లోకేష్ కు ధైర్యం ఉంటే ఈ ఒక్క పని చేయాలి!

ట్విట్టర్ లో అదే పనిగా విమర్శలు, వెక్కిరింతలు, హద్దులు దాటి ఆరోపణలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు, ఈ దఫా వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావంటూ…

ట్విట్టర్ లో అదే పనిగా విమర్శలు, వెక్కిరింతలు, హద్దులు దాటి ఆరోపణలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు, ఈ దఫా వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావంటూ సినిమా డైలాగులు.. నిజంగా లోకేష్ కు అంత పట్టుదల, దమ్ము, కసి ఉంటే ఆయన తన తాత పేరు నిలబెట్టే పని ఒకటి చేయాలని వైసీపీ నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అదే గుడివాడ నియోజకవర్గం.

గుడివాడ మామూలు సంగతి కాదు..

గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. స్వయానా పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ గెలిచిన నియోజకవర్గం. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2014 వరకు ఒకే ఒక్కసారి మినహా మిగతా అంతా అక్కడ టీడీపీయే గెలిచింది. 

రెండుసార్లు టీడీపీ నుంచి మరో రెండుసార్లు వైసీపీనుంచి కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడాయన మంత్రి పదవిలో ఉన్నారు. ఒకప్పటి టీడీపీ కంచుకోట గుడివాడలో ఇప్పుడు కొడాలి నానిని ఢీకొంటే లోకేష్ సత్తా ఏంటో తెలిసిపోతుంది. పనిలోపనిగా తాతకు తగ్గ వారసుడు అనిపించుకున్నట్టు అవుతుంది.

మంగళగిరికే దిక్కులేదు..

మంత్రి పదవిలో ఉండి, తండ్రి సీఎంగా ఉండి కూడా, తాము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలోనే లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. అలాంటిది గుడివాడలో గెలుస్తాడంటే అది అత్యాశే అవుతుంది. కానీ గుడివాడలో లోకేష్ బరిలో దిగితే మాత్రం డిక్కీ బలిసిన కోడి, కొడాలి చికెన్ షాప్ ముందుకి వచ్చి తొడగొట్టినట్టే లెక్క.

నిజంగానే జనాల్లో వైసీపీపై నమ్మకం పోయిందని టీడీపీ గట్టిగా నమ్మితే, మంత్రి నానిని ఆయన నియోజకవర్గ ప్రజలే దూరం పెట్టారనే లోకేష్ మాట నిజం అయితే.. ఆయనే అక్కడినుంచి పోటీ చేస్తానని సవాల్ విసరొచ్చు కదా..? తాత నియోజకవర్గంలో పోటీ చేసి మైలేజీ పెంచుకోవచ్చు కదా. కానీ కొడాలి విమర్శలనే తిప్పికొట్టడం చేతగాని లోకేష్, ఆయనపై పోటీ చేసి నెగ్గడం అసాధ్యమని తెలిసే ఆ ధైర్యం చేయడంలేదు.

వచ్చే ఎన్నికల్లో నానికి డిపాజిట్లు కూడా రావని చెప్పే లోకేష్, టీడీపీకి అంత బలం ఉందని అనుకుంటున్న ఆ నియోజకవర్గం నుంచి తాను పోటీచేస్తానని మాత్రం చెప్పకపోవడం విశేషం. నిజంగా అంత దమ్ము, ధైర్యం ఉంటే గుడివాడ నుంచి నానికి పోటీగా లోకేష్ దిగాలి. అదే అతడి రాజకీయ సమర్థతకు అసలైన కొలమానం.

గెలుపోటముల సంగతి పక్కనపెడితే, లోకేష్ గుడివాడలో పోటీకి సై అంటే.. నాని రాజీనామా చేయడానికైనా సై అంటారు. అందుకే ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ లోకేష్ ఆ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. మంత్రులెవరికీ వచ్చేసారి డిపాజిట్లు రావంటున్న లోకేష్.. ఆ నియోజకవర్గాల్లో ఒక్కదానిలో కూడా తాను పోటీ చేస్తానని చెప్పకపోవడం విశేషం.