాలు చేయడం తెలంగాణకు సబబేనా..? ఆ మాట అడిగినందుకు, విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేంద్రానికి లేఖ రాసి, సుప్రీంలో కేసు వేసినందుకు ఇలాంటి హెచ్చరికలు చేస్తారా..?
రాయలసీమ జీవనాడిగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటే తెలంగాణ నాయకులకు అంత తేలికగా కనపడుతుందా..? కేవలం ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, తెలంగాణ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని తెలుస్తోంది.
సవాళ్లు విసరడం, ఆ తర్వాత సాగిల పడటం కేసీఆర్ కి అలవాటే. అప్పుడు ఫిలింసిటీ విషయంలో ఏం జరిగిందో… ఇప్పుడు ఏపీ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే అప్పటికప్పుడు ఆ అంశాన్ని రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడం మాత్రం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతోంది. రాయలసీమపై కత్తిగట్టి.. తెలంగాణలో సెంటిమెంట్ ని మరో సారి రెచ్చగొడుతున్నారు కేసీఆర్.